
ఇంగ్లీషు రచయితలు ఎవరైనా కథలు రాసి వాటికి తెలుగు పేర్లో, తమిళం పేర్లో పెడితే ఎంత వికారంగా అర్థరహి తంగా వుంటుందో తెలుగు కథలకు ఇంగ్లీషు పేర్లు పెట్టడమూ అలాగే వుంది. కథకు ఇంగ్లీషు పేరు పెడితే ఎంత మంచి పాఠకులకైనా ఆ భాష బాగా రానివారికి ఆ కథ చదవాలని అనిపించదు. కథ ఉన్న పేజీ తిప్పి మరో శీర్షిక లోనికి వెళ్ళిపోతారు.
వ్యాపార రచయితలు వేరు. వాళ్లు బడాయికీ, డాంబికానికీ తమ రచనలకు ఇంగ్లీషు పేర్లు పెడుతుంటారు. ప్రజాపక్షం వహించి ప్రజలకి మేలు కలగాలనే అంకితభావంతో రచనలు చేసేవాళ్లు కూడా తమ కథలకి ఇంగ్లీషు పేర్లు పెట్టడం చిత్రం.
ఎంతో మంచి కథలు రాసిన పాత తరం రచయితలు ఎవరూ కథలకి ఇంగ్లీషు పేర్లు పెట్టలేదు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 76 కథలు రాశారు. వాటిలో ఒక కథకి మాత్రమే ఇంగ్లీషు పేరు పెట్టారు. అది ‘లీగల్ అడ్వైస్’. మరో కథకి ‘పోలీసు’ అని పేరు పెట్టారు. కానీ ఇది అర్థం చేసుకోవచ్చు. పోలీసు, పోస్టుమాన్, రైలు, రోడ్డు, ఇంటర్వ్యూ, మీటింగ్, ఫోను, ఇంటర్నెట్... లాంటి ఇంగ్లీషు పదాలకి తెలుగు పదాలు ఎవరైనా కనిపెట్టినా అవి పెద్దగా చెలామణీ కాలేదు. క్రమంగా మరుగునపడిపోయాయి. ఇంగ్లీషు అన్యభాషా పదాల్ని తనలో ఎలా ఇముడ్చుకుందో అలాగే తెలుగులోకూడా కొన్ని అంతర్భాగమైపోయాయి. అందుకే ఈ శ్రీపాద కథల పేర్లను ఇంగ్లీషు పేర్లుగా భావించనక్కరలేదు. నిజానికి శ్రీపాద ఇంగ్లీషుని అంతగా ఇష్టపడకపోగా ద్వేషిం చాడు కూడా. ఆయన మీద సంస్కృతం ప్రభావం ఉంది. ఆయన కథల పేర్లు కొన్ని: ‘అపిదళిత వజ్రస్య హృదయమ్’, ‘యావజ్జీవహోష్యామి’, ‘షట్కర్మ యుక్తా’, ‘శుభికే! శిర ఆరోహ’, ‘కన్యాకాలేయత్నాద్వరితా’.
గుంటూరు జిల్లా శ్రామికుల, రైతుల, కష్టజీవుల బాధల్నీ, వేదనల్నీ, జీవిత ఘర్షణల్నీ అద్భుతంగా, పామర భాషలో అక్షరీకరించిన మా.గోఖలే 50 కథలు రాశారు. వాటిలో ఒక్క కథకు కూడా ఇంగ్లీష్‌లో పేరు పెట్టలేదు. అన్నీ తెలుగు శీర్షికలే, అవి కూడా గుంటూరు మాండలీకంలోనే వున్నాయి. ఇదే జిల్లాకి చెందిన త్రిపుర నేని గోపీచంద్ 105 కథలు రాశారు. వాటిలో రెండు కథల పేర్లు: ‘‘కథకి ‘క్లయిమాక్స్’ ’’, ‘‘ ‘పుష్’ అనే చొరవ’’. ఈ రెండు కథల పేర్లలో వచ్చిన ఇంగ్లీష్ పదాల్ని రచయితే కొటేషన్స్‌లో పెట్టాడు, అవి అన్య భాషాపదాలని సూచిస్తూ. మిగతా 103 కథల పేర్లూ తెలుగులోనే ఉన్నాయి.
విప్లవ రచయితల సంఘం ప్రచురించిన కొడవటిగంటి కుటుంబ రావు సమగ్రరచనల సంకలనాల్లో నా దృష్టికి వచ్చిన కథలు మొత్తం 254. అందులో 7 కథలకు ఇంగ్లీషు పేర్లు ఉన్నాయి. అవి: 32 డౌన్ క్రాసింగ్, ఎక్స్ట్రా, సినిమాస్టార్, ఫాలౌట్, బ్లాక్‌మార్కెట్, ఫోర్త్ డైమన్షన్, ట్యూషన్. ఇక చాసో మొత్తం కథల్లో 3 పేర్లు ఇలా ఉన్నాయి: ‘ఫారిన్ అబ్బాయి’, ‘జంక్షన్లో బడ్డీ’, ‘ప్రెసిడెంటు లక్ష్మీకాంతం’. ఫారిన్, జంక్షన్, ప్రెసిడెంట్... ఇవి తెలుగు పదాల్లోనే కలిసిపోయాయి. కె.ఎన్.వై పతంజలి 44 కథల్లో ‘అడస్ట్ స్టోరీ’ ఒక్కటే ఇంగ్లీషు శీర్షిక. రావిశాస్త్రి 43 కథల్లో రెండు కథలకే సగం ఇంగ్లీషూ, సగం తెలుగు పదాలతో వున్న కథా శీర్షికలు ఉన్నాయి. వీటిలో ఇంగ్లీషు పదాల్ని కొటేషన్లలో పెట్టారు. అవి: ‘‘ ‘ది స్మోకింగ్ టైగర్’ అను పులిపూజ’’, ‘‘బేడ ‘ట్రాజడీ’’’. కాళీపట్నం రామారావు 53 కథలు రాశారు. వాటిలో ‘నో రూమ్’, ‘ప్లాట్‌ఫారమ్’ ఇంగ్లీషు పేర్లతో ఉన్నాయి. వీరంతా పాత తరం రచయితలు. వీళ్లు చాలా అరుదుగా, అతితక్కువగా తమ కథలకు ఇంగ్లీషు పేర్లు పెట్టారు. వర్తమానం లోనికి వస్తే, కొందరు రచయితలు తమ కథలకే కాదు, పుస్తకాలకు కూడా ఇంగ్లీషు పేర్లు పెడుతున్నారు. అంపశయ్య నవీన్ రాసిన 23 కథల సంపుటికి పేరు ‘ఫ్రమ్ అనూరాధ, విత్ లవ్’. వివిన మూర్తి ‘వాల్ పేపర్’ పేరుతో ఒక సంపుటి తెచ్చారు. గీతాంజలి తన కథా సంపుటికి పెట్టిన పేరు ‘హస్బెండ్ స్టిచ్’.
నా పరిశీలనలో రచయితల కంటే రచయిత్రులే తమ కథలకి ఎక్కువగా ఇంగ్లీష్ పేర్లు పెట్టారని గమనించాను. ఇవి చూడండి: పి.సత్యవతి ‘సూపర్ మామ్ సిండ్రోమ్’, ‘పేపర్ వెయిట్’; కె. వరలక్ష్మి ‘గేమ్’, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’; ఆర్.శశికళ ‘డ్రాపవుట్’, ‘స్కూల్ ఫస్ట్’, ‘బై మిస్టేక్’; ఎం.ఆర్. అరుణకుమారి ‘టచ్ మీ నాట్’, ‘ఐ లవ్ ఇండియా’, ‘కేర్ కేర్’; ఎస్. జయ్ ‘బ్లాంక్ చెక్’; కవిని ఆలూరి ‘ఫ్రమ్ అడ్రస్’, ‘ఎలక్షన్ డ్యూటీ’; వాడ్రేవు వీరలక్ష్మీదేవి ‘బివేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్’, ‘పేరెంట్’... ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు.
రంగనాయకమ్మగారు 84 కథలు రాశారు. ఇన్ని కథల్లోనూ ఒక్కటంటే ఒక్క కథకి కూడా ఇంగ్లీషు పేరు లేదు.
ఈ రచయిత్రులందరూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్లు. వీళ్లు రాసిన ఈ కథలన్నీ దాదాపు తెలుగు సమాజానికీ, తెలుగు కుటుం బాలకీ, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకీ, అలవాట్లకీ, తెలుగు వాళ్ల వ్యక్తిత్వానికీ సంబంధించినవి. ఇందుకు భిన్నంగా ప్రవాస భారతీయులైన తెలుగు రచయితలు చాలామంది మాత్రం తమ కథలకి తెలుగులో పేర్లు పెట్టేందుకే సుముఖత చూపిస్తున్నారు. ఆరి సీతారామయ్య, జె.యు.బి.వి. ప్రసాద్, సాయి బ్రహ్మానందం గొర్తి... వీరు చాలా సందర్భాల్లో అమెరికన్ జీవిత నేపథ్యం నుంచి రాసిన కథలకు కూడా తెలుగు పేర్లే పెట్టారు. దీనికీ మినహాయిం పులు లేకపోలేదు. కె.గీత రాసిన ‘సిలికాన్ లోయ సాక్షిగా’ కథా సంపుటిలోని 18కథలకూ ఇంగ్లీషు పేర్లే ఉన్నాయి.
తప్పనిసరి అయితేనూ, నిత్యజీవితంలో వాడే పదం అయితేనూ, తెలుగు భాషలో కలిసిపోయిన పదం అయితేనూ, కథకి బలాన్ని చేరుస్తుందనుకుంటేనూ అనివార్యంగా కథకి ఇంగ్లీష్ శీర్షిక పెట్టవచ్చు. కానీ తెలుగు కథకి తెలుగు పేరు పెట్టడమే చాలా సందర్భాల్లో సమంజసమూ, సమర్థనీయమూ.
మొలకలపల్లి కోటేశ్వరరావు
99892 24280