మట్టి కొట్టేస్తున్నారు

ABN , First Publish Date - 2021-05-09T05:06:58+05:30 IST

మట్టి కొట్టేస్తున్నారు

మట్టి కొట్టేస్తున్నారు

గుట్టలుగా పేరుకున్న మట్టి అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. మంత్రుల సిఫారసు లేఖలు.. అధికారులకు ఆమ్యామ్యాలు.. వెరసి నిబంధనలకు తిలోదకాలిచ్చేసి కోట్ల రూపాయలను కొల్లగొట్టుకుపోతున్నారు. పోలవరం కుడికాల్వ సాక్షిగా బాపులపాడు, గన్నవరం, విజయవాడ రూరల్‌ మండలాల్లో జరుగుతున్న ఈ అవకతవ్వకాల్లో నాయకులు బాగానే వెనకేసుకుంటుంటే.. స్థానికులు అష్టకష్టాలు పడుతున్నారు. 

పోలవరం మట్టి మాఫియాకు మంత్రి అండ

ఈనెల 5న అనుమతి ఇస్తే.. అంతకు ముందునుంచే తోలకాలు

అడ్డగోలుగా మట్టి తరలింపు 

పట్టించుకోని ఇరిగేషన్‌ అధికారులు

విజయవాడ, ఆంధ్రజ్యోతి : పోలవరం కుడికాల్వ తవ్వే సమయంలో కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వి తీశారు. ఈ మట్టి.. కాల్వకు ఇరువైపులా కొండలను తలపించేలా కనిపిస్తుంటుంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కలిపి 178 కిలోమీటర్ల కుడికాల్వ పొడవునా సుమారు 12 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి గుట్టలుగా ఉంది. దీని విలువ వేల కోట్ల రూపాయలు. ఒక్క కృష్ణాజిల్లాలోనే సుమారు రూ.500 కోట్ల విలువైన మట్టి ఉంది. ఈ మట్టిని ఎర్త్‌ సాయిల్‌, గ్రావెల్‌గా వర్గీకరించి వేలం వేయాలని నిర్ణయించారు. కానీ, ఆ వేలం పాట సరైన రీతిలో సాగలేదు. చివరికి అధికార పార్టీ నేతలు మంత్రుల ద్వారా సిఫారసు లేఖలు తెచ్చుకోవడంతో మట్టి తరలింపునకు నీటిపారుదల శాఖ అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారు. 

అనుమతులు లభించక మునుపే...

బాపులపాడు, గన్నవరం, విజయవాడ రూరల్‌ మండలాల్లో పోలవరం మట్టి కొండలు ఉన్నాయి. ఇటీవల గన్నవరం మండలం తెంపల్లి తదితర గ్రామాల నుంచి పోలవరం మట్టిని తరలించుకునేందుకు అధికార పార్టీ నేత ఒకరు అనుమతి తెచ్చుకున్నారు. ఆయనకు 6వేల క్యూబిక్‌ మీటర్ల తరలింపునకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ అనుమతి వచ్చే సమయం కంటే ముందు పక్షం రోజుల నుంచి ఆయన సుమారు 100 టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లతో మట్టి తరలింపునకు శ్రీకారం చుట్టారు. సుమారు లక్ష క్యూబిక్‌ మీటర్ల మట్టిని తరలించేశారు. దీని విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుందని అంచనా. టిప్పరు మట్టిని రూ.10వేలు, లారీ మట్టిని రూ.8వేలు, ట్రాక్టర్‌ మట్టిని రూ.5వేలు చొప్పున విక్రయిస్తున్నారు. నిత్యం 100 ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నారు. మట్టి తరలింపునకు అనుమతి తీసుకున్న అధికార పార్టీ నేత రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సంపాదిస్తున్నారని సమాచారం. 

నిబంధనలకు తిలోదకాలు

పోలవరం మట్టి అక్రమార్కుల పాలవుతుందన్న ఉద్దేశంతో మట్టి తవ్వకాలపై నిర్దిష్ట విధానాన్ని రూపొందించే వరకు తవ్వకాలను నిలిపివేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. పోలవరం మట్టి తవ్వకాలు, విక్రయాల ద్వారా రూ.1,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని డిసెంబరులో మంత్రుల సాక్షిగా అధికారులు ప్రకటించారు. ఇందుకోసం తొలుత కొన్ని ప్రయత్నాలు జరిగినా కొందరు అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగా ఆ తర్వాత ఆ విధానాన్ని పక్కదారి పట్టించారు. దీంతో కోట్లాది రూపాయల విలువైన మట్టిని పప్పు బెల్లాల మాదిరి అధికారులు విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పోలవరం మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. రాత్రింబవళ్లు టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లు తమ ఊర్ల మీదుగా వెళ్తుండటంతో రహదారులు దెబ్బతినడంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 



Updated Date - 2021-05-09T05:06:58+05:30 IST