ప్రచారార్భాటాలేనా..?

ABN , First Publish Date - 2022-06-25T06:25:57+05:30 IST

కోరుకొల్లు మేజర్‌ పంచాయతీలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది.

ప్రచారార్భాటాలేనా..?
కైకలూరులో జాతీయరహదారిపై నిల్వ ఉన్న మురుగునీరు

కోరుకొల్లులో అధ్వాన పారిశుధ్యం 

గ్రామస్థుల ఆగ్రహం


స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని నాయకులు, అఽధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ పట్టించుకునే వారు కనబడటం లేదని కోరుకొల్లు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అవగాహన ర్యాలీలు, సదస్సులు, ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌లు నిర్వహించినా పరిస్థితిలో మార్పు లేదని నిట్టూరుస్తున్నారు. 


కలిదిండి, జూన్‌ 24: కోరుకొల్లు మేజర్‌ పంచాయతీలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. అంతర్గత రహదారులపై చెత్త కుప్పలు పేరుకుపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.  కొండరు డ్రైనేజీలపై అక్రమ కట్టడాలు నిర్మించి వ్యాపారాలు చేయడంతో డ్రైనేజీల్లో నీరు స్తంభించిపోతోంది. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచిపోతోంది. చెత్త గుట్టలుగా పేరుకు పోవటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ప్రజలు ముక్కుమూసుకుని రోడ్ల వెంబడి వెళ్లవలసిన దుస్థితి ఏర్పడింది. చెత్త గుట్టలు పెరిగిపోవటంతో రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన చెందు తున్నారు. చెత్త సేకరణ వాహ నాలు, రిక్షాలు, డంపింగ్‌ యార్డులు వృధాయేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జడ్పీ హైస్కూల్‌కు వెళ్లే రహదారితోపాటు పాత దళితవాడలోని అంతర్గత రహదారుల్లో రోజుల తరబడి వర్షపు నీరు నిల్వ ఉండటంతో  అవస్థలు పడుతున్నామని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పారిశుధ్య మెరుగుకు చర్యలు తీసుకోవాలని  గ్రామస్థులు కోరుతున్నారు. 


 రహదారిపైనే 2 నెలలుగా మురుగు నీరు!

కైకలూరు, జూన్‌ 24: కైకలూరు గ్రామ పంచాయతీలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. డ్రెయిన్‌లో మట్టి తొలగించకపోవడంతో మురుగు నీరు రహదారిపెనే పారుతోంది. కైకలూరు కారం మిల్లు వీధి సమీపంలో జాతీయ రహదారిపై నిత్యం మురుగు నీరు పారుతున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నారు.  నిత్యం ఈ రహదారిలో  ప్రయాణించే వాహనదారులపై మురుగునీరు పడుతోంది.  మురుగునీరు నిలిచి దుర్వాసన వెదజల్లడంతో సమీపంలోని దుకాణదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం ఈ రహదారిలో పంచాయతీ, మండలస్థాయి  అధికారులు ప్రయాణిస్తూ ఉంటారు. రెండు నెలలుగా ఇదే దుస్ధితి నెలకొన్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా  డ్రెయిన్‌ మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Updated Date - 2022-06-25T06:25:57+05:30 IST