పండుగప్ప లాభాల కుప్ప..

ABN , First Publish Date - 2022-05-22T06:13:02+05:30 IST

చేపల పెంపకంలో పండుగప్ప రారాజుగా వెలుగొందుతోంది.

పండుగప్ప లాభాల కుప్ప..
పట్టుబడి చేసిన పండుగప్ప చేపలు

 పెంపకంపై ఆక్వా రైతుల ఆసక్తి 

మిగతా చేపలకన్నా అధిక ధరతో రైతుల్లో ఆనందం

పలు రాష్ట్రాల్లో ఈ చేపలకు గిరాకీ

కలిదిండి, మే 21: చేపల పెంపకంలో పండుగప్ప రారాజుగా వెలుగొందుతోంది. మండలంలో మట్టగుంట, పెదలంక, యడవల్లి, కొండంగి, పల్లిపాలెం గ్రామాల్లో సుమారు 1500 ఎకరాల్లో పండుగప్ప సాగు చేస్తూ రైతులు అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఎకరానికి రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పండుగప్ప మాంసాహారం మాత్రమే తింటుంది. దీంతో వీటికి చైనా గురక పిల్లలను ఆహారంగా వేస్తున్నారు. కొల్లేరు ప్రాంతంలోని చెరువుల్లో చేప పిల్లలను లారీలపై దిగుమతి చేసుకుంటున్నారు. తొమ్మిది నెలల్లో పండుగప్ప పట్టుబడికి వస్తుంది. ఒక్కో చేప కిలో నుంచి ఐదు కిలోల వరకు పెంచుతున్నారు. కిలో చేప ధర రూ.420 ఉంది. సాధారణ రకానికి చెందిన శీలావతి, బొచ్చె, ఫంగస్‌లు కిలో రూ.100 ఉండగా పండుగప్ప వీటి కంటే మూడు రెట్ల అధికంగా ఉండటంతో రైతులు పండుగప్ప పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఎకరానికి రూ.4 లక్షలు పెట్టుబడి పెడుతుండగా, రెండు టన్నుల వరకు దిగుబడి వ స్తుంది. రూ.8లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోనూ రూ.4 లక్షలు మిగులుతోంది. ఉప్పు నీటిలో కూడ పండుగప్ప పెరుగుతుండటంతో ఉప్పుటేరు వెంబడి గ్రామాల్లో అధికంగా పెంచుతున్నారు. సముద్రతీర ప్రాంతాలైన చిన్న గొల్లపాలెం, నిడమర్రు, పెదపట్నం, మచిలీపట్నం నుంచి పండుగప్ప, పండుగప్ప చేపల పిల్లలను దిగుమతి చేసుకుంటున్నారు. ఒక్కొక్క పిల్ల ధర రూ.50 నుంచి 70 వరకు ఉంటుంది. ఎకరానికి 500 నుంచి వెయ్యి వరకు పిల్లలను వేస్తున్నారు. పట్టుబడి చేసిన పండుగప్పలను థర్మాకోల్‌ బాక్సుల్లో ప్యాకింగ్‌ చేసి కలకత్తా, ఒడిస్సా రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఈ పండుగప్పకు అధిక గిరాకీ ఉంది.


తప్పని ఒడిదుడుకులు 

పండుగప్ప పెంపకంలో ఒడిదుడుకులు ఉన్నాయి. ఒక్కొసారి చెరువుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడి   మృత్యువాత పడితే లక్షలాది  రూపాయల నష్టం వాటిల్లుతుంది. పెద్ద పండుగప్పలు చిన్న చేపలను తినేయటంతో చేపల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో దిగుబడి తగ్గి నష్టాలు వస్తాయి. కరోనా సమయంలో పండుగప్ప ధర రూ.250కి పడిపోయింది. ప్రస్తుతం పండుగప్ప కిలో ధర రూ.420 ఉండటంతో   రైతులు పండుగప్ప సాగుపై ఆసక్తి చూపుతున్నారు. 


హేచరీని ఏర్పాటు చేయాలి

 పండుగప్ప పెంపకంలో ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది.  హేచరీలు లేకపోవటంతో ఇతర రాష్ట్రాలపై ఆధార పడాల్సి వస్తుంది. మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తే రైతులకు అనుకూలంగా ఉంటుంది. పండుగప్పకు ఆహార తయారీ  కంపెనీలను ఏర్పాటు చేయాలి. థాయిలాండ్‌లో పిల్లెట్‌ కంపెనీ ఉంది. సబ్సిడీ రుణాలు అందజేస్తే  పండుగప్ప పెంపకం విస్తరించే అవకాశం ఉంది.  

– అండ్రాజు దుర్గారావు, ఉత్తమ ఆక్వా రైతు, మట్టగుంట

Updated Date - 2022-05-22T06:13:02+05:30 IST