వెక్కిళ్ళు ఎందుకొస్తాయంటే...

Published: Fri, 20 Mar 2020 13:04:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వెక్కిళ్ళు ఎందుకొస్తాయంటే...

వెక్కిళ్ళ వెతలకు చెక్‌

వెక్కిళ్ళు...ఇవి అందరికీ ఏదో ఒక సమయంలో అనుభవంలోకి వస్తూనే ఉంటాయి. ఇవి అప్పడప్పుడు రావడమో, ఏదో ఒకటి రెండుసార్లు వచ్చి ఆగిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే ఆపకుండా వస్తూంటేనే మాత్రం చెప్పలేనంత ఇబ్బంది. మాటలు మాట్లాడలేం. ఒక్కోసారి ఊపిరికి కూడా బ్రేకులు వేసినట్లు అవుతుంది. ఇలా ఎక్కువ సేపు ఇబ్బంది పెట్టనప్పుడు గుండె, ఊపిరితిత్తుల భాగంలో నొప్పి వచ్చి, చెప్పలేని బాధకు కారణమవుతుంది.మరి అసలు ఈ వెక్కిళ్లు, ఎందుకొస్తాయి? వాటి పరిష్కార మార్గాలు...


పొట్టను, ఊపిరితిత్తులను వేరు చేసే భాగంలో..

వెక్కిళ్లు కేవలం గొంతులో స్టార్ట్ అయ్యేవి కాదు. ఊపిరి తీసుకునే క్రమానికి సంబంధించినవి. ఊపిరితిత్తులు, పొట్ట భాగాలను వేరు చేస్తూ పక్కటెముకలను అంటిపెట్టుకుని డోమ్ షేప్‌లో ఓ పెద్ద కండరం ఉంటుంది. దీన్ని డయాఫ్రాగ్మ్ అంటారు. ఊపిరి పీల్చినప్పుడు ఇది కిందికి వెళ్లి ఊపిరితిత్తుల్లోకి గాలి వస్తుంది. మళ్లీ డయాఫ్రాగ్మ్ పాత పొజిషన్‌కు వచ్చినప్పుడు నోరు, ముక్కులోంచి గాలి బయటకు వెళ్తుంది. కానీ, ఒక్కసారిగా డయాఫ్రాగ్మ్ కండరాలు ఇరిటేట్ (ఉద్రేకానికి గురైతే) అయినప్పుడు సడన్‌గా గొంతులోకి గాలి స్పీడ్‌గా వస్తుంది. ఆ గాలి వాయిస్ బాక్స్‌కు గట్టిగా తగిలి, ఉన్నట్టుండి వోకల్ కాడ్స్ మూసుకుపోయి ఓ శబ్దం మొదలవుతుంది. ఆ శబ్దమే వెక్కిళ్లు.


వెక్కిళ్ళు  రావడానికి  కారణాలు

శారీరకంగా, మానసికంగా పడే ఒత్తిడి వల్ల డయాఫ్రాగ్మ్‌ను కలిపే బ్రెయిన్ నరాలు ఉద్రేకానికి గురై వెక్కిళ్లు మొదలవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. దీనికి ప్రధానమైన కారణాలు..

ఆహారాన్ని వేగంగా మింగడం. నీళ్లు వేగంగా తాగడం.

అకస్మాత్తుగా భావోద్వేగానికి, బాధకు గురవడం.

కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం.

గ్యాస్ ట్రబుల్‌తో పొట్ట పట్టేసినట్టు ఉన్నప్పుడు డయాఫ్రాగ్మ్‌పై ఒత్తిడిపడి వెక్కిళ్లు వచ్చే చాన్స్ ఉంది.

శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు రావడం.

ఐస్, చూయింగ్ గమ్ లాంటివి తింటున్నప్పుడు ఒక్కసారిగా గాలి పీల్చడం.


వెక్కిళ్లు ఆపడానికి చిట్కాలు

కొద్దిసేపు ప్రాణాయామం చేయడం. శ్వాసను నెమ్మదిగా, గట్టిగా ఒకవైపు నుంచి పీలుస్తూ.. మరోవైపు నుంచి వదులుతూ కొన్ని క్షణాలపాటు చేయాలి.

తలకిందులుగా ఆసనం వేసినా కొంతమందికి వెక్కిళ్లు ఆగిపోతాయి.

రెండు మూడు సెకన్లు ముక్కును గట్టిగా పట్టుకోవడం లేదా పేపర్ బ్యాగ్‌లో ముఖం పెట్టి గట్టిగా శ్వాస పీల్చడం. ఈ రెండింటి ద్వారా ఊపిరితిత్తుల్లో కొద్దిసేపు కార్బన్‌డై ఆక్సైడ్ నిలిచి, డయాఫ్రాగ్మ్ కండరాలు రిలాక్స్ అవ్వొచ్చు.


మరిన్ని నీళ్లు తాగడం ద్వారా వెక్కిళ్ళను ఆపుకోవచ్చు.

గుప్పెడు చక్కెర తీసుకుని నోట్లో వేసుకుని నెమ్మదిగా చప్పరిస్తూ నమిలి మింగడం. పంచదార తినడం వల్ల వేగస్ నరం ఉత్తేజానికి గురై మీ మెదడుని ఎక్కిళ్లని గురించి మరిచిపోయేలా చేస్తుంది.

నీరు, తేనె మిశ్రమం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. చల్లని నీటికి కాసింత తేనెని కలపి ఆ నీటిని ముందుగా పుక్కిలించండి.. ఇలా చేస్తుంటే త్వరగా వెక్కిళ్లు తగ్గే అవకాశం ఉంటుంది.

ఐస్ ముక్కలు కూడా బాగా పని చేస్తాయి. ఓ చిన్న ఐస్ క్యూబ్‌ని నోటిలో పెట్టుకుని నోటితో ఆ నీటిని పీలుస్తూ ఉండాలి. ఇలా చేస్తుంటే త్వరగా వెక్కిళ్లు తగ్గుతాయి.

వెక్కిళ్ళు తగ్గడానికి శ్వాసను ఆపడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ముక్కు మూసుకుని కొన్ని సెకన్ల పాటు ఉంటే వెక్కిళ్ళు తగ్గుతాయి. ఇలా కొన్ని సెకన్ల పాటు ఉఛ్వాసలను ఆపడం వల్ల త్వరగా రక్త ప్రవాహంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు పెరిగి.. మనసులో పరధ్యానం ఏర్పడుతుంది.

ఎన్నో అద్భుత గుణాలు ఉండే నిమ్మని తీసుకోవడం వలన వెక్కిళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది. నిమ్మ నరాలను ప్రభావితం చేయడంతో వేగంగా తగ్గే అవకాశం ఉంటుంది.  ఓ చెంచా నిమ్మరసం తీసుకుని ఆ రసాన్ని మింగాలి. అలాగే నిమ్మ ముక్కపై ఉప్పు వేసి ఆ రసాన్ని పీల్చుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా త్వరగా వెక్కిళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది.


ఇలా ఉంటే డాక్టర్‌ని కలవడం మేలు

ఒక వేళ పై చిట్కాలేవీ పని చేయకపోతే, ఒక రోజంతా గడిచినా ఎక్కిళ్లు అదేపనిగా వస్తూనే ఉంటే డాక్టర్‌ని కలవడం మేలు.

సాధారణంగా వెక్కిళ్లు కొద్ది నిమిషాల్లోనే ఆగిపోతాయి. అలా కాకుండా చాలాసేపు ఆగలేదంటే.. 24 గంటలకు మించి వస్తున్నాయంటే.. డయాఫ్రాగ్మ్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇలా ఉంటే ఒక్కొక్కరికి వాంతులు కావడం, ఫిట్స్‌లా వచ్చే అవకాశాలు ఉంటాయి. గొంతులో కూడా డ్యామేజ్ అయ్యే చాన్స్ ఉంటుంది.

స్టెరాయిడ్స్, అనస్తీషియా ఎక్కువైనా.. పడకపోయినా, బ్లడ్ షుగర్ లెవల్ పెరిగినా, తీవ్రమైన కిడ్నీసమస్యలు ఉన్నా ఎక్కుళ్లు తీవ్రంగా వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

మాట్లాడడం, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారినా, ఆహారం తీసుకోలేనంతగా, నిద్రకు సమస్యగా మారినా వెంటనే డాక్టర్‌ని కలిస్తే మంచిది.

అలాగే వెక్కిళ్లతో పాటు కడుపు నొప్పి, తీవ్రమైన జ్వరం, వాంతులు, దగ్గు, రక్తం పడడం లాంటివి ఉంటే సమస్య తీవ్రంగా ఉందని గుర్తించి హాస్పిటల్‌కు వెళ్లాలి.

–దేవి


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.