కృష్ణ..కృష్ణా

ABN , First Publish Date - 2022-05-25T06:25:13+05:30 IST

వేల ఎకరాలకు సాగునీటిని, వంద లాది గ్రామాలకు తాగునీటిని అందించే కృష్ణా కాలువ కాలుష్య కాసారంగా మారింది.

కృష్ణ..కృష్ణా

కాలుష్య కాసారంగా కాల్వ

సాగుకు, తాగేందుకు ఇదే దిక్కు 

ఆధునికీకరణకు నోచుకోక.. తూడు, గుర్రపు డెక్కలతో శివారుకందని నీరు

పెదపాడు, మే 24 : వేల ఎకరాలకు సాగునీటిని, వంద లాది గ్రామాలకు తాగునీటిని అందించే కృష్ణా కాలువ కాలుష్య కాసారంగా మారింది. ఆ నీటినే సాగు చేసేందుకు, తాగేందుకు అనేక గ్రామాల్లోని మంచినీటి చెరువులను నింపుకుంటున్నారు. విజయవాడ నుంచి ఏలూరు వరకు 65 కిలోమీటర్ల పొడవున ఈ కాల్వ ప్రవహిస్తోంది. మూడున్న రేళ్లుగా పూర్తిస్థాయిలో ఆధునికీకరణ, చెత్త, గుర్రపుడెక్క తొలగింపులను చేపట్టడం లేదు. కృష్ణా కాల్వ ద్వారా పై నుంచి నిత్యం వ్యర్థాలు కొట్టుకురావడంతోపాటు కాల్వ ప్రవహించే మార్గంలో వున్న విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాల్లోని మురుగు, హోటళ్లు, ఫ్యాక్టరీలు, కార్ల సర్వీసింగ్‌ సెంటర్ల నుంచి వచ్చే వ్యర్థాలతోపాటు, ఇతర వ్యర్థాలు కలు స్తుండటంతో నీరు కలుషితమవుతోంది. దీనితోపాటు సెప్టిక్‌ ట్యాంక్‌ వ్యర్థాలను లారీల్లో తీసుకొచ్చి కాల్వలో వదిలేస్తున్నా రు. పెరికిడు సెక్షన్‌ పరిధిలో సీతంపేట చానల్‌ వరకు 38 వేల ఎకరాలకు సాగునీరు, 20 వేల ఎకరాలకు ఆక్వా సాగు కు, అనేక గ్రామాలకు తాగునీటిని అందించే అత్యంత ప్రాధాన్యత కలిగిన కాలువ మరమ్మతులను అటు ప్రజా ప్రతినిధులు, ఇటు అధికారులు పట్టించుకోవడం లేదు. ఏటా కాల్వలో గుర్రపుడెక్క, తూడు, ఇతర వ్యర్థాల తొల గింపు పనులు చేపట్టాల్సి ఉండగా ఆయా పనులు అరకొర గానే నిర్వహిస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ ఏడాదిలో నిర్వహించాల్సిన కాలువ ఆపరేషన్‌ అండ్‌ మెయి న్‌టెనెన్స్‌ పనులకు సంబంధించి టెండర్ల దశలోనే పనులు ఉన్నట్లుగా ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. కాల్వ పరిరక్షణ బాధ్యతలు నిర్వహించాల్సిన సిబ్బంది అరకొరగానే ఉండటంతో పూర్తిస్థాయి పర్యవేక్షణ కొరవడింది.


సాగునీటి కోసం ఎదురుచూపు 

కాల్వలో ముళ్లచెట్లు, కంప, గుర్రపుడెక్క, తూడు, నాచు పెరిగి నీటి ప్రవాహం నిలిచిపోతోంది. ఏటా సాగునీటికి రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. అధికారులు కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన సమయంలో గుర్రపు డెక్క, చెత్తాచెదారం తొలగింపు చేపట్టకపోవడంతో చివరి ఆయకట్టు భూములకు నీరు అరకొరగా అందుతోంది. 


కలుషితమైన కాల్వ 

కాల్వల అభివృద్ధికి నిధులు ఖర్చు చేయకపోవడం, కాల్వలో వ్యర్థాలు కలుస్తుండటంతో నీరు కలుషితంగా మారిపోయింది. దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కాల్వ మరమ్మతులకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– లింగం కృష్ణారావు, రైతు

Updated Date - 2022-05-25T06:25:13+05:30 IST