మూడేళ్లుగా పాలకవర్గం లేదు.. రైతులకు సేవలు లేవు

ABN , First Publish Date - 2022-07-06T06:20:29+05:30 IST

రైతుల శ్రేయస్సు కోసం ఏర్పాటైన మార్కెటింగ్‌ కమిటీలు, ప్రస్తుతం ఆ లక్ష్యాలను చేరడం లేదు.

మూడేళ్లుగా పాలకవర్గం లేదు.. రైతులకు సేవలు లేవు
మార్కెట్‌యార్డులో ఇసుక డంపింగ్‌ చేసి ఉన్న దృశ్యం

అభివృద్ధికి దూరంగా నూజివీడు ఏఎంసీ

రైతులకు అందని ప్రయోజనాలు

రవాణా శాఖకు వాహన టెస్టింగ్‌కు..

 ఇసుక నిల్వ చేసి సర్కారు వ్యాపారానికి.. యార్డు


రైతుల శ్రేయస్సు కోసం ఏర్పాటైన మార్కెటింగ్‌ కమిటీలు, ప్రస్తుతం ఆ లక్ష్యాలను చేరడం లేదు. నూజివీడు మార్కెట్‌ కమిటీ, యార్డు అభివృద్ధి ఎన్నో ఏళ్ళ నుంచి, పాలకుల నిర్లక్ష్యానికి గురవుతోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ళు అయినా, ఇంతవరకు నూజివీడు మార్కెటింగ్‌ కమిటీకి పాలకవర్గం ఏర్పాటు చేయలేదు.  


 (నూజివీడు) 

మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఎస్సీ వర్గానికి రిజర్వ్‌ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్‌ కమిటీ పదవులు భర్తీ అయినా, నూజివీడుకు మాత్రం ఇంకా మోక్షం కలగలేదు. ఈ పదవిని స్థానిక ఎమ్మెల్యే భర్తీ చేయకపోవడం పట్ల వైసీపీకి చెందిన ఎస్సీ వర్గాల్లో అసంతృప్తి ఉంది. జిల్లాల విభజన జరగకముందు నూజివీడు మార్కెటింగ్‌ కమిటీ పరిధిలో నూజివీడు, ఆగిరి పల్లి, బాపులపాడు యార్డులు ఉండేవి. జిల్లాల విభజన వల్ల బాపులపాడు యార్డు కృష్ణాజిల్లా పరిధిలోకి, నూజివీడు, ఆగిరిపల్లి యార్డులు ఏలూరు జిల్లా పరిధిలోకి వెళ్ళాయి. ప్రస్తుతం నూజివీడు మార్కెట్‌ యార్డులో ఇసుక డంపింగ్‌ చేసి, ప్రభుత్వం వ్యాపారం చేసుకుంటోంది. అలాగే రవాణాశాఖకు వాహన టెస్టింగ్‌ స్థలంగాను ఈ యార్డు ఉపయోగపడుతోంది తప్ప రైతులకు ఉపయోగపడటం లేదు. రైతులకు ఈ యార్డుద్వారా వివిధ ప్రయోజనాలను కల్పించే అవకాశాలు పుష్కలంగా ఉన్నా, పట్టించుకున్న నాధుడు లేడు.


చంద్రబాబు హయాంలో అడుగులు పడినా.. 

కాంగ్రెస్‌  పాలనలో ఎం.కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న హయాంలో నూజివీడు మార్కెటింగ్‌ యార్డును మామిడి మార్కెట్‌గా తీర్చిదిద్దుతామని ఆయనే స్వయంగా హామీ ఇచ్చినా ఆ హామీ  కార్యరూపం దాల్చలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూరగాయల మార్కెట్‌గా తీర్చిదిద్దటానికి అడుగులు పడినా, తరువాత అవి కూడా ఆగిపోయాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ మార్కెట్‌యార్డును పశువుల మార్కెట్‌గా అభివృద్ధి పరుస్తామని చెప్పి గొర్రెలు, మేకల జీవాల విక్రయాల వల్ల రైతులు ఆదాయం పొందవచ్చునని, ఈ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళల్లో ఆర్భాటంగా సదరు మార్కెట్‌ను ఎమ్మెల్యే ప్రతాప్‌ ప్రారంభించారు. అయితే కొద్దిరోజుల తరువాత అది మూతపడింది. మూడేళ్ళ నుంచి నూజివీడు మార్కెట్‌ కమిటీకి పాలకవర్గం లేకపోవడం, అలాగే కమిటీ కార్యాలయం సంవత్సరాల పాటు ఇన్‌చార్జ్‌ల పాలనలో ఉండటం వల్ల ఈ మార్కెటింగ్‌ కమిటీ, యార్డు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది.


రైతుల ప్రయోజనాలకు దూరంగా..

ఈ మార్కెటింగ్‌ కమిటీ ద్వారా రైతులకు ఎన్నో ప్రయోజనాలు కల్పించవచ్చు.  విశాల ప్రాంగణం ఉన్న యార్డులో శీతల గిడ్డంగులు నిర్మించ వచ్చు. గతంలో దీనికి ప్రతిపాదనలు ఉన్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. నూజివీడు ప్రాంతంలో పామాయిల్‌ పంట విస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ప్రస్తుతం పామాయిల్‌ రైతులు తమ పంటను ప్రధాన రహదారుల పక్కన ప్రైవేట్‌ కమిషన్‌దారులు ఏర్పాటుచేసిన  కలెక్షన్‌ పాయింట్లలో అమ్ముకుంటున్నారు. అలా కాకుండా ఈ మార్కెట్‌యార్డులోనే పామాయిల్‌  తయారు చేసే కంపెనీలే కలెక్షన్‌ పాయింట్‌ ఏర్పాటుచేస్తే రైతులు కమిషన్‌ ఇచ్చే బెడద తప్పుతుంది. దీనివల్ల ఆయిల్‌ కర్మాగారాల యాజమాన్యానికి, ఆయిల్‌ పామ్‌ పండించే రైతుకు నేరుగా సంబంధం ఏర్పడి, రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. నూజివీడు పరిధిలోని పల్లెర్లమూడి, సీతారాంపురం, దిగవల్లి, సిద్దార్ధనగర్‌, చెక్కపల్లి వంటి గ్రామాల్లో, వంగ, టమాట, బెండ, సొర, పచ్చిమిర్చి వంటి  కూరగాయలు విస్త్రృత స్థాయిలో  పండుతున్నాయి. ఈ పంట పండించే రైతులు తమ పంటను బాపులపాడు, విజయవాడలోని ప్రాంతాలకు వెళ్ళి అమ్ముకుంటున్నారు. నూజివీడు మార్కెట్‌ యార్డులోనే  కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేస్తే ఇటు రైతులకు, అటు యార్డుకు ఆర్థిక లాభం. నూజివీడులో  కూరగాయల సాగు ఎక్కువగానే ఉంది. 15 ప్రైవేట్‌ నర్సరీలు కూరగాయలు పండించే రైతులకు విత్తనాలు, కూరగాయ మొక్కలు సరఫరా చేస్తున్నాయి. వెంటనే ఈ నూజివీడు మార్కెట్‌ కమిటీకి పాలకవర్గం ఏర్పాటుచేసి వాటి ద్వారా ప్రభుత్వం నుంచి రైతులకు మేలు జరిగేలా పాలకవర్గాలు, ప్రభుత్వం దృష్టి పెట్టాలని నూజివీడు ప్రాంత రైతాంగం కోరుతోంది.


Updated Date - 2022-07-06T06:20:29+05:30 IST