ఇల్లు.. ఘొల్లు

ABN , First Publish Date - 2022-05-26T06:57:05+05:30 IST

జగనన్న ఇళ్లు అధికారులకు గుదిబండలా మారాయి.

ఇల్లు.. ఘొల్లు
తణుకు నియోజకవర్గంలో పూడిక చేయని లే అవుట్‌

జగనన్న ఇళ్ల నిర్మాణాలపై అధికారుల ఒత్తిడి కత్తి

టార్గెట్లతో సచివాలయ సిబ్బంది పరుగులు

ఆర్థిక ఇబ్బందులతో లబ్ధిదారుల వెనుకంజ

అయినా కట్టించాల్సిందేనని ఒత్తిడి

లే అవుట్ల పూడ్చివేతకు టెండర్ల ఆహ్వానం 

బిల్లుల భయంతో స్పందించని కాంట్రాక్టర్లు 

యంత్రాల వినియోగంతో ఉపాధి హామీకి చెక్‌

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జగనన్న ఇళ్లు అధికారులకు గుదిబండలా మారాయి. లక్ష్యాన్ని చేరుకోని నలుగురు తహశీల్దార్లపై వేటు వేయా లంటూ జిల్లా సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేయడంలో అధికారుల్లో కలకలం రేపింది. హౌసింగ్‌ కార్పొరేషన్‌ జిల్లా అధికారిపైనా సమీక్షలో రుసరుస లాడారు. రాష్ట్ర ఉన్నతాధికారి మంగళవరాం నిర్వహించిన సమీక్ష జిల్లా అధికారుల్లో చర్చగా మారింది. అధికారులపై మరింత ఒత్తిడి పెంచింది. వాస్తవానికి ప్రభుత్వ లక్ష్యానికి.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండడం లేదు. వలంటీర్ల నుంచి సచివాలయ సిబ్బంది, తహశీల్దార్లు, మండ ల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగపు సిబ్బంది అంతా రాత్రి, పగలు జగనన్న ఇళ్లపై తంటాలు పడుతున్నారు. లబ్ధిదారులను నయానో.. భయానో ఒప్పించి ఇళ్లు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణం చేపట్టకపోతే ఇళ్ల పట్టాలు తిరిగి తీసుకుంటామంటూ హెచ్చ రిస్తున్నారు. ఇవేమీ లబ్ధిదారుల్లో కదలిక తేలేకపోతున్నాయి. ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో అధికారులు, సిబ్బంది ఆపసోపాలు పడుతున్నారు. లే అవుట్‌ల పూడిక కోసం పడరాని పాట్లు పడుతున్నారు. నాలుగు పర్యాయాలు టెండర్లు పిలిచినా సరే కాంట్రాక్టర్‌లు స్పందించడం లేదు. 


జాతీయ ఉపాధికి స్వస్తి

రాష్ట్ర ప్రభుత్వం తొలుత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లే అవుట్‌లను పూడ్చింది. సక్రమంగానే నిధులు మంజూరయ్యాయి. అయితే ఉపాధి హామీ నిబంధనలకు విరుద్ధంగా పూడిక ఉందంటూ కేంద్రం చేయిచ్చింది. లే అవుట్‌ల పూడిక కోసం యంత్రాలతో మట్టిని తవ్వి, లారీల ద్వారా రవాణా చేస్తున్నారు. అదే మట్టితో మెరక చేసే సమయంలోనూ యంత్రాలనే ఉపయోగిస్తున్నారు. మానవ వనరులను ఉపయోగించడం లేదు. ఉపాధి హామీ పథకానికి ఇది విరుద్ధమన్న ఉద్దేశంతో  కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం నిలిపివేసింది.

 

తణుకులో నాలుగోసారి టెండర్‌

తణుకు పట్టణ లబ్ధిదారులకు పైడిపర్రు, అజ్జరం, కాపవరం గ్రామాల్లో స్థలాలు కేటాయించారు. మొత్తం మూడు లే అవుట్‌లకు సంబంధించి తణుకులో ఇప్పటికే నాలుగోసారి టెండర్లు పిలిచారు. మూడు లే అవుట్‌లు పూడ్చేందుకు రూ.22 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కాంట్రాక్టర్లు ఎవరూ స్పందించకపోవడంతో ఐదోసారి టెండర్లు పిలవడానికి సన్నద్ధమవుతున్నారు. అయినా స్పందిస్తారన్న నమ్మకం లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేయదన్న అనుమానం ఓ వైపు, గిట్టుబాటు కాదన్న సందే హం మరోవైపు వీరిని వెంటాడుతోంది. ఫలితంగా టెండర్లపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మరోవైపు లక్ష్యాలను చేరుకోవాలంటూ  ఉన్నతాధికారులు చీవాట్లు పెడుతున్నారు. 

అధికంగా బిల్లులు మంజూరు చేసినా అధికారులే బలైపోతున్నారు. ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో బిల్లులు పెడుతున్నారు. పెద్ద మొత్తంలో బిల్లులు ఎందుకు పెడుతున్నారంటూ హౌసింగ్‌ కార్పొరేషన్‌లను ఉన్నతాధికారులు నిలదీస్తున్నారు. దీనిపై సమాధానం చెప్పలేక హౌసింగ్‌ అధికారులు తల్లడిల్లిపోతున్నారు. మరోవైపు టెండర్లకు కాంట్రాక్టర్‌లు స్పందించకపోవడంతో మరింత కుంగదీస్తోంది. పెండింగ్‌లో ఉన్న వాటిలో 18 లే అవుట్‌లకు రెండోసారి, 23 లేఅవుట్‌లకు మొదటిసారి టెండర్లు పిలిచినా స్పందనలేదు. దీంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 


హౌసింగ్‌  కార్పొరేషన్‌పైనే భారం

జిల్లాలో జగనన్న ఇళ్లకు సంబంధించి 645 లే అవుట్లు ఉన్నాయి. ఇందులో 550 వరకు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారానే పూడ్చేశారు. మరో 95 లే అవుట్‌లు పూడ్చాల్సి ఉంది. వీటి కోసం టెండర్లు పిలుస్తున్నారు. ఆ భారమంతా హౌసింగ్‌ కార్పొరేషన్‌ భరించాలి. అంటే ప్రభుత్వమే నిధులు సమకూర్చాలి. ఇప్పటికే ప్రభుత్వం హౌసింగ్‌ కార్పొరేషన్‌కు రూ.66.50 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. పూడిక బకాయిలు  అందులోనే  ఉన్నాయి. 


వేసవి దాటితే నత్తనడకే 

వేసవి దాటితే నిర్మాణాలు తగ్గిపోనున్నాయంటూ అధికారులు గుబులు చెందుతున్నారు. ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షల విలువైన సిమెంట్‌, స్టీల్‌, ఇసుకను సరఫరా చేస్తోంది. అయినా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేకపోతున్నారు. మిగిలిన సామగ్రిని సమకూర్చుకోవడం తలకు మించిన భారమవుతోంది. ఒక్కో ఇంటిని పూర్తి చేయాలంటే ప్రస్తుత ధరలతో కనిష్టంగా రూ.6 లక్షల వ్యయం అవుతుంది. ప్రభుత్వం కేవలం రూ.35 వేల రుణం ఇస్తోంది. అదికూడా పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకే అవకాశం కల్పిస్తున్నారు. చేతిలో పెట్టుబడి లేకపోవడంతో లబ్ధిదారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిని ఎలా పరుగులు పెట్టిస్తారో చూడాలి. 

Updated Date - 2022-05-26T06:57:05+05:30 IST