నేటి నుంచి గ్రామాల్లో రేషన్‌

ABN , First Publish Date - 2021-03-06T06:42:53+05:30 IST

గ్రామీణ ప్రాంతాలలో మార్చి నెల కోటాకు సంబంధించి రేషన్‌ పంపిణీ ఈనెల 6వ తేదీ శనివారం నుంచి ప్రారంభించటానికి జిల్లా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది.

నేటి నుంచి గ్రామాల్లో రేషన్‌
పెదవేగి మండలంలో అప్పగించేసిన రేషన్‌ వాహనాలు

ఫిబ్రవరిలో తీసుకోని వారికి.. రెండు నెలల సరుకుల పంపిణీ

బాలారిష్టాలు దాటని ఇంటింటికి రేషన్‌ సరఫరా

గిట్టుబాటు కాదని చేతులెత్తేస్తున్న వాహనదారులు

ఏలూరు సిటీ, మార్చి 5 : గ్రామీణ ప్రాంతాలలో మార్చి నెల కోటాకు సంబంధించి రేషన్‌ పంపిణీ ఈనెల 6వ తేదీ శనివారం నుంచి ప్రారంభించటానికి జిల్లా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి రేషన్‌ తీసుకోని కార్డుదారులకు రెండు నెలల రేషన్‌ కలిపి ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 9 మున్సిపల్‌ పట్టణాల్లో 126 మొబైల్‌ వాహనాల ద్వారాను, గ్రామీణ ప్రాంతాల్లో 658 మొబైల్‌ వాహనాల ద్వారా ఫిబ్రవరిలో రేషన్‌ కార్డుదారులకు ఇంటింటికీ పంపిణీ చేశారు. మార్చికి సంబంధించి అర్బన్‌ ఏరియాల్లో ఈ నెల 1వ తేదీ నుంచి ఇంటింటికీ పంపిణీ ప్రారంభించినా గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 6వ తేదీ శనివారం నుంచి పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరిలో సరుకులు తీసుకోని కార్డుదారులకు మార్చిలో పట్టణాల్లో ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల ఆరు నుంచి పదో తేదీ వరకు మార్చి కోటాతో కలిపి రెండు నెలల సరుకులు పొందవచ్చునని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్చి కోటాకు సంబంధించి అన్ని మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో 658 మొబైల్‌ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేస్తారు. కార్డుదారులు ఎవరు మొబైల్‌ వాహనాల వద్ద క్యూలో నిలబడకుండా సంబంధిత వలంటీర్‌ తెలిపిన విధంగా వారి ఇంటి వద్దకు వాహనం వచ్చినప్పుడు నిత్యావసర సరుకులు తీసుకోవాలి. ఎవరైనా కార్డుదారులు ఇంటి వద్ద లేకుంటే అటువంటి వారు ప్రతి రోజు సాయంకాలం ఆరు నుంచి ఏడు గంటల వరకు సంబంధిత గ్రామ సచివాలయాల వద్ద మొబైల్‌ వాహనాల ద్వారా నిత్యావసర సరుకులు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 12.19 లక్షల మంది రేషన్‌ కార్డుదారులకు రేషన్‌ అందించాల్సి ఉంది. 

చేతులెత్తేస్తున్న వాహనదారులు  

ఇంటింటికీ తాము రేషన్‌ అందించలేమని వాహనదారులు చెబుతు న్నారు. జిల్లాలో చాలా మంది వాహనాలను అధికారులకు అప్పగించేస్తు న్నారు. ఈ పరిస్థితులలో ఇంటింటికీ రేషన్‌ సరఫరా ఎంతవరకు సాధ్యమనే విషయం ప్రశ్నార్థకంగా తయారైంది. రేషన్‌ పంపిణీ వాహనం వీధి చివరకు వచ్చి అక్కడే ఉంచి ఆ పరిసర ప్రాంతాల కార్డుదారులకు అక్కడికే రప్పించి నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. గతంలో చౌకడిపోల వద్ద క్యూలు ఉంటే ఇప్పుడు వాహనాల వద్ద రేషన్‌ కార్డుదారులు క్యూలో నిలబడి ఉండాల్సి వస్తోంది. సర్వర్‌ సమస్య తీవ్రంగా ఉండటంతో కార్డుదారుల బయోమెట్రిక్‌ తీసుకోవటానికే ఎక్కువ సమయాన్ని వినియోగించాల్సి వస్తోంది.  

రేషన్‌ సరుకులు పంపిణీ చేయలేం

పెదవేగి, మార్చి 5: పెదవేగి మండలం కూచింపూడి, లక్ష్మీపురం, అమ్మపా లెం, జానంపేట, దుగ్గిరాల గ్రామాలకు చెందిన ఐదు ‘ఇంటింటికి రేషన్‌’ వాహ నాలను వాహనదారులు తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకొచ్చి సిబ్బందికి అప్పగించారు. రేషన్‌ పంపిణీ తమ వల్ల కాదంటూ ఒక లెటర్‌ రాసి తహ శీల్దార్‌ కార్యాలయ సిబ్బందికి అందించారు. మరికొందరు వాహనదారులు ఇదే బాట పట్టనున్నారు. మండలంలో 17 వాహనాలు ఉండగా ఇప్పటికే మొండూ రుకు చెందిన వాహనం గ్రామ రాజకీయ కారణాల వల్ల అధికారులకు అప్ప గించారు. తాజాగా ఐదు వాహనాలు అప్పగించడంతో మొత్తం ఆరు వాహనా లు వెనక్కి వచ్చేశాయి. అంత కుముందు పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్‌ ప్రమోద్‌కుమార్‌ వాహనదారులతో సమావేశం నిర్వహించారు. ఒక సహాయకుడితో ఇంటింటికీ తిరిగి రేషన్‌ సరుకులు ఇవ్వలేమని,   సహాయకులకు సొంత సొమ్ము ఇచ్చి పని చేయిం చుకుంటున్నామని, ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ఇప్పటి వరకు రాలేదని, ఇలా ఎన్నిరోజులు పెట్టుబడి పెట్టగలమని వాహనదారు లు ప్రశ్నించారు. ఈ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ  ఇచ్చారు. 


Updated Date - 2021-03-06T06:42:53+05:30 IST