ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన భారత ప్రవాసుడికి అనుకోని సమస్య.. ట్రావెల్ బ్యాన్‌తో పడరాని పాట్లు!

ABN , First Publish Date - 2022-01-20T15:58:18+05:30 IST

ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన భారత ప్రవాసుడికి అనుకోని సమస్య వచ్చి పడింది.

ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన భారత ప్రవాసుడికి అనుకోని సమస్య.. ట్రావెల్ బ్యాన్‌తో పడరాని పాట్లు!

మనామా: ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన భారత ప్రవాసుడికి అనుకోని సమస్య వచ్చి పడింది. అనారోగ్యం కారణంగా ఆయన పడరాని పాట్లు పడుతున్నారు. సుధారకర్ రాధాక‌ృష్ణన్ అనే భారత ప్రవాసుడు తనను వేధిస్తున్న వైకల్యం కారణంగా తనపై వేసిన కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా యజమానిని వేడుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2017లో సుధాకర్ 450 బహ్రెయినీ దినార్ల(రూ.88,852) వేతనంతో ఆ దేశానికి వెళ్లారు. దాదాపు ఏడాదిన్నర పాటు అక్కడే పని చేశారు. అయితే, సోదరుడికి స్వదేశంలో జరిగిన ప్రమాదం కారణంగా అతడు తీవ్రంగా గాయపడడంతో తిరిగి భారత్‌కు వచ్చారు. కొన్ని రోజులు స్వదేశంలోనే ఉన్న సుధాకర్ తిరిగి బహ్రెయిన్ వెళ్లారు. అయితే, తన వల్ల కంపెనీ నష్టపోయిందంటూ కంపెనీ యాజమాన్యం సుధాకర్‌కు జీతం చెల్లించడం మానేసింది. పైగా నష్టపరిహారంగా 3,800 బహ్రెయినీ దినార్లు(రూ.7,50,308) చెల్లించాల్సిందిగా యాజమాన్యం సుధాకర్‌కు డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే అతనిపై కంపెనీ ఓ కేసు కూడా నమోదు చేసింది. ఆ కేసు కారణంగా సుధాకర్‌పై ట్రావెల్ బ్యాన్ పడింది. 


ఆ తర్వాత హిద్ పోలీసులు కలుగజేసుకుని తన సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు సుధాకర్‌. దీంతో ట్రావెల్ బ్యాన్ తొలిగిపోయి 2019 జనవరి 21న స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు. స్వదేశానికి వచ్చిన 5 నెలల తర్వాత వేరే యజమాని వద్ద పని దొరకడంతో మళ్లీ బ్రహెయిన్ వెళ్లారు. అయితే, బహ్రెయిన్ వెళ్లిన కొన్ని రోజులకే సుధాకర్‌కు తీవ్రమైన వెన్నునొప్పి సమస్య వెంటాడింది. ఈ సమస్యతో ఆయన చివరికి పనిచేయలేని స్థితికి చేరుకున్నారు. దాంతో స్వదేశానికి వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఆ సమయంలో మళ్లీ తనపై ట్రావెల్ బ్యాన్ ఉన్నట్లు తెలిసి షాకయ్యారు. తనపై మరో కొత్త కేసు బనాయించడంతోనే మళ్లీ బ్యాన్ పడినట్లు గుర్తించారాయన. ఆ కేసు నుంచి బయటపడాలంటే 13వేల బహ్రెయినీ దినార్లు(రూ.25.66లక్షలు) చెల్లించాల్సిందిగా చెబుతున్నారని, నడవలేని స్థితిలో ఉన్న తాను ఎలా ఆ భారీ మొత్తం చెల్లించగలనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనుక తనపై బనాయించిన కేసును వెనక్కి తీసుకుని తనకు సాయం చేయాల్సిందిగా యజమానిని వేడుకుంటున్నారు సుధాకర్.     


Updated Date - 2022-01-20T15:58:18+05:30 IST