ఇబ్బందుల్లో ఉక్రెయిన్ పౌరులు! భారత్‌లో చిక్కుకుపోయి.. సాయం కోసం వేచి చూస్తూ..

ABN , First Publish Date - 2022-04-17T05:09:44+05:30 IST

రష్యా దాడి కారణంగా కొందరు ఉక్రెయిన్ పౌరులు భారత్‌లో చిక్కుకుపోయి నానా అవస్థలు పడుతున్నారు. సాయం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇబ్బందుల్లో ఉక్రెయిన్ పౌరులు! భారత్‌లో చిక్కుకుపోయి.. సాయం కోసం వేచి చూస్తూ..

ఎన్నారై డెస్క్: రష్యా దాడి కారణంగా కొందరు ఉక్రెయిన్ పౌరులు భారత్‌లో చిక్కుకుపోయి నానా అవస్థలు పడుతున్నారు. సాయం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 17 మంది ఉక్రెయిన్ పౌరులు ఉన్నారు. ఇస్కాన్(ISKON)లో సభ్యులైన వీరందరూ.. రష్యా దాడి ప్రారంభం కాకమునుపు భారత్‌లో కాలుపెట్టారు. ఇంతలో ఉక్రెయిన్ దాడి కారణంగా విమానసర్వీసులు రద్దవడంతో వారు ఇండియాలోనే చిక్కుకుపోయారు. తొలుత వీరితో పాటూ వచ్చిన కొందరు ఇతర దేశాలకు తలదాచుకునేందుకు వెళ్లిపోవడంతో ఈ పదిహేడు మందీ భారత్‌లోనే చిక్కుకుపోయారు. ‘‘మా వీసా గడువు త్వరలో ముగియనుంది. డబ్బులు కూడా అయిపోవచ్చాయి. ఇకపై భారత్‌లో ఎలా బతకాలో అర్థం కావట్లేదు.’’ అంటూ స్లావా గ్రిచెంకో అనే ఉక్రెయిన్ పౌరుడు వాపోయారు. 


ISKONకు అనుబంధం పనిచేస్తున్న ఈ బృందానికి స్లావా నేతృత్వం వహిస్తారు. ఈ బృందంలో 10 ఏళ్ల వయసున్న వారి నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకూ ఉండటం విశేషం. ‘‘మాలో కొందరికి మాత్రమే వీసా గడువును పొడిగించారు. మిగిలిన వారు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. మా ఉక్రెయిన్ ఎంబసీ అధికారులను ఈ విషయంలో సహాయం చేయాల్సిందిగా కోరాం కానీ వారి పరిమితులు వారికి ఉన్నాయి’’ అని స్లావా పేర్కొన్నారు. ఫిబ్రవరి 8న మొత్తం 28 మంది ఉక్రెయిన్ వాసులు ఇండియాకు బయలుదేశారు. మార్చి 5ను మళ్లీ స్వదేశానికి బయలుదేరేలా వారు ప్లాన్ చేసుకున్నారు. ఇంతలో రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. దీంతో.. వారు ముందుగా బుక్ చేసుకున్న విమాన టిక్కెట్లు రద్దైపోయాయి. ఈ క్రమంలో బృందంలోని తొమ్మిది మంది సభ్యులు  ఎలాగోలా ఇతర ఐరోపా దేశాలకు వెళ్లిపోగా..మిగిలిన వారు భారత్‌లోనే చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారు. అయితే.. చిన్నారులు ఆన్‌లైన్‌లో తమ విద్యను కొనసాగిస్తుండటం పట్ల బృందంలోని ఇతర సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-04-17T05:09:44+05:30 IST