అమెరికా ఫిట్టెస్ట్ సీఈఓ ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇవే!

May 9 2021 @ 16:35PM

‘అంత సేపు జిమ్‌లో గడిపినా నీ శరీరం ఏం గొప్పగా అన్పించడం లేదు’ అని భార్య అంటే ఏ భర్తయినా ఉడికిపోతాడు. కానీ స్ట్రాస్‌ జెల్‌నిక్‌ని మాత్రం వాళ్ల భార్య అలా అనలేదు. ఎందుకంటే అతడు 63 ఏళ్లు ఉన్నా ఫిట్‌నెస్‌లో నవ యువకుడు. అమెరికాలో ఫిట్టెస్ట్‌ సీఈఓగా జెల్‌నిక్‌ పేరుతెచ్చుకున్నాడు. అతడి జీవన విధానం అందరికీ స్ఫూర్తి దాయకమే...


స్ట్రాస్‌ జెల్‌నిక్‌... అమెరికాలోని ‘టేక్‌ -టు ఇంటరాక్టివ్‌ కంపెనీ ఛైర్మన్‌, సీఈఓ, సిబిఎస్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌. అతడి ఎత్తు ఆరు అడుగులకు పై మాటే. బరువు 73 కేజీలు. ఆయన శరీరంలో కేవలం ఎనిమిది శాతమే కొవ్వు ఉంది. అతడిని చూడగానే నలభై ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తాడు. అరవై మూడేళ్ల వ్యక్తి అలా ఎలా కనిపిస్తున్నాడు.. అతడి ఫిట్‌నెస్‌ మంత్రా ఏమిటి; ఆరోగ్య రహస్యం ఏమిటి అని జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు. తను ఆచరిస్తోన్న పద్ధతులు, తీసుకుంటున్న ఆహారం గురించి ‘బికమింగ్‌ ఏజ్‌లెస్‌ - ద ఫోర్‌ సీక్రెట్స్‌ టూ లుకింగ్‌ అండ్‌ ఫీలింగ్‌ యంగర్‌ దేన్‌ ఎవర్‌’ అని ఓ పుస్తకంలో రాశాడు. దీనికి ఓ ఫిట్‌నెస్‌ మ్యాగజైన్‌ ఎడిటర్‌ సహ రచయితగా వ్యవహరించారు.


ఫోకస్‌ అవసరం

కెరీర్‌లో ముందుండాలని పరుగులు తీస్తాం కానీ ఆరోగ్యాన్ని పట్టించుకోం. సయమానికి ఏదో తినేస్తాం, ఏం తింటున్నామన్నది అశ్రద్ధ చేస్తాం.. కెరీర్‌ మీద ఉన్నంత ఫోకస్‌ మన శరీరం మీద కూడా ఉండాలంటారు జెల్‌నిక్‌. ‘నేనెప్పుడూ ఓవర్‌ వెయిట్‌గా లేను. న్యూట్రిషన్‌ గురించి అస్సలు పట్టించుకోలేదు. నాకు 38 ఏళ్ల వయసున్నప్పుడు నువ్వు అంత ఫిట్‌నెస్‌తో కనిపించడం లేదని నా భార్య అన్న మాటలు నన్ను తీవ్రంగా ఆలోచింపజేశాయి. ఆల్కహాల్‌ మానేశా, ఫ్రైడ్‌ ఫుడ్స్‌, పళ్ల రసాలు, కూల్‌ డ్రింక్స్‌ను నా ఆహారంలోంచి తొలిగించా. అనేక రకాల వర్కవుట్స్‌ను చేయడం మొదలుపెట్టా. కేవలం జిమ్‌లో కాకుండా సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ లాంటివి స్నేహితులతో కలిసి చేయడం ప్రారంభించా. చాలా మంది నేను బరువు తగ్గాలి అంటారు కానీ నేనేం కావాలని అనుకుంటున్నాను అనేది సరైనదని’ అంటారు స్ట్రాస్‌ జెల్‌నిక్‌.


నాలుగు సూత్రాలు

మంచి జీవనానికి సంబంధించి ‘బికమింగ్‌ ఏజ్‌లెస్‌’ పుస్తకం నాలుగు సూత్రాలను పేర్కొంటోంది. అవి... ఫిట్‌నెస్‌, న్యూట్రిషన్‌, హెల్త్‌, సోల్‌. క్రమంగా ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల వృద్ధాప్యం తొందరగా దరిచేరదని అభిప్రాయపడతారు జెల్‌నిక్‌. ఒకవేళ ఎక్సర్‌సైజ్‌ చేసే అలవాటు లేకపోయినా ఇప్పటి నుంచైనా మొదలుపెట్టడం మంచిది. రోజూ ఓ పది నిమిషాల నడక ప్రారంభించి, వారానికి కనీసం నాలుగు రోజులు చేసేలా అలవాటు చేసుకోవచ్చు. దీన్నే క్రమంగా ముఫ్పై నిమిషాలకు పెంచుకుంటే మంచిది.


ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ఎల్లప్పుడూ సమతులాహారం తీసుకోవాలన్న నియమం లేదు. స్ట్రిక్ట్‌ డైట్‌ పాటించి మ్యాగజైన్ల కవర్‌ పేజీలకు ఎక్కక్కర్లేదు. కానీ ఆరోగ్యమైనవి కాని పదార్థాలను మన డైట్‌ నుంచి తొలగించడం ఉత్తమమని సలహా ఇస్తాడు ఆయన. పిజ్జాలు, కేకులకు ఎప్పుడూ ‘నో’ చెప్పడం ఉత్తమం. వ్యాధుల బారిన పడకుండా బుల్లెట్‌ ఫ్రూఫ్‌గా మన శరీరాన్ని మలచుకోవాలి. దీనికి ఆయన కొన్ని సూత్రాలను ప్రతిపాదించారు. మొదటిది  సుఖనిద్ర. తగినంత నిద్రపోవడం ద్వారా బరువు తగ్గడమే కాదు జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. రక్తపోటును నియంత్రించవచ్చు.


మానసిక ఆరోగ్యానికి పెద్ద పీట వేయాలని జెల్‌నిక్‌ పేర్కొంటాడు. బయటే కాదు లోపల కూడా ఎంత సంతోషంగా ఉన్నామన్నది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. దీనికి యోగ సాధన చక్కని మార్గంగా సూచిస్తారు.‘కాలప్రవాహం మీద మనకెలాంటి నియంత్రణ ఉండదు కనీసం ఆరోగ్యవంతంగా వయసును కట్టడిచేద్దాం. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ధృడంగా ఉండడం వల్ల కుటుంబం, స్నేహ బంధాలే కాదు, ఉద్యోగవ్యాపారాలు, ఆత్మవిశ్వాసమూ మెరుగుపడతాయి’ అని చెప్పే జెల్‌నిక్‌ ఫిట్‌నెస్‌ సూత్రాలు నేడు అందరికీ అవసరం.


Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.