పాత జీన్సుల వీధి

ABN , First Publish Date - 2021-01-20T05:30:00+05:30 IST

రోడ్డు పక్కన దుకాణాల్లో ఏదైనా కొనాలంటే ధర ఎక్కువ పెట్టాల్సి వస్తుందని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం. అదే వీధి దుకాణాల్లో అనుకోండి..

పాత జీన్సుల వీధి

రోడ్డు పక్కన దుకాణాల్లో ఏదైనా కొనాలంటే ధర ఎక్కువ పెట్టాల్సి వస్తుందని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం. అదే వీధి దుకాణాల్లో అనుకోండి.. బేరమాడి మరీ తక్కువకే నచ్చినవి కొనుక్కొని వెళతాం. అందుకే చాలామంది వీధి మార్కెట్లలో షాపింగ్‌ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. అలాంటి చౌక వీధి మార్కెట్‌ కోల్‌కతాలోని నింధాబ్‌సేన్‌ మార్గం, మహమ్మద్‌ ఆలీ పార్క్‌కు ఎదురుగా ‘లాండ్రీ అల్లీ’ అనే వీధి మార్కెట్‌ ఉంది. ఆ వీధులోంచి నడుస్తూ వెళుతుంటే దారి పొడవునా పైన  తీగలు పరిచి వరుసగా ఆరబెట్టిన జీన్స్‌ ప్యాంట్స్‌ కనిపిస్తాయి. అవన్నీ పాత జీన్స్‌లే. అక్కడి వందల కుటుంబాలు వాటిని అచ్చం కొత్తవాటిలా తళుక్కుమనేలా తీర్చిదిద్దుతాయి. కొందరు జీన్స్‌లను ఉతుకుతూ, మరికొందరు వాటికి రంగులు అద్దుతూ, ఇంకొందరు వాటి కున్న చిరుగులను కుడుతూ కనిపిస్తారు. రంగు రంగుల జీన్స్‌తో ‘లాండ్రీ అల్లీ’ ప్రత్యేకంగా కనిపిస్తుంది. 




కష్టపడకుండా ఏమీ మిగలదు

‘‘రోజూ ఉదయాన్నే నాలుగు గంటలకు నిద్ర లేచి, గిరీష్‌ పార్క్‌ మార్కెట్‌కు అయిదుకల్లా చేరకుంటాను. మా వద్దకు వివిధ రాష్ట్రాల నుంచి పాత జీన్సులు వస్తాయి. వాటిని మేము రూ. 20 నుంచి 40 పెట్టి కొంటాం. వాటిని శుభ్రం చేసినవాళ్లకు ఒక్కదానికి 15 రూపాయలు ఇస్తాం. ఆ తరువాత వాటిని రంగుల్లో ముంచి ఆరబెడుతాం. చిరుగులున్న జీన్స్‌ను కుట్టిన తరువాత పాలిష్‌ చేస్తాం. పాత జీన్స్‌లను కొత్తవాటిలా మార్చేస్తాం. వాటిని కోల్‌కతాలోని పలు మార్కెట్లతో పాటు కేరళ, బిహార్‌, జార్ఘండ్‌ రాష్ట్రాలకు సరఫరా చేస్తాం. వ్యాపారులు జీన్స్‌కు రూ.50-60 పెట్టి కొంటారు. అన్ని వ్యాపారాల మాదిరే ఇందులోనూ కష్టపడకుండా ఏమీ మిగలదు’’ అంటున్నారు గత అయిదేళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్న మహమ్మద్‌ షేక్‌ ఘాజీ. పాత జీన్స్‌లను రీసైక్లింగ్‌ చేసి, తక్కువ ధరకే అందిస్తున్న ఈ ‘లాండ్రీ అల్లీ’ కోల్‌కతాలో రద్దీగా ఉండే వీధుల్లో ఒకటి.

Updated Date - 2021-01-20T05:30:00+05:30 IST