క‘రుణ’.. చూపరూ!

ABN , First Publish Date - 2021-06-11T04:54:22+05:30 IST

రహదారులు... వీధులే వారి వ్యాపార కేంద్రాలు. రోజంతా వీధివీధినా తిరిగి తిరిగి అమ్మితేనే పూట గడుస్తుంది. ప్రస్తుతం కర్ఫ్యూ ఆంక్షల నేపథ్యంలో వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. ఇటువంటి సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి స్వనిధి, జగనన్న తోడు పథకాల ద్వారా మంజూరు చేసే చిరు రుణాలు.. వీధి వ్యాపారులకు అండగా నిలుస్తున్నాయి. కొంతమందికి ఈ పథకంపై అవగాహన లేక రుణాలకు దూరమవుతున్నారు. మరికొందరికి రుణాలు అందజేసేందుకు బ్యాంకర్లు సమ్మతించకపోవడంతో లబ్ధి పొందలేకపోతున్నారు. అధికారులు, బ్యాంకర్లు తమపై కరుణ చూపాలని వేడుకుంటున్నారు.

క‘రుణ’.. చూపరూ!
రాజాంలో పండ్లు విక్రయిస్తున్న వీధి వ్యాపారి

- పీఎం స్వనిధి, జగనన్న తోడుకు వేలాదిగా దరఖాస్తులు

- సక్రమంగా రుణాలు మంజూరు చేయాలని వీధి వ్యాపారుల విజ్ఞప్తి

(రాజాం)

రహదారులు... వీధులే వారి వ్యాపార కేంద్రాలు. రోజంతా వీధివీధినా తిరిగి తిరిగి అమ్మితేనే పూట గడుస్తుంది. ప్రస్తుతం కర్ఫ్యూ ఆంక్షల నేపథ్యంలో వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. ఇటువంటి సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి స్వనిధి, జగనన్న తోడు పథకాల ద్వారా మంజూరు చేసే చిరు రుణాలు.. వీధి వ్యాపారులకు అండగా నిలుస్తున్నాయి. కొంతమందికి ఈ పథకంపై అవగాహన లేక రుణాలకు దూరమవుతున్నారు. మరికొందరికి రుణాలు అందజేసేందుకు బ్యాంకర్లు సమ్మతించకపోవడంతో లబ్ధి పొందలేకపోతున్నారు. అధికారులు, బ్యాంకర్లు తమపై కరుణ చూపాలని వేడుకుంటున్నారు. 

--------------------

కరోనా వేళ.. పట్టణాల్లో వీధి వ్యాపారులకు అండగా నిలవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ మేరకు ప్రధానమంత్రి స్వనిధి, జగనన్న తోడు పథకాల కింద ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున బ్యాంకు రుణం అందజేసేందుకు చర్యలు చేపట్టాయి. దీనిలో భాగంగా నగర, పట్టణ ప్రాంతాల్లో ప్లాట్‌ఫాంలపై తోపుడు బండ్లు, సైకిళ్లు, బడ్డీలు, కూరగాయలు, పండ్లు తినుబండారాలు, టీ, టిఫిన్లు విక్రయించేవారికి ఈ రుణాలను చేరువ చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. శ్రీకాకుళం నగరంతో పాటు రాజాం, పాలకొండ, పలాస, ఆమదాలవలస, ఇచ్ఛాపురం పట్టణాల్లో వీరికి గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు. అర్హులైన వ్యాపారులను గుర్తించేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) అధికారులు సర్వే చేశారు. ఈ మేరకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేస్తున్నారు. 


జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో పీఎం స్వనిధికే ఎక్కువ మంది వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. పీఎం స్వనిధికి 5,354 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,539 మందికి రుణాలు అందజేసేందుకు బ్యాంకులు సమ్మతించాయి. ఇంతవరకూ 3,282 మందికి రుణాలు అందజేశాయి. 1,815 మంది రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. జగనన్న తోడు పథకం కింద ఇంతవరకూ 2,534 మంది దరఖాస్తు చేయగా..  2,323 మందికి బ్యాంకులు రుణాలు అందజేశాయి. ఇంకా 211 మంది రుణాల కోసం నిరీక్షిస్తున్నారు. 

- శ్రీకాకుళం కార్పొరేషన్‌లో 803 మంది దరఖాస్తు చేసుకోగా, 787 మంది రుణాలు పొందారు.   

- రాజాం మునిసిపాలిటీలో 249 మందికి గానూ.. 233 మందికి రుణాలు అందజేశారు. 

- ఆమదాలవలసలో 258 మందికి గానూ 211 మందికి రుణాలు మంజూరు చేశారు. 

-  పాలకొండ నగర పంచాయతీలో 237 మందికి గానూ 200 మందికి రుణాలు అందజేశారు. 

- పలాసలో 757 మందికిగానూ 678 మందికి రుణాలు మంజూరు చేశారు. 

- ఇచ్ఛాపురంలో 230 మందికి గానూ 214 మందికి రుణాలు అందజేశారు. 

- శ్రీకాకుళం, రాజాం, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో 16 మంది చొప్పున, ఆమదాలవలసలో 47 మంది, పాలకొండలో 37 మంది, పలాసలో 79 మంది రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. తమకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు సమ్మతించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


 గుర్తింపు కార్డులు లేక.. 

పురపాలక సంఘాలు ఇచ్చిన గుర్తింపు కార్డులు, బియ్యం కార్డు, ఆధార్‌ కార్డు, పాస్‌ ఫొటో జత చేసి.. పీఎం స్వనిధి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుని రుణం పొందవచ్చు. ఇవే పత్రాలతో ‘జగనన్న తోడు’ కింద సచివాలయాల్లో దరఖాస్తులు అందజేయాలి. మెప్మా అధికారులు అర్హులను ఎంపిక చేస్తారు. బ్యాంకర్లు రుణాలు అందజేస్తారు. వాటిని 12 నెలల్లో వడ్డీతో సహా చెల్లించాలి. ‘జగనన్న తోడు’ పథకానికి వడ్డీలో ఐదు శాతం రాయితీ కల్పిస్తారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం అందజేస్తున్న రుణాలు వీధి వ్యాపారులకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి. వ్యాపారంపై పెట్టుబడి పెట్టి వచ్చే లాభంతో బ్యాంకు రుణాలు తీర్చుతున్నారు. ఈ క్రమంలో బ్యాంకర్లకు నమ్మకం కలిగితే.. రుణాల రెన్యువలకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే చాలామంది వ్యాపారులకు గుర్తింపు కార్డులు లేక ఈ పథకానికి దూరమవుతున్నారు. దీనిపై అవగాహన లేక మరికొందరు లబ్ధి పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వీధి వ్యాపారులందరికీ గుర్తింపు కార్డులు అందజేయాలని, ఈ  పథకంపై అధికారులు మరింత అవగాహన కల్పించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


అర్హులందరికీ అందజేస్తాం 

అర్హులైన వీధి వ్యాపారులందరికీ రుణాలు అందజేస్తాం. పీఎం స్వనిధి కింద రుణాలు తీసుకునేందుకు కొందరు ఆసక్తి చూపడం లేదు. స్వయంశక్తి సంఘాల్లో మహిళలకు కూడా వ్యాపారాలుంటే.. వారికీ రుణాలు అందజేయాలని నిర్ణయించాం. స్వనిధి పథకం లక్ష్యాల్లో ప్రగతి సాధించాం. తీసుకున్న రుణం 12 వాయిదాల్లో చెల్లిస్తే బ్యాంకులు రుణాలు రెన్యువల్‌ చేస్తాయి. 

 - ఎం.కిరణ్‌కుమార్‌, మెప్మా పీడీ, శ్రీకాకుళం 

Updated Date - 2021-06-11T04:54:22+05:30 IST