మోదీ బెంగాల్ పర్యటనపై చిరు వ్యాపారుల ఆశలు

ABN , First Publish Date - 2021-03-07T19:23:21+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కోసం

మోదీ బెంగాల్ పర్యటనపై చిరు వ్యాపారుల ఆశలు

కోల్‌కతా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కోసం కోల్‌కతాలోని చిరు వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. ఆయన సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తారని, తమ వ్యాపారాలు బాగా జరిగి, తమకు జీవనోపాధి దొరుకుతుందని ఆశిస్తున్నారు. నగరంలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగే మోదీ సభ చరిత్రలో నిలిచిపోయేవిధంగా నిర్వహించేందుకు బీజేపీ కృషి చేస్తుండటంతో కోల్‌కతా పరిసరాల్లోని జిల్లాలకు చెందిన చిరు వ్యాపారులు నగరానికి ఎన్నో ఆశలతో వచ్చారు. 


హౌరా, హుగ్లీ, నాడియా జిల్లాలకు చెందిన చిరు వ్యాపారులు బ్రిగేడ్ గ్రౌండ్‌కు చేరుకుని, స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. సందర్శకుల అభిరుచికి తగినట్లుగా ఎంచుకునేందుకు అనేక రకాల వస్తువులను అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. బట్టలు, దుస్తులు, ఆహార పదార్థాలు, మట్టి బొమ్మలు, ఆట వస్తువులు వంటివాటిని ఆకర్షణీయంగా ప్రదర్శించారు. నరేంద్ర మోదీ చిత్ర పటాలను కూడా అమ్ముతున్నారు. 


కోవిడ్-19 మహమ్మారి వల్ల చిరు వ్యాపారులు తీవ్ర ఆర్థిక నష్టాలకు గురైన సంగతి తెలిసిందే. మోదీ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తుండటంతో వీరిలో చాలా మంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కనీసం ఈరోజు అయినా తమకు కాస్త ఆదాయం లభిస్తుందని ఆశపడుతున్నారు. 


భారీ బహిరంగ సభలకు వేదిక బ్రిగేడ్ గ్రౌండ్. ముఖ్యంగా వామపక్షాలు అధికారంలో ఉన్నపుడు అనేక బహిరంగ సభలు ఇక్కడ జరిగాయి. ఆదివారం మోదీ ప్రసంగించనుండటంతో ఈ మైదానంలో పండుగ వాతావరణం నెలకొంది. 


పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలు మార్చి 27 నుంచి ఎనిమిది దశల్లో జరుగుతాయి. మే రెండున ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో గెలిచితీరాలన్న పట్టుదలతో బీజేపీ పావులు కదుపుతోంది.



Updated Date - 2021-03-07T19:23:21+05:30 IST