ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-03-02T06:11:43+05:30 IST

నగర పంచాయతీ ఎన్నికల దృష్ట్యా కనిగిరిలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సబ్‌ కలెక్టర్‌ భార్గవతేజ హెచ్చరించారు.

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
అధికారులతో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌

సబ్‌ కలెక్టర్‌ భార్గవతేజ 

కనిగిరి, మార్చి 1: నగర పంచాయతీ ఎన్నికల దృష్ట్యా కనిగిరిలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సబ్‌ కలెక్టర్‌ భార్గవతేజ హెచ్చరించారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో పోలీసు, రెవెన్యూ, నగర పంచాయతీ, పోలింగ్‌ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాల వద్ద బారికేట్లతో పాటు పోలీసుల పర్యవేక్షణ విస్తృతంగా ఉండాలని ఆదేశించారు. ఉప సంహరణ సమయంలో అభ్యర్థిని భయభ్రాంతులకు గురి చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి అటువంటి వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని సూచించారు. గతంలో వేసిన నామినేషన్లు అభ్యర్థులు ఉప సంహరణ చేసుకోవాలనుకున్న వారు అనివార్య కారణాల వలన రాలేకపోతే సంభందిత ప్రపోజల్‌ అభ్యర్థి ఆథరైజేషన్‌తో ఉపసంహరణ చేసుకోవచ్చని తెలిపారు. నగర పంచాయతీ పరిధిలో జరిగే 20 వార్డుల ఎన్నికలకు 40 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఐ వెంకటేశ్వరరావు ఆదేశించారు. సచివాలయంలో ఉన్న బూత్‌ సిబ్బంది ఎన్నికల పోలింగ్‌ రోజున ప్రతి ఇంటికి ఉదయాన్నే వెళ్లి పోలింగ్‌ స్లిప్‌లను అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌  డీవీఎస్‌ నారాయణరావును ఆదేశించారు. అదేవిధంగా పోలింగ్‌ సమయంలో ప్రతి ఇంట్లో ఉన్న ఓటరు వారి ఓటును వినియోగించాలని ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఓటరు స్లిప్‌లను పంచితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగంలో ఎవరైనా ఆటంకం కలిగిస్తే 8247540183 హెల్ప్‌ డెస్క్‌ నంబరుకు సమాచారం అందించాలన్నారు. అనంతరం పట్టణ సమీపంలోని మోడల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేయనున్న కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సమావేశంలో సీఐ కె వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ పుల్లారావు, కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T06:11:43+05:30 IST