నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-05-17T05:46:35+05:30 IST

నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉపేక్షించమని రాష్ట్ర వ్యవసాయ సంచాలకురాలు అనిత ఎరువులు, విత్తన దుకాణాల నిర్వాహకులను హెచ్చరించారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
మెదక్‌లోని ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ సంచాలకురాలు

 ఎరువులు, విత్తన దుకాణాలపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

 మెదక్‌ అర్బన్‌/అల్లాదుర్గం/ తూప్రాన్‌ (మనోహరాబాద్‌)/రామాయంపేట/చిల్‌పచెడ్‌, మే 16: నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉపేక్షించమని రాష్ట్ర వ్యవసాయ సంచాలకురాలు అనిత ఎరువులు, విత్తన దుకాణాల నిర్వాహకులను హెచ్చరించారు. సోమవారం మెదక్‌ , సంగారెడ్డి జిల్లాల్లో ఎరువులు, విత్తన దుకాణాలపై టాస్క్‌ఫోర్స్‌, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్‌ జిల్లాలో మెదక్‌ పట్టణంతో పాటు మనోహరాబాద్‌, అల్లాదుర్గం మండలాల్లోని పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.  ఆయా షాపుల్లోని షాపుల్లోని విత్తనాలు, పురుగులమందు, ఫర్టిలైజర్స్‌ను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. మనోహరాబాద్‌ మండలంలోని నియో సీడ్‌ కంపెనీ, సూపర్‌ సీడ్‌ కంపెనీలలో కాటన్‌ సీడ్‌ విత్తనాలను పరిశీలించారు.  కంపెనీలో నకిలీ కాటన్‌ సీడ్‌ను గుర్తించేందుకు శాంపిల్‌ పరీక్షలు నిర్వహించారు. అనంతరం అల్లాదుర్గంతో పాటు మండలం చిల్వర్‌లోని ఫర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు అనిత మాట్లాడుతూ..  నకిలీ విత్తనాల నివారణకు ఫర్టిలైజర్‌ దుకాణాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. అనుమతులు లేకుండా విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. రసీదులు లేకుండా విత్తనాలు కొనుగోలు చేయవద్దని రైతులకు సూచించారు. కల్తీ విత్తనాలు అమ్ముతున్న, తయారు చేసినట్టు తెలిస్తూ డయల్‌ 100, వాట్సాప్‌ నెంబర్‌ 7901100100 సమాచారం అందించాలన్నారు.   తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ, సీడ్‌ సర్టిఫికేషన్‌ అధికారి నగేష్‌, డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు విజయనిర్మల, మెదక్‌, మనోహరాబాద్‌, అల్లాదుర్గం మండలాల ఏవోలు శ్రీనివాస్‌,  స్రవంతి, రాజేశ్‌, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు. రామాయంపేటలో సోమవారం నిజాంపేట, చేగుంట, నార్సింగి, రామాయంపేట మండలాల ఎరువుల డీలర్లతో మెదక్‌ జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల డీలర్లు కాలం చెల్లిన విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. చిల్‌పచెడ్‌ మండలకేంద్రంలోని పలు ఎరువుల దుకాణాల్లో ఏవో బాల్‌రెడ్డి, ఎస్‌ఐ మహమ్మద్‌ గౌస్‌ తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు.  


 సంగారెడ్డి జిల్లాలో

సదాశివపేట, మే 16: సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ నాయక్‌ వ్యవసాయ అధికారి అనితతో కలిసి సోమవారం  సదాశివపేట పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా దుకాణాల్లోని స్టాక్‌ను, రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం డీఎస్పీ బాలాజీ నాయక్‌ మాట్లాడుతూ ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు. నకిలీ బార్‌కోడ్‌, నకిలీ విత్తనాలను అమ్మితే పీడీయాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తామన్నారు.   

Updated Date - 2022-05-17T05:46:35+05:30 IST