మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-01-16T05:36:54+05:30 IST

మత విద్వేషాల రెచ్చగొట్టే.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని తిరుపతి అర్బన్‌జిల్లా అదనపు ఎస్పీలు ఆరిఫుల్లా (శాంతి భద్రతలు), మునిరామయ్య (నేర విభాగం) హెచ్చరించారు.

మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు
వివరాలు వెల్లడిస్తున్న అదనపు ఎస్పీలు ఆరిఫుల్లా, మునిరామయ్య

608 సున్నితమైన ప్రార్థనాలయాల గుర్తింపు

1624 సీసీ కెమెరాల ఏర్పాటు 

అదనపు ఎస్పీలు ఆరిఫుల్లా, మునిరామయ్య


తిరుపతి(నేరవిభాగం), జనవరి 15: మత విద్వేషాల రెచ్చగొట్టే.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని తిరుపతి అర్బన్‌జిల్లా అదనపు ఎస్పీలు ఆరిఫుల్లా (శాంతి భద్రతలు), మునిరామయ్య (నేర విభాగం) హెచ్చరించారు. తిరుపతిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం వీరు విలేకరులతో మాట్లాడారు. అర్బన్‌ జిల్లాలో 608 ప్రార్థనా మందిరాలను సున్నితమైనవిగా గుర్తించామన్నారు. వీటిలో 463 దేవాలయాల్లో 1352, 75 మసీదుల్లో 148, 70 చర్చిల్లో 124 చొప్పున 1624 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిట్టు వివరించారు. ఆయా ప్రార్థనా మందిరాలను నిరంతరం గమనించేలా ప్రత్యేక బీట్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. మిగతా ప్రార్థనా మందిరాల్లోనూ సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు.. ఆలయ భద్రత, గ్రామ కమిటీలను కూడా ఏర్పాటు చేయిస్తున్నట్టు చెప్పారు. కొత్తగా సిద్ధం చేసిన త్రినేత్ర యాప్‌ద్వారా ముఖ్యమైన ఆలయాలను జియో ట్యాగ్‌చేసి పోలీసు అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు. డీఐజీ, ఎస్పీ నేతృత్వంలో సంబంధిత ఆలయాధికారులు, కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా సెక్యూరిటీ ఆడిట్‌ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఇటీవల అనుమానాస్పదంగా కనిపించిన వారిపై 169 కేసులు నమోదుచేసి 729 మందిని బైండోవర్‌ చేసినట్టు తెలిపారు. దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల రక్షణ విషయంలో తాము అప్రమత్తంగా ఉన్నామని, ప్రజలు కూడా సహకారం అందించాలని వారు కోరారు. ఎక్కడైనా అనుమానం కలిగించే పరిస్థితులున్నా పోలీసు డయల్‌ 100కు లేదా 80999 99977 వాట్సప్‌ నెంబరుకు తక్షణం సమాచారమివ్వాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చినవారి వివరాలను రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-01-16T05:36:54+05:30 IST