నూతన సంవత్సరాది వేడుకలపై ఆంక్షలు

ABN , First Publish Date - 2020-12-31T05:57:53+05:30 IST

నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని డిసెంబరు 31వ తేదీ రాత్రి, జనవరి 1వ తేదీ రాత్రి వేడుకలపై పోలీసు యంత్రాంగం ఆంక్షలు విధించింది.

నూతన సంవత్సరాది వేడుకలపై ఆంక్షలు
నూతన సంవత్సరాది వేడుకలకు తిరుపతిలో సిద్ధమవుతున్న కేకులు

నేడు, రేపు  పోలీస్‌ 30 యాక్టు, 144 సెక్షన్ల విధింపు

రోడ్లపైనా, హోటళ్ళు, ఫంక్షన్‌ హాళ్లలోనూ వేడుకలకు అనుమతి లేదు

నగరాలు, పట్టణాలపై ప్రత్యేక దృష్టి... విస్తృత బందోబస్తు

బంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు


తిరుపతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని డిసెంబరు 31వ తేదీ రాత్రి, జనవరి 1వ తేదీ రాత్రి వేడుకలపై పోలీసు యంత్రాంగం ఆంక్షలు విధించింది. చిత్తూరు పోలీసు జిల్లా పరిధిలోనూ, తిరుపతి అర్బన్‌ పోలీసు జిల్లా పరిధిలోనూ పోలీస్‌ 30 యాక్టు, సెక్షన్‌ 144 అమలు చేస్తున్నారు. పోలీసు అధికారులు జారీ చేసిన హెచ్చరికల మేరకు 31వ తేదీ రాత్రి, జనవరి 1వ తేదీ రాత్రి హోటళ్ళు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌ హాళ్ళు, లాడ్జీలలో ఎటువంటి వేడుకలూ జరపరాదు. గుంపులుగా చేరడం, కేక్‌ కటింగ్‌లు, గెట్‌ టు గెదర్‌లు, మందు పార్టీలు, డ్యాన్స్‌ పార్టీలు, మ్యూజికల్‌ నైట్స్‌ లేదా ఆర్కెస్ట్రాలు వంటివి నిర్వహించరాదు.బహిరంగ ప్రదేశాల్లోనూ, నగరాలు, పట్టణాల కూడళ్ళలో గుంపులుగా గుమిగూడడం, మద్యం సేవించడం, కేక్‌ కటింగ్‌లు, బాణా సంచా కాల్చడం, అరుపులు కేకలతో అల్లరి చేయడం వంటివి చేయకూడదు. మోటర్‌ బైక్‌లు ర్యాష్‌గా నడపడం, బైక్‌ రేసింగ్‌లకు పాల్పడడం, వాహనాలను ఆపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివాటికి అనుమతి లేదు. మద్యం దుకాణాలు, బార్లు నిర్ణీత సమయం దాటగానే మూసివేయాలి. లేదంటే వాటి లైసెన్సులు రద్దు చేస్తారు. కొవిడ్‌ నిబంధనలు కూడా అమల్లో వుంటాయి. ప్రజలు ఇళ్ళలోనే న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోవాల్సి వుంటుంది.తిరుపతి, చిత్తూరు నగరాలతో పాటు మదనపల్లె, శ్రీకాళహస్తి, పుంగనూరు, పలమనేరు, పుత్తూరు, నగరి, కుప్పం మున్సిపల్‌ పట్టణాలతో పాటు పీలేరు, వాల్మీకిపురం, బి.కొత్తకోట, వి.కోట, సత్యవేడు తదితర ప్రధాన పట్టణాల్లో కూడా రాత్రి పొడవునా విస్తృత పోలీసు బందోబస్తు వుంటుంది. పలుచోట్ల చెక్‌ పాయింట్లు పెట్టి వాహనాల తనిఖీ చేపట్టనున్నారు. రాత్రి 10 గంటల వరకూ మాత్రమే ఆలయాలు, చర్చిలలో ప్రార్ధనలు, పూజలకు అనుమతి ఇచ్చారు. అది కూడా కొవిడ్‌ నిబంధనలకు లోబడే. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో 50 స్పెషల్‌ పోలీస్‌ పార్టీలు ఏర్పాటు చేశారు. జిల్లాలో పోలీసు శాఖ విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని, ఉల్లంఘించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని చిత్తూరు, తిరుపతి అర్బన్‌ ఎస్పీలు సెంథిల్‌ కుమార్‌, రమేష్‌లు రెడ్డి ప్రకటించారు.

Updated Date - 2020-12-31T05:57:53+05:30 IST