విద్యుత్తు ఉద్యోగుల సమ్మె రాష్ట్రవ్యాప్తంగా చీకట్ల ముప్పు!

ABN , First Publish Date - 2022-08-08T07:57:55+05:30 IST

కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న విద్యుత్తు చట్ట సవరణ బిల్లు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చీకట్లు కమ్ముకునే ముప్పు పొంచి ఉంది

విద్యుత్తు ఉద్యోగుల సమ్మె రాష్ట్రవ్యాప్తంగా చీకట్ల ముప్పు!

కేంద్రం ప్రవేశపెడుతున్న విద్యుత్తు చట్టసవరణ బిల్లుకు నిరసనగా నేడు దేశవ్యాప్త మహాధర్నా

అన్ని రాష్ట్రాల్లో కలిపి 27 లక్షల మంది సమ్మెలోకి!

ఫీడర్లు ట్రిప్పయినా, సరఫరాలో సమస్యలు తలెత్తినా మరమ్మతులకు గంటల కొద్దీ సమయం!

డిమాండ్‌ తగ్గి పవర్‌ గ్రిడ్‌ కుప్పకూలే ప్రమాదం

డిస్కంలను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసే కుట్ర

రాష్ట్ర పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ఆరోపణ

అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగిన టీఈఈ జేఏసీ


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న విద్యుత్తు చట్ట సవరణ బిల్లు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చీకట్లు కమ్ముకునే ముప్పు పొంచి ఉంది! ఈ బిల్లును నిరసిస్తూ విద్యుత్తు ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్తంగా మహా ధర్నాకు పిలుపునివ్వడమే ఇందుకు కారణం. 

వినియోగదారులపై చార్జీల భారం పెంచడంతో పాటు.. కోట్లాది రూపాయలతో విద్యుత్తు సంస్థలు ఏర్పాటు చేసిన విద్యుత్తు లైన్ల నుంచి ప్రైవేటు సంస్థలు విద్యుత్‌ సరఫరా చేసుకునేలా బిల్లు రూపొందించారని.. అందుకే దీన్ని నిరసిస్తూ మహాధర్నా చేపడుతున్నామని విద్యుత్‌ సంఘాల నేతలు తెలిపారు.


ఈ మేరకు.. మహాధర్నా పోస్టర్‌ను ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడలో నేషనల్‌ కో ఆర్టినేషన్‌ కమిటీ సభ్యుడు, పవర్‌ ఇంజనీర్స్‌ అసోషియేషన్‌ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రత్నాకర్‌రావు, సదానందం విడుదల చేశారు. డిస్కంలను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని.. విద్యుత్‌ సంస్థలను పారిశ్రామివేత్తలకు ధారాదత్తం చేసేందుకే ఈ బిల్లు పెడుతున్నారని వారు మండిపడ్డారు. ఇప్పటికే విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ 12 రాష్ట్రాలు తీర్మానం చేశాయని.. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారని పేర్కొన్నారు. కాగా, నేషనల్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ పిలుపు మేరకు.. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యుత్తు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచే విధులు బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ విద్యుత్‌ ఇంజనీర్ల జేఏసీ చైర్మన్‌ కోడూరి ప్రకాశ్‌, కన్వీనర్‌ ఎన్‌.శివాజీ తెలిపారు.


సోమవారం జనరేటింగ్‌ స్టేషన్లు, సర్కిల్‌, డివిజన్‌ కార్యాలయాల ముందు నల్ల బ్యాడ్జీలతో విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తామన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో టీఈఈ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అలాగే.. విద్యుత్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విధులు బహిష్కరించి కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతునట్లు విద్యుత్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య ప్రకటించారు. పార్లమెంట్‌లో విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెడితే నిరసనలు తీవ్రతరం చేస్తామని విద్యుత్‌ సంఘాల నేతలు హెచ్చరించారు. బీజేపీ నేతలను, ఎంపీలు, కేంద్ర మంత్రులను ఎక్కడికక్కడ నిలదీస్తామన్నారు. అవసరమైతే బీజేపీ నాయకులు, ఎంపీలు, కేంద్రమంత్రుల కార్యాలయాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని వారు హెచ్చరించారు. 


తీవ్ర ప్రభావం..

మహా ధర్నాతో రాష్ట్రవ్యాప్తంగా కరెంట్‌ సరఫరా తీవ్ర అంతరాయాలు ఏర్పడి చీకట్లు కమ్ముకునే ప్రమాదముందని.. పరిశ్రమలపై తీవ్ర ప్రభా వం పడే ప్రమాదం ఉందని కొంతమంది సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. ‘‘అసలే వర్షాకాలం.. ఈ సీజన్‌లో విద్యుత్‌ సరఫరాలో సమస్యలు ఏర్పడుతుంటాయి. కానీ, ఉద్యోగులు ధర్నాలో ఉండడం వల్ల.. ఆ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉండదు. గ్రేటర్‌లో పెద్దసంఖ్యలో అపార్ట్‌మెంట్లు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఉన్న నేపఽథ్యంలో ఫీడర్లు ట్రిప్పయినా, విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తలెత్తినా వాటి పరిష్కారానికి గంటల కొద్దీ సమయం పట్టే అవకాశముంది. అత్యవసర సేవలందించే ఆస్పత్రులపైన, మెట్రో, రైల్వే, పరిశ్రమలపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. అలాగే.. విద్యుత్‌ డిమాండ్‌ తగ్గి గ్రిడ్‌ కుప్పకూలే ప్రభావం కూడా ఉంది’’ అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. విద్యుత్‌ సంస్థలను కాపాడుకునేందుకు చేస్తున్న ఉద్యమంలో వినియోగదారులు తమకు సహకరించాలని సంఘాలు కోరుతున్నాయి. 

Updated Date - 2022-08-08T07:57:55+05:30 IST