రాజమహేంద్రవరం అర్బన్, మార్చి 27: కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మార్చి 28, 29 తేదీల్లో చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులు, ప్రజలు జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్ఎస్ మూర్తి, సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ కోరారు. ఈమేరకు ఆదివారం సీఐటీయూ ఆద్వర్యంలో రాజమహేంద్రవరంలోని రైతు బజార్లు, ధవళేశ్వరం మార్కెట్, హార్లిక్స్ ఫ్యాక్టరీ ప్రాంతాల్లో ప్రచారాలు, గేటు మీటింగ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకాన్ని వ్యతిరేకించాలని, ఇతర ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ యత్నాలను విరమించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పూర్ణిమరాజు, కేఎస్వి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.