జోరుగా కల్తీనూనె విక్రయాలు

ABN , First Publish Date - 2022-07-07T05:59:51+05:30 IST

వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో దేవరకొండ డివిజనలో కల్తీ నూనె విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

జోరుగా కల్తీనూనె విక్రయాలు
కొండమల్లేపల్లి సంతలో విక్రయిస్తున్న లూజు నూనె

పెరిగిన ధరలతో జోరందుకున్న వ్యాపారం

ఇబ్బందులు పడుతున్న ప్రజలు  

పట్టించుకోని అధికారులు

దేవరకొండ, జూలై 6: వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో దేవరకొండ డివిజనలో కల్తీ నూనె విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దేవరకొండతో పాటు కొండమల్లేపల్లి, పీఏపల్లి, చందంపేట, చింతపల్లి, డిండి మండలాల్లో కొంతమంది వ్యాపారులు కల్తీనూనె విక్రయిస్తున్నారు. అధికారులు మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించి వెళ్తున్నారే తప్ప కల్తీ నూనె విక్రయాలను అరికట్టలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్‌, హాలియా, కల్వకుర్తి ప్రాంతాల నుంచి డ్రమ్ములు, క్యాన్లలో నూనెను దేవరకొండ ప్రాంతానికి తరలించి విక్రయిస్తున్నారు. దేవరకొండ, కొండమల్లేపల్లిలో లూజు నూనె పేరుతో విక్రయిస్తున్నారు. దేవరకొండ ప్రాంతంలోని గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యాపారులు నకిలీ నూనెను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నాణ్యమైన నూనెనా, కల్తీనూనెనా తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు వాపోతున్నారు. మంచినూనె  ధర కిలోకు రూ.210కి చేరుకుంది. కరోనా సమయంలో కిలోకు రూ.75 ఉన్న మంచి నూనె ప్యాకెట్లు ఇప్పుడు రూ.200 నుంచి 220 వరకు పెరిగింది. ఇదే ఆసరాగా చేసుకున్న కొంతమంది వ్యాపారులు లూజు నూనె పేరుతో కల్తీనూనె విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విజిలెన్స, తూనికల కొలతలు, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కల్తీనూనె విక్రయాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కల్తీనూనెతో అనారోగ్యానికి గురవుతున్నారని, పచ్చడి పెడితే నెల రోజులు కూడా నిల్వ ఉండటం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజిలెన్స, రెవెన్యూ, ఫుడ్‌ ఇనస్పెక్టర్‌ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కల్తీనూనె విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. 

నూనె కొనుగోలు చేస్తే రశీదు ఇవ్వడం లేదు 

దేవరకొండలోని దుకాణాల్లో మంచినూనె కొనుగోలు చేస్తే రశీదు ఇవ్వడం లేదు. లూజు నూనె పేరుతో కల్తీ నూనె విక్రయిస్తున్నారు. అధికారుల కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కల్తీనూనె విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి.

 వస్కుల సుధాకర్‌, దేవరకొండ 

తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం 

కల్తీ నూనె విక్రయిస్తే తనిఖీలు నిర్వహించి వారిపై చర్యలు తీసుకుంటాం. ఫుడ్‌ సేఫ్టీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తూనే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. సమస్యలు ఉంటే వినియోగదారులు వెంటనే తమ దృష్టికి తీసుకురావాలి. 

 శ్వేత, జిల్లా ఇనచార్జి ఫుడ్‌ ఇనస్పెక్టర్‌  

Updated Date - 2022-07-07T05:59:51+05:30 IST