టిడ్కో ఇళ్లకు టాటా!

ABN , First Publish Date - 2020-07-05T11:58:47+05:30 IST

జిల్లాలో టిడ్కో(టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్ర్ఫాస్ట్రక్చరల్‌ కార్పొరేషన్‌) ఇళ్ల నిర్మా ణాలను రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీ హయాంలో మంజూరై..

టిడ్కో ఇళ్లకు టాటా!

నిర్మాణాలు ప్రారంభం కాని వాటిని నిలిపేస్తూ జీవో 

జిల్లాలో 3,216 గృహాలు రద్దు 

పునాది దశలో ఉన్న యూనిట్ల తొలగింపు


(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి): జిల్లాలో టిడ్కో(టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్ర్ఫాస్ట్రక్చరల్‌ కార్పొరేషన్‌) ఇళ్ల నిర్మా ణాలను రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీ హయాంలో మంజూరై.. నేటికీ నిర్మాణం ప్రారంభించని వాటిని పూర్తిగా నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో 640 జారీ చేసింది. గత ప్రభుత్వ హయాం లో మంజూరైన సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నట్లే తాజాగా.. ఏహెచ్‌పీ- పీఎంఏవై(ప్రధానమంత్రి అవాస్‌ యోజన) పథకం కింద మంజూరైన ఇళ్లను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో జిల్లాలో వేలాది మంది పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో గ్రౌండింగ్‌ అయిన 7,088 ఇళ్లలో 3,216 గృహాలు రద్దు కానున్నాయి. 


జిల్లాలో ఇదీ పరిస్థితి

శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పలాస, రాజాం, ఆమదాలవలస పట్టణ ప్రాంతాల్లో 7,088 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం టిడ్కో ఏర్పాటు చేసింది. అప్పట్లో 300 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్ల కోసం రూ.500,  365 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్ల కోసం రూ.12,500, ఇంకా 430 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లకోసం రూ.25,000 చొప్పున లబ్ధిదారులు డీడీలను మునిసిపాల్టీ కార్యాలయాల్లో చెల్లించారు.  గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ బాధ్యతలను హౌసింగ్‌ కార్పొరేషన్‌కు, పట్టణ ప్రాంత పనులను టిడ్కోకు ప్రభుత్వం అప్పగించింది. జిల్లాలో చాలా ఇళ్లు గ్రౌండింగ్‌ పూర్తయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం మిగిలిన వాటిని పూర్తి చేయాల్సి ఉంది. కానీ, నిర్మాణ పనులు నిలిపివేసింది. ప్రారంభించిన వాటిలో కూడా పదిశాతం ఇళ్లకు కోత వేయనుంది. బేస్‌మెంట్‌ లెవల్‌, ఇంకా తక్కువ స్థాయిలో ఉన్న ఇళ్ల తొలగింపునకు ఉపక్రమిస్తోంది. ఇందులో భాగంగా 3,216 ఇళ్లు రద్దు చేసింది. 300 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లు 1632, 365ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లు 816, 430 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లు 768.. మొత్తం 3,216 ఇళ్లను రద్దు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా ఇళ్లు రద్దయిన లబ్ధిదార్లకు ఇళ్ల స్థలాలను అందిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ నెల 8న చేపట్టే ఇళ్ల స్థలాల పంపిణీలో ఎవరికీ అవకాశం కల్పించలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో ఇస్తారో! ఇవ్వరో! అని సందేహిస్తున్నారు. 


 తొలగింపు జాబితా..  

శ్రీకాకుళం పట్టణానికి సంబంధించి పాత్రుని వలస-1, పాత్రునివలస-2 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో పాత్రుని వలస-1లో 1280 ఇళ్లు గ్రౌండింగ్‌ అయ్యాయి. ఇవేవీ రద్దు కాలేదు. పాత్రునివలస-2లో 1,392 ఇళ్లు గ్రౌండింగ్‌ చేశారు. ఇందులో 768 ఇళ్లను రద్దు చేశారు. 


రాజాం పట్టణానికి సంబంధించి కంచరాం గ్రామంలో 1104 టిడ్కో ఇళ్లు గ్రౌండింగ్‌ అయ్యా యి. ఇక్కడ కూడా 768 ఇళ్లను రద్దు చేశారు. 

ఆమదాలవలస పట్టణానికి సంబంధించి ఆమదాలవలసలో 528 ఇళ్లకు గ్రౌండింగ్‌ జరిగింది. ఇక్కడేమీ రద్దు చేయలేదు. 

ఇచ్ఛాపురం పట్టణానికి సంబంధించి ఇచ్ఛాపురంలో 816 ఇళ్ల నిర్మాణానికి గ్రౌండింగ్‌ జరిగింది. ఇందులో అత్యధికంగా 624 ఇళ్లు రద్దయ్యాయి. 

పలాస కాశీబుగ్గ పట్టణానికి సంబంధించి పలాసలో 1968 ఇళ్ల నిర్మాణానికి  గ్రౌండింగ్‌ జరి గింది. ఇందులో 1056 ఇళ్లను రద్దుచేశారు. 


డీడీలు వెనక్కి.. 

పునాది స్థాయిలో ఉన్న టిడ్కో ఇళ్లు 3,216 రద్దయ్యాయి. వీటి స్థానంలో లబ్ధిదారులకు స్థలాలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అప్పట్లో 300ఎస్‌ఎఫ్‌టీ ఇళ్ల కోసం రూ.500, అలాగే 365 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్ల కోసం రూ.12,500, ఇంకా 430 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్ల కోసం రూ.25,000 చొప్పున లబ్ధిదారులు డీడీలను మునిసిపాల్టీ కార్యాలయాల్లో   చెల్లించారు. రద్దయిన ఇళ్లకు సంబంధించి డీడీలు మళ్లీ వెనక్కి వచ్చేస్తాయి.  

- రమణమూర్తి, టిడ్కో ఈఈ

Updated Date - 2020-07-05T11:58:47+05:30 IST