తాగునీటి కోసం తండ్లాట

ABN , First Publish Date - 2022-07-03T05:39:46+05:30 IST

తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతుంటే మున్సిపల్‌ అధికారులు మాత్రం సమస్య పరిష్కారానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల పాటు సమస్య ఉంటే సరేకాని నెలల తరబడి నీరందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంపై ప్రజలు విసిగెత్తి ఆందోళనలకు దిగుతున్నారు.

తాగునీటి కోసం తండ్లాట
మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న ప్రజలు

- రోజుల తరబడి నీరందడం లేదంటున్న ప్రజలు

- అవసరాలకు తగ్గట్టు ట్యాంకర్ల ద్వారా నీటి పంపిణీ కరువు

- నిత్యం ఏదోచోట పైప్‌లైన్‌లు పగిలిపోతున్న వైనం

- శాశ్వత పరిష్కారం చూపని అధికారులు


కామారెడ్డి టౌన్‌, జూలై 2: తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతుంటే మున్సిపల్‌ అధికారులు మాత్రం సమస్య పరిష్కారానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల పాటు సమస్య ఉంటే సరేకాని నెలల తరబడి నీరందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంపై ప్రజలు విసిగెత్తి ఆందోళనలకు దిగుతున్నారు. ఎండాకాలం నీటి ఎద్దడి ఉందంటే అర్థం చేసుకోవచ్చు కానీ వర్షాకాలం సైతం నెలల తరబడి నీరు అందించకపోవడం, నీటి సమస్యలపై అధికారులు అలసత్వం వహించడం విడ్డూరంగా ఉందని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. నీటి పన్నులు కట్టించుకోవడంలో చూపే శ్రద్ధ నీటి పంపిణీపై ఎందుకు చూపడం లేదని అధికారులను నిలదీసేస్థాయికి ప్రజలు వచ్చారంటే అధికారుల పనితీరుకు అద్దం పడుతుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లో నెలల తరబడి నీరు అందకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్నారు. కుళాయిల ద్వారా నీరు సరఫరా లేకపోతే ప్రజలకు కావాల్సిన నీటిని ట్యాంకర్ల ద్వారానైన సరఫరా చేయకపోవడం అధికారుల అలసత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది.

నిత్యం ఏదో చోట పగిలిపోతున్న పైప్‌లైన్‌లు

పట్టణంలోని ఆయా కాలనీల్లో పైపులైన్‌లకు ఎక్కడ పడితే అక్కడ లీకులు పడడంతో తాగునీరు వృథా అవుతోంది. దీంతో పరిసర ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీరు సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు తాగునీరు అందించడానికి వాటర్‌ వాల్వ్‌లు తిప్పడం వరకే మున్సిపల్‌ వాటర్‌వర్క్స్‌ సిబ్బంది పని చేస్తున్నారు తప్పితే లీకేజీలను పట్టించుకోవడం లేదనే విమర్శలు లేకపోలేదు. దీంతో ప్రజలకు అందాల్సిన నీరు రోడ్డుపై వృథాగా పోతోంది. పైప్‌లైన్‌ పగిలిపోయి అధికారుల దృష్టికి ప్రజలు తీసుకువచ్చే వరకు కింది స్థాయి సిబ్బంది గుర్తించడం లేదంటే వారి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు నీటి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్యకు తగిన పరిష్కారం చూపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయా వార్డుల్లో నీటి వాల్వ్‌ను తిప్పి వెళ్తున్నారే తప్ప ఎక్కడైనా సమస్య ఉందని మాత్రం పరిశీలించడంలేదని పేర్కొంటున్నారు. 

నీటి సమస్యలపై ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపని అధికారులు

కామారెడ్డి మున్సిపాలిటీలో పారిశుధ్యం, నీటి సమస్యలు ఎప్పటి నుంచో ప్రజలు ఎదుర్కొంటున్న  ప్రధాన సమస్యలు. పారిశుధ్యంలో కొంత మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నా నీటి సమస్యలు మాత్రం ప్రతీసారి ప్రజలను వేధిస్తునే ఉన్నాయి. కామారెడ్డి మున్సిపల్‌కు పెద్దచెరువు, శ్రీరాంసాగర్‌తో పాటు పాత పట్టణంలోని మత్తడి వద్ద నుంచి నీటి సరఫరా చేస్తున్నారు. ఇవికాక పలు బోర్ల ద్వారా సైతం ప్రజలకు నీటిని అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నా లీకేజీలతో సమస్యలు నెలకొంటున్నాయని తెలుస్తోంది. నిత్యం ఏదో ఒకచోట లీకేజీలు కావడం వాటిని మరమ్మతులు చేసేలోపు మరోచోట లీకేజీలు కావడంతో మున్సిపల్‌ సిబ్బంది సైతం నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఈ సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం చూపడంలో పై అధికారులు మాత్రం శ్రద్ధ వహించడం లేదని ప్రజాప్రతినిధులు, పలువురు మున్సిపల్‌ సిబ్బంది పేర్కొంటుడడం గమనార్హం. పలు వార్డులకు సరఫరా అవుతున్న నీటిలో మురుగునీరు పారడం, చెత్తాచెదారం సరఫరా అవుతుందని ప్రజలు పేర్కొంటున్నా పట్టించుకోవడం లేదనే వాదనలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారించి ప్రజలు పడుతున్న నీటి సమస్యలపై పరిష్కారం చూపాలని కోరుతున్నారు.


15 రోజుల నుంచి నీటి సరఫరా లేదు

- రాములు, అశోక్‌నగర్‌, కామారెడ్డి

గత 15 రోజుల నుంచి నీరు లేక నానా అవస్థలు పడుతున్నాం. నీటి సరఫరా కావడం లేదని అడుగుతున్న ప్రతీసారి ఏదో ఒక మాట చెప్పి దాటవేస్తున్నారే తప్ప నీటిని అందించే ప్రయత్నం చేయడం లేదు. నీటి పన్నులపై శ్రద్ధ చూపుతున్న అధికారులు నీటిని అందించడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు.


ట్యాంకర్ల ద్వారా సరిపడా నీటిని అందించడం లేదు

- జ్యోతి, బతుకమ్మకుంట, కామారెడ్డి

నెలల తరబడి నీరు రాకున్నా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. లీకేజీల వల్ల నీరు రావడం లేదని చెబుతున్నారే తప్ప సరిపడా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే ప్రయత్నం చేయడం లేదు. దీంతో నీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

Updated Date - 2022-07-03T05:39:46+05:30 IST