వ్యవస్థతో పోరాడుతున్నా!

ABN , First Publish Date - 2021-05-01T05:41:13+05:30 IST

అక్టోబర్‌ 5, 2020... సంచలనం రేపిన హథ్రాస్‌ అత్యాచార ఘటనపై వాకబు చేసేందుకు ఉత్తరప్రదేశ్‌ వెళ్లిన ఢిల్లీ పాత్రికేయుడు సిద్దికీ కప్పన్‌ జీవితం అనూహ్య మలుపు తిరిగింది. అదే రోజు అతడి భార్య రైహానా జీవితం కూడా సమూలంగా మారిపోయింది. ఇంట్లో ఇద్దరు పిల్లలు, తొంభై ఏళ్ల

వ్యవస్థతో పోరాడుతున్నా!

అక్టోబర్‌ 5, 2020... సంచలనం రేపిన హథ్రాస్‌ అత్యాచార ఘటనపై వాకబు చేసేందుకు ఉత్తరప్రదేశ్‌ వెళ్లిన ఢిల్లీ పాత్రికేయుడు సిద్దికీ కప్పన్‌ జీవితం అనూహ్య మలుపు తిరిగింది. అదే రోజు అతడి భార్య రైహానా జీవితం కూడా సమూలంగా మారిపోయింది. ఇంట్లో ఇద్దరు పిల్లలు, తొంభై ఏళ్ల అత్తగారిని చూసుకుంటూనే భర్త సంకెళ్లు తెంచడానికి పోరాటం మొదలుపెట్టారామె. ఆ దారిలో ఎన్నో సవాళ్లు, సంఘర్షణలు ఎదురైనా వెరవకుండా ముందుకే అడుగు వేసిన ఆమె మనోవేదన ఇది... 


‘‘ఏప్రిల్‌ 21... మా లాయర్‌ ఫోన్‌ చేసి ‘కప్పన్‌కు కరోనా వచ్చింది. ఆస్పత్రికి తరలించారు’అని చెప్పారు. అప్పటికే పదిహేను రోజులుగా మా ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారట. ఆస్పత్రి బాత్‌రూమ్‌లో స్పృహ తప్పి పడిపోయారని లాయర్‌ ద్వారా తెలుసుకున్నాను. ఆంతకు మించిన ఎలాంటి సమాచారం మాకు అందలేదు. 


గొలుసులతో కట్టేశారు

ఆ తరువాత నాలుగు రోజులకు కప్పన్‌ నుంచి కాల్‌ వచ్చింది. అదికూడా పక్క పేషెంట్‌ ఫోన్‌ నుంచి! మాట రావడంలేదు. గొంతు చాలా పీలగా ఉంది. బాత్‌రూమ్‌లో పడ్డప్పుడు తన గవద పగిలిందని, విపరీతమైన నొప్పి వల్ల అన్నం కూడా తినలేకపోతున్నానని చెప్పారు. కరోనా కూడా సోకిందన్నారు. తరువాత అసలు విషయం వివరించారు... ‘‘నేను అర్జెంట్‌గా బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అయితే నన్ను గొలుసుతో మంచానికి కట్టేయడం వల్ల పైకి లేవలేకపోయాను. గొలుసు తీయడానికి పోలీసులు ఒప్పుకోలేదు. ఈ బాధ భరించలేకపోతున్నా. మన లాయర్‌తో మాట్లాడి ఎలాగైనా నన్ను తిరిగి జైలుకి పంపించేలా చూడు’’ నా భర్త వేడుకొంటుంటే నాకు షాక్‌ తగిలినట్టయింది.


కొన్ని క్షణాలు నిశ్చేష్టురాలినైపోయాను. కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. ఏం చేయాలో తోచక  నేను, నా పిల్లలు వెక్కి వెక్కి ఏడ్చాం. కానీ కాసేపటికి తేరుకున్నాను. అంత బాధలోనూ బలాన్ని కూడగట్టుకున్నా. ఇక్కడ నేను వృథా చేసే ప్రతి క్షణం అక్కడ నా భర్తను నరకంలోంచి బయటకు తేవడాన్ని ఆలస్యం చేస్తుందని గ్రహించాను. వెంటనే మా లాయర్‌కు ఫోన్‌ చేశాను. నా భర్త విషయంలో పూర్తిగా మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయమన్నారు లాయర్‌. ఆ రోజు రాత్రే సీజేకి లేఖ సిద్ధం చేశాను. 


లేఖతో నమ్మకం వచ్చింది 

‘ఇంత దారుణంగా ఒక మనిషిని జంతువులా గొలుసులతో మంచానికి ఎలా కట్టేస్తారు? ఆస్పత్రి నుంచి పారిపోతాడనే అనుమానం ఉంటే వేరే గదిలో పెట్టాలి. టాయిలెట్‌కు కూడా వెళ్లలేకపోతున్నారని, 15 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని తెలుసా? బాత్‌రూమ్‌లో స్పృహ తప్పి పడిపోయినా పట్టించుకొనే దిక్కులేదు. కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. జైలు తిండి తినలేక, అర్ధాకలితో గడుపుతున్నారు’ అని కప్పన్‌ పరిస్థితి వివరిస్తూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాను.


మెరుగైన వైద్యం కోసం కప్పన్‌ను ఢిల్లీలోని ‘ఎయిమ్స్‌’కు తరలించాలని కోరాను. ఆ లేఖను స్వీకరించిన సుప్రీమ్‌కోర్టు... కప్పన్‌ మెడికల్‌ రిపోర్ట్స్‌ తమ ముందు ఉంచమని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మా ఆయనను ఎయిమ్స్‌కు తరలించాలని కొత్త సీజే ఎన్వీ రమణ యూపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వడం నాకు ఎంతో ఊరటనిచ్చింది. 


నా భర్త కేసులో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందంటూ కేరళ ముఖ్యమంత్రి స్వయంగా యూపీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ‘కేరళ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌’ సభ్యుల అండతో నా భర్తను జైలు నుంచి విడిపించుకోగలనన్న నమ్మకం కలిగింది. అన్నిటికంటే ముఖ్యంగా సుప్రీమ్‌కోర్టు నా అభ్యర్థన వినడానికి సమ్మతించింది. గత ఏడు నెలలుగా ఒక అమాయకుడు యూపీ జైల్లో మగ్గుతున్నాడు. ఆ హింస నుంచి అతడికి స్వేచ్ఛ కావాలి. వ్యక్తితో కాదు... వ్యవస్థతో పోరాడుతున్నానని నాకు తెలుసు. నాకు ఇంత ధైర్యం, స్థైర్యం బహుశా ఒక నిజం కోసం పోరాడుతున్నందుకు భగవంతుడే ఇచ్చి ఉంటాడు. ఎప్పటికైనా నిజమే గెలవాలి. గెలుస్తుంది కూడా!


ఒకానొక సమయంలో నా భర్తను కాపాడుకోగలనన్న నమ్మకమే నాకు లేదు. కానీ ఇప్పుడు చాలామంది నాకు మద్దతుగా నిలుస్తున్నారు. మొదటిసారిగా 11మంది కేరళ ఎంపీలు, ముఖ్యమంత్రి, జర్నలిస్ట్‌ సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు నాకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చాయి.

Updated Date - 2021-05-01T05:41:13+05:30 IST