సంతోషించాలా? బాధపడాలా?

ABN , First Publish Date - 2020-06-15T18:31:37+05:30 IST

మా అబ్బాయికి 22 ఏళ్లు. ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం కావడంతో, వాణ్ణి దగ్గరగా గమనించే సమయం మాకు దొరికింది. ఈ సమయంలో వాడి ప్రవర్తనలో విపరీత

సంతోషించాలా? బాధపడాలా?

ఆంధ్రజ్యోతి(15-06-2020)

ప్రశ్న: మా అబ్బాయికి 22 ఏళ్లు. ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం కావడంతో, వాణ్ణి దగ్గరగా గమనించే సమయం మాకు దొరికింది. ఈ సమయంలో వాడి ప్రవర్తనలో విపరీత ధోరణులను గమనించాం. ఆరా తీస్తే, మా వాడు చాలాకాలం నుంచి గంజాయికి అలవాటు పడినట్టు చెప్పాడు. లాక్‌డౌన్‌ కారణంగా గంజాయి దొరకకపోవడంతో, విత్‌డ్రాయల్‌ సింప్టమ్స్‌తో బాధపడుతున్నట్టు చెప్పుకొచ్చాడు. ఆ బాధ నుంచి తప్పించుకోవాలంటే ఆ వ్యసనం నుంచి శాశ్వతంగా బయట పడాలని నిశ్చయించుకుని, మాకు ఆ దురలవాటు గురించి బయల్పరిచినట్టు కూడా చెప్పాడు. మా అబ్బాయికి ఇలాంటి దుర్వ్యసనం ఉన్నందుకు బాధపడాలో, ఇప్పటికైనా మానుకోవాలని నిర్ణయించుకున్నందుకు సంతోషించాలో అర్థం కాని పరిస్థితి మాది. మమ్మల్ని ఏం చేయమంటారు? ఈ దురలవాటు నుంచి మా అబ్బాయిని దక్కించుకోగలమా? 


- ఓ తండ్రి, హైదరాబాద్‌.


డాక్టర్ సమాధానం: లాక్‌డౌన్‌ మీ అబ్బాయికి మేలే చేసింది. మూడేళ్లుగా మీకు తెలియకుండా దాచిపెట్టిన ఆ చెడు అలవాటు గురించి, లాక్‌డౌన్‌ కారణంగానే మీకు తెలిసింది. లేదంటే ఆ అలవాటు మరింత ముదిరిపోయి, మీ అబ్బాయి జీవితాన్ని నాశనం చేసి ఉండేది. కాబట్టి ఇప్పటికైనా తెలిసినందుకు, మానుకోవాలనే ఆలోచన మీ అబ్బాయికి కలిగినందుకు సంతోషించండి. గంజాయిని సరఫరా చేసేవాళ్లు, తోటి స్టూడెంట్స్‌, స్నేహితులు.. ఎవరూ కూడా గంజాయి తాగడంలో ఉన్న ఆనందాన్ని మాత్రమే వర్ణిస్తారు తప్ప, గంజాయితో కలిగే మానసిక, శారీరక పరిణామాలు, దుష్ప్రభావాల గురించి మాట్లాడరు. గంజాయితో ఆరోగ్యం కుదేలయిన సందర్భాల గురించి తెలిసినా, ‘మనకు అలా జరగదులే!’ అనే ఓ గుడ్డి నమ్మకం వారిలో ఉండిపోతుంది. కాబట్టి మొదట ఆ పరిణామాల గురించి వివరించాలి. ఇందుకు కౌన్సెలింగ్‌ అవసరం. కోపం తెచ్చుకోకుండా, వారికి అర్థమయ్యే సాంకేతిక భాషాజ్ఞానంతో గంజాయి దుష్ప్రభావాల గురించి వివరించాలి. ఇప్పటికీ మించిపోయింది లేదనీ, ఆలస్యంగానైనా కళ్లు తెరచినందుకు తల్లితండ్రులుగా గర్వపడుతున్నామనే మాటలతో అబ్బాయిలో మానసిక పరివర్తన కలిగించే ప్రయత్నం చేయండి. అవసరాన్ని బట్టి మానసిక వైద్యుల సహాయమూ తీసుకోండి. మీ అబ్బాయి ఆ దురలవాటు నుంచి కచ్చితంగా బయటపడతాడు. కంగారు పడకండి.


-డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి,

మానసిక నిపుణులు, హైదరాబాద్‌.

Updated Date - 2020-06-15T18:31:37+05:30 IST