ఇంటికి వస్తానని అనుకోలేదు...

ABN , First Publish Date - 2022-03-15T13:40:49+05:30 IST

తాను మళ్లీ ఇంటికి చేరుకుంటానని అనుకోలేదని ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థి అరుణాచలం కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో రాణీపేట జిల్లా ఆర్కాడులోని తన

ఇంటికి వస్తానని అనుకోలేదు...

                   - ఆర్కాడు విద్యార్థి అరుణాచలం


వేలూరు(చెన్నై): తాను మళ్లీ ఇంటికి చేరుకుంటానని అనుకోలేదని ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థి అరుణాచలం కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో రాణీపేట జిల్లా ఆర్కాడులోని తన స్వగృహానికి చేరుకున్న అరుణాచలం మీడియాతో మాట్లాడుతూ... తాను ఉక్రెయిన్‌లోని కీవ్‌ నగరంలో మెడిసిన్‌ మొదటి సంవత్సరం చదువుకుంటున్నానని, తనలాంటి వారు వందలాదిమంది అక్కడున్నారని వివరించాడు. తాను కీవ్‌ నుంచి లివింగ్‌ ప్రాంతానికి ఓ రైలులో వచ్చానని, అయితే బాంబు శబ్దం వస్తే చాలు.. గంటల కొద్దీ ఆ రైలు ఆగిపోయేదని వివరించాడు. యుద్ధ విమానాల జాడ కనిపిస్తే రైలులో లైట్లన్నీ ఆర్పేసి, రైలు నిలిపివేసే వారన్నారు. 


మార్గం చూపండి: జనని

 ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ 3వ సంవత్సరం చదువుతున్న వేలూరు తోటపాళయంనకు చెందిన ఏకాంబరం కుమార్తె జనని (22)అక్కడ తాను ఎదుర్కొన్న కష్టాలను వివరించింది. వందలాదిమంది భారత విద్యార్థులు యుద్ధం కారణంగా అర్ధాంతరంగా చదువు ఆపేసి, స్వదేశానికి చేరుకున్నారని, వారందరూ మళ్లీ చదువుకునేందుకు మార్గం చూపాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది.


40 గంటలు ఆహారం లేకుండా ప్రయాణించాం: అర్షియా

 తాను కీవ్‌ నగరంలోని ప్రైవేటు యూనివర్సిటీలో మెడిసిన్‌ చివరి సంవత్సరం చదువుతున్నానని తిరుపత్తూరు జిల్లా ఆంబూరు నూరుల్లాపేటకు చెందిన అర్షియా (22) పేర్కొంది. యుద్ధం కారణంగా తనలాంటి విద్యార్థులంతా భారత్‌కు వచ్చేశారని కన్నీటి పర్యంతమైంది. 40 గంటల పాటు ఆహారం లేకుండా రైలులో ప్రయాణించి హంగేరి సరిహద్దులకు చేరుకోవడంతో తాము భారత అధికారులను అందుకోగలిగామని వివరించింది. 

Updated Date - 2022-03-15T13:40:49+05:30 IST