పెన్నా నదిలో మునిగి విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2021-12-08T06:34:26+05:30 IST

ఈత సరదా విద్యార్థి ప్రాణం తీసింది. హిందూపురం మండలం చౌళూరు గ్రామ సమీపాన పెన్నా నదిలో మునిగి విద్యార్థి నవదీప్‌ (12) మంగళవారం మృతిచెందాడు.

పెన్నా నదిలో మునిగి విద్యార్థి మృతి
నీటికుంటలో గాలిస్తున్న యువకులు

- కాపాడేందుకెళ్లి మరో వ్యక్తి కూడా..

హిందూపురం టౌన, డిసెంబరు 7: ఈత సరదా విద్యార్థి ప్రాణం తీసింది. హిందూపురం మండలం చౌళూరు గ్రామ సమీపాన పెన్నా నదిలో మునిగి విద్యార్థి నవదీప్‌ (12) మంగళవారం మృతిచెందాడు. విద్యార్థిని కాపాడేందుకెళ్లిన నరసింహమూర్తి (50) కూడా చనిపోయాడు. చౌళూరుకు చెందిన దివ్యాంగుడు నరసింహప్ప కుమారుడు నవదీప్‌.. స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. పాఠశాల ముగించుకుని సాయంత్రం నలుగురు మిత్రులతో కలిసి పెన్నా నదిలోకి ఈతకెళ్లాడు. విద్యార్థులు గుంతలో పక్కనే ఈత కొడుతుండగా.. నవదీప్‌ మధ్యలోకి వెళ్లాడు. అక్కడ బురదలో చిక్కుకున్నాడు. సమీపంలోనే చేపలు పడుతున్న చౌళూరుకే చెందిన నరసింహమూర్తి గమనించి, కాపాడేందుకెళ్లాడు. అతడు కూడా నీటిలో మునిగాడు. చుట్టుపక్కల ఉన్నవారు తాళ్ల సాయంతో గుంతలోకి దిగారు. అరగంట తరువాత నరసింహమూర్తి మృతదేహాన్ని వెలికితీశారు. నవదీప్‌ ఆచూకీ దొరకలేదు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి  చేరుకుని, వెతికారు. రాత్రి 7.30 సమయంలో నవదీప్‌ మృతదేహాన్ని వెలికితీశారు. నదిలో మునిగి ఇద్దరు మృతిచెందడంతో చౌళూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. నవదీ్‌పకు తల్లి గంగమ్మ, అక్క శ్రీజ ఉన్నారు. నరసింహమూర్తికి భార్య తులసమ్మ, కుమారుడు ఉపేంద్ర ఉన్నారు. వీరు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. పెద్ద దిక్కును పోగొట్టుకున్న నరసింహమూర్తి కుటుంబికులు బోరున విలపించారు. ఒక్కగానొక్క కుమారుడి చనిపోవడంతో నవదీప్‌ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. రూరల్‌ పోలీసులు ప్రమాదస్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేపట్టారు.





Updated Date - 2021-12-08T06:34:26+05:30 IST