విద్యార్థిని సింధూకు Cm Stalin పరామర్శ

ABN , First Publish Date - 2022-05-26T13:33:24+05:30 IST

స్థానిక ఓమాండూరార్‌ ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోడంబాక్కం ప్రాంతానికి చెందిన ప్లస్‌-2 విద్యార్థిని సింధూను ముఖ్యమంత్రి స్టాలిన్‌ బుధవారం

విద్యార్థిని సింధూకు Cm Stalin పరామర్శ

చెన్నై: స్థానిక ఓమాండూరార్‌ ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోడంబాక్కం ప్రాంతానికి చెందిన ప్లస్‌-2 విద్యార్థిని సింధూను ముఖ్యమంత్రి స్టాలిన్‌ బుధవారం పరామర్శించారు. కోడంబాక్కం వెల్లాల వీధిలో నివసిస్తున్న శక్తి, దేవి దంపతుల కుమార్తె సింధూ రెండేళ్ల క్రితం స్నేహితురాలి ఇంటి మిద్దెపై నుండి కిందపడటంతో రెండు కాళ్ళకు తీవ్రగాయాలయ్యాయి. ఆ తర్వాత ఇంటిదగ్గరే చికిత్స తీసుకుంటూ నడవలేని స్థితిలో ఉన్న సింధూను ఆమె తండ్రి ప్లస్‌-2 పబ్లిక్‌ పరీక్షలు రాయడానికి పరీక్షా కేంద్రానికి మోసుకెళ్ళారు. ఆ ఫొటోలు, వీడియో సామాజిక ప్రసారమాధ్యమాల్లో ప్రసారం అయ్యాయి. ముఖ్యమంత్రి స్టాలిన్‌ వాటిని చూసి సింధూ పరీక్షా కేంద్రాని వెళ్లేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షలు పూర్తయిన తర్వాత ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యంను ఆదేశించారు. ఆ మేరకు ఓమండూరార్‌ ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రత్యేక వార్డులో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. గత రెండు రోజులుగా సింధూ లేచి నిలబడి, మెల్లగా నడిచే స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆస్పత్రికి వెళ్ళి సింధూను పరామర్శించారు. ముఖ్యమంత్రిని చూడగానే సింధూ తల్లిదండ్రులు ఆయన కాళ్ళకు మొక్కారు. ఆ తర్వాత స్టాలిన్‌ సింధూను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం సింధూ తండ్రి శక్తి టీ వ్యాపారం చేస్తున్నాడని తెలుసుకున్న ముఖ్యమంత్రి ఓమండూరార్‌ ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో ఏడాదిపాటు టీ వ్యాపారం చేసుకునేందుకు అనుమతించాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2022-05-26T13:33:24+05:30 IST