విలీనం వద్దు..

ABN , First Publish Date - 2022-07-07T06:16:59+05:30 IST

పాఠశాలల విలీన ప్రక్రియను తక్షణమే నిలిపి వేయాలని ముసునూరు ప్రాథమిక మెయిన్‌ పాఠశాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం ఆందోళన చేశారు.

విలీనం వద్దు..
ముసునూరు మెయిన్‌ పాఠశాల వద్ద ఆందోళన

ముసునూరులో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన

ముసునూరు, జూలై 6: పాఠశాలల విలీన ప్రక్రియను తక్షణమే నిలిపి వేయాలని ముసునూరు ప్రాథమిక మెయిన్‌ పాఠశాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం ఆందోళన చేశారు. 3, 4, 5 తరగతులు చదువుతు న్న తమ పిల్ల్లలను ఈ పాఠశాలలోనే ఉంచాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ చింతా రాంబాబు, వైస్‌ చైర్మన్‌ కొడాలి స్వర్ణ కుమారి, కమిటీ సభ్యులు మాట్లాడుతూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హైస్కూల్‌కు వెళ్లాలంటే ఎప్పుడూ ట్రాఫిక్‌తో రద్దీగా ఉంటే రహదారి నుంచి చిన్న పిల్లలను ఎలా  ప్రశ్నించారు. ప్రభుత్వం మందుచూపు లేకుండా పాఠశాలల విలీనం చేయటంపై వారు ఆసహనం వ్యక్తం చేశారు. తమ నివాసాలకు దగ్గరలో ఉన్న మెయిన్‌ పాఠశాలలోనే పిల్లలను ఉంచేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని  పాఠశాలల కాంప్లెక్స్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌కు  వినతిపత్రం అందజేశారు.


 హైస్కూళ్లకు  తరలిన చిన్నారులు..

ముదినేపల్లి, జూలై 6 : మండలంలోని ఐదు ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులు సమీప యూపీ, హైస్కూళ్లకు వెళ్లారు. పెయ్యేరు శివారు రంగాపురం పాఠశాల నుంచి ముదినేపల్లి హైస్కూల్‌కు 30 మంది, పెదగొన్నూరు ప్రాథమిక పాఠశాల నుంచి అదే గ్రామంలోని హైస్కూల్‌కు 60 మంది, వడాలి–2 ప్రాథమిక పాఠశాల నుంచి హైస్కూలుకు 30 మంది, ప్రొద్దువాక–1 ప్రాథమిక పాఠశాల నుంచి యూపీ స్కూల్‌కు 36 మంది, చిగురుకోట నుంచి హైస్కూల్‌కు 30 మంది విద్యార్థులు హాజరయ్యారు. ముది నేపల్లి హైస్కూల్‌ హెచ్‌ఎం ప్రభుదాసు, ఉపాధ్యాయులు, సీఆర్‌పీ రంగాపురం ప్రాథమిక పాఠశాలకు వెళ్లి విద్యార్థులను హైస్కూల్‌కు తీసుకెళ్లారు.

సింగిల్‌ టీచర్‌ స్కూళ్లు : విలీన ప్రక్రియతో ముదినేపల్లి మండలంలో రంగాపురం, పెదగొన్నూరు, చిగురుకోట, ప్రొద్దువాక–1, వడాలి–2 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయి. విలీన పాఠశాలల హెచ్‌ఎంలను కూడా హైస్కూళ్లకే బదిలీ చేశారు. 


విద్యార్థుల అప్పగింతలో టీచర్ల ఉద్వేగం

అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు తల్లిదండ్రులు ఎంతటి ఆవేదనకు గురవుతారో అలాంటి పరిస్థితే బుధవారం ముదినేపల్లి మండలం లోని విలీన పాఠశాలల వద్ద ఉపాధ్యాయుల్లో కనిపించాయి.   రంగాపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులను ముదినేపల్లి హైస్కూల్‌కు తీసుకెళ్లేందుకు వచ్చిన హైస్కూల్‌ హెచ్‌ఎం, ఉపాధ్యాయులకు తమ  విద్యార్థుల్ని  అప్పగిస్తూ ఆ పాఠశాల టీచర్‌ బేతాళ రాజేంద్ర ప్రసాద్‌ ఉద్వేగానికి లోనయ్యారు. పెదగొన్నూరు ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం మాధవరావు, టీచరు దుర్గా ప్రసాద్‌ కూడా విద్యార్థులను అదే గ్రామంలోని హైస్కూలుకు పంపే సమయంలో ఉద్వేగానికి లోనయ్యారు.


పాఠశాల ఏర్పాటుకు  ఆదేశాలు

ముదినేపల్లి రూరల్‌: మండలంలోని గురజ దళితవాడలో రద్దు చేసిన ఎయిడెడ్‌ పాఠశాల విద్యార్థులకు అందుబాటులో ఎంపీపీ పాఠశాలను ఏర్పాటు చేయాలని ఎంఈవో నరేష్‌కు జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఎయిడెడ్‌ పాఠశాలను రద్దు చేయటంతో తమ పిల్లల భవిష్యత్‌పై ఆందోళన చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు  కలెక్టర్‌కు   ఫిర్యాదు చేశారు. దీంతో  కలెక్టర్‌ పాఠశాల ఏర్పాటుకు  జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2022-07-07T06:16:59+05:30 IST