మా బడి మాక్కావాలి

ABN , First Publish Date - 2022-07-08T04:24:58+05:30 IST

కిలోమీటరు పరిధిలో ఉన్న పాఠశాలలను.. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థుల, వారి తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొగిలిపాడు, ఉదయపురం, ఎంపీయూపీ పాఠశాలలను విలీనం చేయొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనలతో హోరెత్తించారు. కేటీ రోడ్డుపై మొగిలిపాడు వాసులు బైఠాయించి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో గంటపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఎంఈవో హామీతో తల్లిదండ్రులు ఆందోళన విరమించడం పరిస్థితి చక్కబడింది. అలాగే జి.సిగడాం మండలం ఎందువ ప్రాథమిక పాఠశాల విలీనాన్ని నిరసిస్తూ.. గ్రామస్థులు బడికి తాళం వేశారు. ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు తమ పిల్లలను పాఠశాలకు పంపించేది లేదంటూ స్పష్టం చేశారు. కవిటి మండలం బెజ్జిపుట్టుగ వాసులు, కొత్తూరు మండలంలో కడుము, ఇరపాడు గ్రామస్థులు నిరసన తెలిపారు. సారవకోట మండలం తొగిరిలో కూడా ఆందోళన చేశారు. దూర ప్రాంతాల్లో పాఠశాలలకు తమ పిల్లలు ఎలా రాకపోకలు సాగించగలరని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి పాఠశాలల విలీనం ప్రక్రియ విరమించుకోవాలని కోరారు.

మా బడి మాక్కావాలి
ఉదయపురం పాఠశాల వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

పాఠశాలల విలీనంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నిరసన
మొగిలిపాడులో ఉద్రిక్తతకు దారితీసిన ఆందోళన
గంటపాటు నిలిచిన ట్రాఫిక్‌
ఎంఈవో హామీతో ఆందోళన విరమణ
(పలాస, జూలై 7)

కిలోమీటరు పరిధిలో ఉన్న పాఠశాలలను.. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థుల, వారి తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొగిలిపాడు, ఉదయపురం, ఎంపీయూపీ పాఠశాలలను విలీనం చేయొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనలతో హోరెత్తించారు. కేటీ రోడ్డుపై మొగిలిపాడు వాసులు బైఠాయించి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో గంటపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఎంఈవో హామీతో తల్లిదండ్రులు ఆందోళన విరమించడం పరిస్థితి చక్కబడింది. అలాగే జి.సిగడాం మండలం ఎందువ ప్రాథమిక పాఠశాల విలీనాన్ని నిరసిస్తూ.. గ్రామస్థులు బడికి తాళం వేశారు. ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు తమ పిల్లలను పాఠశాలకు పంపించేది లేదంటూ స్పష్టం చేశారు. కవిటి మండలం బెజ్జిపుట్టుగ వాసులు, కొత్తూరు మండలంలో  కడుము, ఇరపాడు గ్రామస్థులు నిరసన తెలిపారు. సారవకోట మండలం తొగిరిలో కూడా ఆందోళన చేశారు. దూర ప్రాంతాల్లో పాఠశాలలకు తమ పిల్లలు ఎలా రాకపోకలు సాగించగలరని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి పాఠశాలల విలీనం ప్రక్రియ విరమించుకోవాలని కోరారు.
.......................................

పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో పాఠశాలల విలీనం ప్రక్రియకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. గురువారం పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో.. మొగిలిపాడు పాఠశాలను విలీనం చేయొద్దంటూ గ్రామస్థులు, విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ‘హై స్కూల్‌ మాకొద్దు.. మా బడి ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. మొగిలిపాడు ప్రభుత్వ పాఠశాలలో గ్రామస్థులతో పాటు నెమలినారాయణపురం, కోసంగిపురం, అడవికొత్తూరు గ్రామాలకు చెందిన విద్యార్థులు సుమారు 250 మంది చదువుతున్నారు. విలీనం కారణంగా ఇక్కడ విద్యార్థులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి ఉంది. ఈ  నేపథ్యంలో విలీనం వద్దని, తమ పిల్లల భవిష్యత్‌ నాశనం చేయొద్దని ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధుల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు మొర పెట్టుకున్నారు. అయినా విలీనానికే మొగ్గు చూపడంతో వారంతా ఆందోళన బాటపట్టారు. రెండు రోజుల కిందట స్కూల్‌ వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు. ప్రస్తుతం వారి తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే కాశీబుగ్గ-తర్లా రోడ్డులో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. కాశీబుగ్గ సీఐ ఎస్‌.శంకరరావు, ఎస్‌ఐ మధుసూదనరావు తమ సిబ్బందితో చేరుకొని ఆందోళన విరమించాలని కోరినా.. వెనక్కి తగ్గలేదు. రోడ్డుపై ధర్నా చేయడం తగదని, సామాన్యులు ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడుతున్నారని ఎస్‌ఐ వారికి నచ్చజెప్పగా.. ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఎంఈవో శ్రీనివాసరావు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు విలీనం ప్రక్రియ వాయిదా వేస్తున్నామని, త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి.. సమస్యపై చర్చిస్తామన్నారు. ఆందోళన వద్దని సూచించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.

మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం
పాఠశాలను విలీనం చేయవద్దని, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని మంత్రి సీదిరి అప్పలరాజుకి ఇటీవల విజ్ఞప్తి చేశాం. ఆయన మొహం మీద కొట్టినట్టు మాట్లాడారు. మమ్మల్ని గొర్రెల మందగా అభివర్ణించారు’ అని మొగిలిపాడుకి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల విలీనంపై ఆందోళనలో భాగంగా మహిళలు మంత్రి మాటలు గుర్తుకు తెచ్చుకుని మండిపడ్డారు. మా బాధ ఆయనకు అర్థం కాలేదా? మమ్మల్ని గొర్రెలుగా సంబోధిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గొరెల్ర మంద ఓట్లు వేస్తేనే మంత్రి అయ్యారనే విషయాన్ని గుర్తించుకోవాలని స్పష్టం చేశారు. ఓట్లు కోసం మా గ్రామానికి మళ్లీ రాగలరా? అని ప్రశ్నించారు. తమ సమస్య పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  

పది మందిపై కేసు నమోదు
మొగిలిపాడులో నిబంధనలకు విరుద్ధంగా ఆందోళన చేపడుతూ.. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగుజేశారనే ఉద్దేశంతో పోలీసులు పది మందిపై కేసు నమోదు చేశారు. పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న నలుగురు మహిళలు, ఆరుగురు పురుషులపై కేసు నమోదు చేశామని సీఐ ఎస్‌.శంకరరావు, ఎస్‌ఐ మధుసూదనరావులు తెలిపారు.

ఉదయపురం పాఠశాలలో:
ఉదయపురం పాఠశాలలో మొత్తం 280 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 225 మంది 3, 4, 5 తరగతులు చదువుతున్నారు. పలాసలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తమ పాఠశాలను విలీనం చేస్తే ఇబ్బందులు ఎదుర్కొంటామని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేశారు. తరగతి గదులు కూడా అక్కడ లేవని, ఈ పరిస్థితుల్లో విలీనం అవసరమా అని ప్రశ్నించారు. పరిస్థితి చక్కదిద్దకపోతే తమ పిల్లలను పాఠశాల మాన్పించేస్తామని తల్లిదండ్రులు స్పష్టం చేశారు.

పలాస ఎంపీయుపీ పాఠశాలలో..
స్థానిక ఇందిరమ్మ జంక్షన్‌ వద్ద ఉన్న ఎంపీయూపీ  పాఠశాలలో మొత్తం 200 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాలను.. పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విలీనం పేరుతో ఎత్తివేయడానికి అధికారులు సిద్ధమయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు విద్యార్థులతో కలసి కంబిరిగాం రోడ్డులో ధర్నాకు దిగారు. పాఠశాల విలీనం ప్రక్రియ నిలుపుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎందువ పాఠశాలకు తాళం
జి.సిగడాం : జి.సిగడాం మండలం ఎందువ ప్రాథమిక పాఠశాల విలీనాన్ని నిరసిస్తూ.. గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. విలీనం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమ పిల్లలను బడికి పంపేది లేదంటూ.. పాఠశాలకు తాళం వేశారు. ఈ పాఠశాలలో 62 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 42 మంది విద్యార్థులు 3, 4, 5 తరగతులు చదువుతున్నారు. పాఠశాల విలీనం పేరుతో ఇక్కడ ఉన్న ముగ్గురు ఉపాధ్యాయుల్లో ఇద్దరిని ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారు. ప్రస్తుతం ఏకోపాధ్యాయ పాఠశాలగా మిగిలింది. దీంతో గురువారం సర్పంచ్‌ అల్లు జోగినాయుడు, గ్రామపెద్దలు గొలివి శ్రీనివాసరావు, జి.రాములు ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. కిలోమీటరు దూరంలో.. కొండపై ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తమ పాఠశాలను ఎలా విలీనం చేస్తారంటూ  ప్రశ్నించారు. రహదారిపై బైఠాయించి.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతదూరం తమ పిల్లలు రాకపోకలు సాగించలేరని.. రోడ్డుపై ప్రమాదాలకు గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో పాఠశాలకు తాళం వేశారు. విలీన ప్రక్రియ విరమించుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

బెజ్జిపుట్టుగలో నిరసన
కవిటి : కవిటి మండలం బెజ్జిపుట్టుగ ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతులను జగతి పాఠశాలలో విలీనం చేయడంపై బెజ్జిపుట్టుగ గ్రామపెద్దలు గురువారం నిరసన తెలిపారు. విలీనం చెయొద్దంటూ ఉపాధ్యాయుని శశికళకు వినతిపత్రం అందజేశారు. రామయ్యపుట్టుగలోని ఎమ్మెల్యే  బెందాళం అశోక్‌ను కూడా కలిశారు. పాఠశాల విలీనం నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం  అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్‌ బి.జగన్‌, ఎస్‌.లక్ష్మణ్‌, బి.అప్పలరాజు, బి.మోహనరావు, ఎల్‌.రాఘవులు,బిసాయి తేజ పాల్గొన్నారు.
 
 రాకపోకలు ఎలా..
కొత్తూరు: నూతన విద్యా విధానంలో మార్పులు, పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ కడుము, ఇరపాడు (మెట్టూరు బిట్‌ 3) గ్రామస్థులు ఆందోళన చేశారు. ఈ రెండు పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను మెట్టూరు ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. రానుపోను నాలుగైదు కిలోమీటర్లు తమ పిల్లలు ఎలా రాకపోకలు సాగించగలరని ప్రశ్నించారు. విలీనాన్ని విరమించుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ ఎంపీటీసీ వలురౌతు గోవిందరావు, సర్పంచ్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

తొగిరిలో..  
సారవకోట(జలుమూరు) : సారవకోట మండలం తొగిరి ప్రాథమిక పాఠశాలను కిన్నెరవాడ ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం అన్యాయమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాల కమిటీ చైర్మన్‌ మట్ట ఎర్రయ్య ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. కిన్నెరవాడ పాఠశాలకు రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉందని.. ఈ క్రమంలో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. విలీన ప్రక్రియను నిలుపుదల  చేయాలని ఎంఈవో ఎం.వి.రమణకు వినతిపత్రం అందజేశారు. అలాగే బుడితి, అవలింగి ప్రాథమిక పాఠశాలలను బుడితి ఉన్నతపాఠశాలలో విలీనం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. విలీనం ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-07-08T04:24:58+05:30 IST