Ukraine నుంచి భాగ్యనగరానికి.. అక్కడ పరిస్థితేంటో ఓ లుక్కేయండి..!

ABN , First Publish Date - 2022-03-05T15:15:16+05:30 IST

రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధ నేపథ్యంలో

Ukraine నుంచి భాగ్యనగరానికి.. అక్కడ పరిస్థితేంటో ఓ లుక్కేయండి..!

హైదరాబాద్ సిటీ : రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధ నేపథ్యంలో తెలంగాణకు చెందిన పలువురు వైద్య విద్యార్థులు  క్షేమంగా నగరానికి చేరుతున్నారు. భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా వారిని ఇండియాకు తరలిస్తోంది. శుక్రవారం నగరానికి చెందిన నలుగురు విద్యార్థులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగడంతో వారి కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన వారిని తీసుకురావాలని కోరారు.


బిక్కుబిక్కుమంటూ బోర్డర్‌ దాటాం..

రాజేంద్రనగర్‌: భీకర యుద్ధ వాతావరణంలో రెండు రోజులపాట చలిలో గడిపాం. బెడ్‌షీట్లు కప్పుకున్నా మంచు ధాటికి వణికిపోతూ బయటే పడుకున్నాం. బిక్కుబిక్కుమంటూ బార్డర్‌ దాటాం. ఫిబ్రవరి 26న పులియా స్ట్రీట్‌-15కు చేరుకుని, మరికొందరు విద్యార్థులతో అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులో ఉక్రెయిన్‌ బార్డర్‌కు 15 కిలోమీటర్ల దూరంలో దిగాము. అక్కడి నుంచి నడుచుకుంటూ బార్డర్‌దాటి రొమేనియాకు చేరుకున్నాం.  ఒకటిన్నర రోజులు ఉండగా రొమేనియా అధికారులు మమ్మల్ని  బాగా చూసుకున్నారు. వారి మేలు మరిచిపోలేము. నాలాగే ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారందరినీ కూడా క్షేమంగా భారత్‌కు తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. - ఎం.భావన సాయిక్రిష్ణకాలనీ, బుద్వేల్‌


కాలి నడకన ఏడు కిలో మీటర్లు

హయత్‌నగర్‌ : భీకర యుద్ధంలో తాము నివాసం ఉంటున్న వినిత్స యూనివర్సిటీ హాస్టల్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోని షాపింగ్‌ మాల్‌లో బాంబుపడింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాం. ఉక్రెయిన్‌ నుంచి రొమేనియాలోకి ప్రవేశించేందుకు 7 కిలో మీటర్లు కాలి నడకన వెళ్లా. బార్డర్‌ను దాటేందుకు చాలా ఇబ్బందులు పడ్డాం. సరిహద్దు వద్ద ఉక్రెయిన్‌ సైనికులు తమను రొమేనియాలోకి వెళ్లకుండా అడ్డుతగిలారు. అయినా తప్పించుకుని చేరుకున్నాం. అక్కడ స్వచ్ఛంద సంస్థలు తమకు ఆశ్రయం కల్పించాయి. ఎయిర్‌పోర్టు సమీపంలో రెండు రోజులు గడిపి మార్చ్‌ 3న ఫ్లైట్‌ ఎక్కి 4న ఢిల్లీకి, అటునుంచి నగరానికి చేరా. - గూడురు మురళీరెడ్డి, బృందావన్‌కాలనీ, హయత్‌నగర్‌.


18 గంటలపాటు మంచులో వణికిపోయాం..

చాంద్రాయణగుట్ట : బంకర్లలోనే తలదాచుకునేవారం. ఇండియన్‌ ఎంబసీ సూచన మేరకు ఫిబ్రవరి 28వ తేదీన వినెత్స నుంచి ప్రైవేట్‌ బస్సులో భారత జెండా ధరించి 26మంది విద్యార్థులతో చెర్నివిక్సీకి చేరుకున్నాం. అక్కడి నుంచి రవాణాసదుపాయం లేకపోవడంతో ఎనిమిది కిలోమీటర్లు కాలినడకన రొమేనియా సరిహద్దుకు చేరుకున్నాం. అక్కడ సుమారు 1600 మంది విద్యార్థులం 18 గంటలపాటు మంచులో వణుకుతూ ఉండిపోయాం. ఈనెల 3వ తేదీన భారత ప్రభుత్వం సమకూర్చిన విమానంలో రాత్రి 10-30 గంటలకు ఢిల్లీ చేరుకుని, అక్కడి నుంచి శంషాబాద్‌ చేరుకున్నా. కేవలం పండ్లు, చాక్లెట్లు మాత్రమే తింటూ గడిపా. - రాహుల్‌ గుప్తా, పాతబస్తీ, హైదరాబాద్‌


భయానక పరిస్థితుల నుంచి బయటపడ్డాం..

నిజాంపేట్‌ : యుద్ధ వాతావరణంలోని భయానక పరిస్థితులనుంచి బయటపడ్డాం. అప్పటి వరకు బిగపెట్టిన ఊపిరి స్వదేశంలో అడుగు పెట్టాక పీల్చుకున్నాం. - డింపు, ప్రగతినగర్‌.

Updated Date - 2022-03-05T15:15:16+05:30 IST