‘బడి’.. బేజారు!

ABN , First Publish Date - 2022-07-15T08:42:58+05:30 IST

పాఠశాలల విలీనంతో విద్యార్థులను సుదూర ప్రాంతాలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు.

‘బడి’.. బేజారు!

ప్రభుత్వ పాఠశాలలు మానేస్తున్న విద్యార్థులు

విలీనంతో పెరిగిన దూరం

దీంతో ప్రైవేటు స్కూళ్ల బాట

అంతంత దూరం పంపలేక

తల్లిదండ్రుల సంచలన నిర్ణయం

టీసీల కోసం భారీగా దరఖాస్తులు

ప్రైవేటుకు వరంగా మారిన విలీనం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పాఠశాలల విలీనంతో విద్యార్థులను సుదూర ప్రాంతాలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. దీంతో సమీపంలోని ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లను మానేసినట్టు తెలుస్తోంది. గత ఏడాది వరకు బడులు తెరిచిన మొదటి రెండు మూడు రోజుల్లోనే విద్యార్థుల కొత్త చేరికలు, తర్వాత తరగతికి ప్రమోషన్లు దాదాపుగా జరిగిపోయేవి. ఇప్పుడు బడులు తెరిచి వారం దాటినా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అనుకున్నస్థాయిలో కనిపించడం లేదు. మొ త్తం ఈ ఏడాది 47 లక్షలమందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటారని అంచనా వేశారు. అయితే, ఇప్పటి వరకు 36 లక్షల మంది మాత్రమే ఎన్‌రోల్‌ అయ్యారు. ఒకటో తరగతి, ఆరో తరగతి విద్యార్థుల చేరికలు కొంత ఆలస్యం అవుతాయి. ఈ రెండు తరగతుల్లో ఇప్పటికి మూడు లక్షలమంది బడుల్లో చేరారు. ఇంకా మిగిలిన చేరికలు గరిష్ఠంగా నాలుగైదు లక్షలు ఉండొచ్చు. వారు కూడా వస్తారన్న గ్యారెంటీ లేదు. మిగిలిన తరగతుల్లో చాలా వరకు ఎన్‌రోల్‌మెంట్‌ జరిగిపోగా, ఇంకా కొంత పెరగాల్సి ఉంది. అన్నీ కలిపినా ఈ ఏడాది ఐదు నుంచి పది శాతం మంది ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ప్రధానంగా పాఠశాలల విలీనం కారణంగా ఉన్నట్టు తెలుస్తోంది.


దీనికితోడు.. తమ చిన్నారులను అసలు ఏ పాఠశాలలో చేర్పించాలి? ఎవరు పాఠాలు చెబుతారో? పిల్లల్ని ఎంత దూరం పంపించాలో? అని తల్లిదండ్రులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో అమ్మఒడి కింద అందిన నగదుతో తమ పిల్లలను సమీపంలోని ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారని తెలుస్తోంది. చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలల ఫీజులు తక్కువగా ఉండడంతో అక్కడే చేర్పిస్తున్నారు. ఉచితమే అయినా.. సుదూర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. మరోవైపు ఈ పరిణామంపై సర్కారు పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. గత ఏడాది ‘అమ్మ ఒడి’ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠ పెంచామని ప్రచారం చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు అమ్మ ఒడి ఇచ్చినా.. ప్రభుత్వ స్కూళ్లలో చేరకపోగా, ప్రైవేటును ఆశ్రయించడంపై డోలాయమానంలో పడ్డారు. దీనికి విలీనమే కారణమని తెలిసినా.. ఈ విషయంపై మాత్రం మౌనం వహిస్తున్నారు.  


ఇప్పుడేవీ ఆ ప్రకటనలు?

గతేడాది బడులు తెరిచిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిపోయిందంటూ ప్రభుత్వం వరుసగా ప్రకటనలు జారీచేసింది. ప్రతిరోజూ ఎంత మంది కొత్తగా చేరారనే వివరాలను విడుదల చేసింది. ఈ ఏడాది ఉన్నవారే వెళ్లిపోతుండటంతో ఆ ప్రకటనలు కనిపించడం లేదు. ఇప్పుడు ప్రకటనలు జారీచేస్తే అందులో ఎంత మంది విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోయారనే విషయాలు వెలుగులోకి వస్తాయి. అందువల్ల ఆ విషయాలు బయటపడకుండా పాఠశాల విద్యాశాఖ చేరికల గురించి ఇంత వరకు పెదవి విప్పకపోవడం గమనార్హం.


అటు నుంచి అటే

విలీనం ప్రక్రియ లేకపోయుంటే పరిస్థితి మరోలా ఉండేదేమోగానీ, విలీనం ప్రారంభం కావడంతోనే పిల్లలు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రాథమిక పాఠశాలల్లో రెండు, మూడు, నాలుగు తరగతులు చదివిన విద్యార్థులను అదే పాఠశాలల్లో తర్వాతి తరగతులకు ప్రమోట్‌ చేస్తారు. ఎవరైనా ప్రత్యేక పరిస్థితి ఎదురైతే తప్ప ఇతర బడులకు వెళ్లరు.


కానీ, ఈ ఏడాది విలీనం పేరుతో 3, 4, 5 తరగతుల విద్యార్థులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలకు పంపుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులను ఉపాధ్యాయులే తీసుకెళ్లి మ్యాపింగ్‌ చేసిన పాఠశాలలకు అప్పగిస్తున్నారు. ఈ ప్రక్రి య జరిగే సమయంలో కొందరు తల్లిదండ్రులు టీసీలు ఇస్తే తామే చేర్పించుకుంటామని కోరుతున్నారు. వారికి టీసీలు ఇవ్వగానే ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోతున్నారు. ప్రకాశం జిల్లాలో ఓ పాఠశాలలో 132 మంది విద్యార్థుల్లో ఇలా 28 మంది టీసీలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలో టీసీల పుస్తకం అయిపోయిందని ఓ ఉపాధ్యాయుడు తెలిపారు.  


ఆలస్యమూ ఓ కారణమే

ప్రభుత్వ పాఠశాలలను ఆరు రకాలుగా విభజించాలని ప్రభుత్వం ముందే నిర్ణయం తీసుకుంది. బడులు తెరవకముందే దీనిపై ఉత్తర్వులు జారీచేసింది. కానీ, అమలు విషయంలో పాఠశాల విద్యాశాఖ తీవ్ర జాప్యం చేసింది. రేపు బడులు తెరుస్తారనగా ముందురోజు రాత్రి విలీనం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అప్పటి వరకు ఉపాధ్యాయులెవరికీ విలీనం ఉంటుందా? లేదా? అనే స్పష్టత లేదు. అప్పటికప్పుడు వచ్చిన ఉత్తర్వులను అమలుచేయడం కష్టంగా మారింది. లేదంటే ముందుగానే తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించే అవకాశం ఉండేదని ఉపాధ్యాయులు అంటున్నారు. హడావుడిగా ఇచ్చిన ఉత్తర్వులు ఈ గందరగోళం నెలకొనడానికి కారణమయ్యాయనే వాదన వినిపిస్తోంది.


ప్రైవేటు వరంగా విలీనం

ప్రభుత్వ పాఠశాలల విలీన ప్రక్రియ ప్రైవేటు విద్యాసంస్థలకు కాసులు కురిపిస్తోంది. ఈ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వం అయినా, ప్రైవేటు అయినా ఏటా 5 నుంచి 10 శాతం వృద్ధి ఉంటుంది. కానీ, ఈ సంవత్సరం ప్రైవేటులో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. కరోనా సమయంలో ప్రైవేటు నుంచి ప్రభు త్వ బడులకు వచ్చినవారు తిరిగి అక్కడికే వెళ్లిపోతున్నారు. 

Updated Date - 2022-07-15T08:42:58+05:30 IST