రోజుకొకరు.. ఆస్పత్రిపాలు

ABN , First Publish Date - 2022-09-25T06:35:46+05:30 IST

జగనన్న వసతి దీవెనతో విద్యార్థులందరికీ నాణ్యమైన పౌష్టికాహారం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి వారానికి రెండు రోజులు మాంసాహారం, ప్రతిరోజూ గుడ్డు, రాగి జావ, కూరగాయలతో నాణ్యమైన భోజనం ఇదీ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాట.

రోజుకొకరు.. ఆస్పత్రిపాలు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని

నూజివీడు ఎస్సీ బాలికల హాస్టల్‌లో  ఇదీ తీరు

నాణ్యమైన భోజనం.. ఆమడ దూరం..

గతిలేక తింటూ ఆస్పత్రిపాలవుతున్నామన్న విద్యార్థినులు


జగనన్న వసతి దీవెనతో విద్యార్థులందరికీ నాణ్యమైన పౌష్టికాహారం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి వారానికి రెండు రోజులు మాంసాహారం, ప్రతిరోజూ గుడ్డు, రాగి జావ, కూరగాయలతో నాణ్యమైన భోజనం ఇదీ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాట.  కోట్లాది రూపాయలతో చేస్తున్న ప్రచారం.  అయితే క్షేత్రస్థాయిలో విద్యార్థులకు మాత్రం అది  అందడం లేదనేది సాంఘిక  సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థినుల ఆవేదన. ఈ నేపఽథ్యంలో చాలీచాలనీ ఆహారం సరిపెట్టేందుకు ఇస్తున్న ఘాటైన ఆహార పదార్థాలతో గ్యాస్‌ బారినపడిన విద్యార్థినులు కళాశాలలకు వెళ్ళి తరగతి గదుల్లో కళ్ళు తిరిగి పడిపోవడంతో రోజుకొకరు చొప్పున ఆసుపత్రుల్లో చేరుతున్న వైనం నూజివీడు ఎస్సీ కళాశాల బాలికల హాస్టల్లో చోటుచేసుకుంటోంది. 


(నూజివీడు/నూజివీడు టౌన్‌) 

 నూజివీడు మడుపల్లి తాతయ్య జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో ఎస్సీ బాలికల హాస్టల్‌ను ఐదేళ్లుగా నడుపుతున్నారు. ఇందులో ఇంటర్‌ నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థినులు దాదాపు 250 మంది వసతి పొందు తుండగా, తాగునీటి నుంచి ఆహార పదార్థాల వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని విద్యార్థినులు వాపోతున్నారు. 2018లో నూజివీడు  ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, విద్యార్థుల శ్రేయస్సు ముఖ్యమని, వారికి పౌష్టికాహారం అందించడంతో పాటు భద్రత అంశాలను పటిష్ఠం చేయాలని పేర్కొంటూ, మెస్‌ ఛార్జీలను కూడా నాటి ప్రభుత్వం వెంటనే పెం చాలని డిమాండ్‌ చేశారు. అయితే 2019లో ప్రభుత్వం మారి, వైసీపీ అధికారం లోకి వచ్చిన తరువాత కూడా విద్యార్థుల వసతి పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందాన ఉంది. మాటలు కోటలు దాటి ప్రచారార్భాటమే తప్ప  సౌకర్యాలను అందించటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనటానికి సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహానికి చెందిన విద్యార్థులు రోజుకొక్కరిగా కళ్ళుతిరిగి పడిపోతూ ఆసుపత్రి పాలవ్వడమే నిదర్శనం.


మెయింటినెన్స్‌ చార్జీలు రూపాయి కూడా మంజూరు కాలేదు


వసతిగృహాన్ని నడిపేందుకు అవసరమైన మెయింటినెన్స్‌ ఛార్జీలు నేటికి ఒక్క రూపాయి మంజూరు కాలేదు. కళాశాలలు ప్రారంభమైన జూలై   నుంచి నేటివరకు వసతి గృహంలో మరమ్మతులు తదితరాలకు దాదాపు రూ.90 వేలు సొంత డబ్బులను ఖర్చు చేయాల్సి వచ్చింది. వీటితో పాటు వసతి గృహంలో 250 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరికి ప్రతి రోజూ భోజన అవసరాలు తీర్చేందుకు ప్రతినెలా లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. 2018 నుంచి ఒక్కో విద్యార్థినికి రూ.45 చొప్పున మెస్‌ మెయింటినెన్స్‌ ప్రభుత్వం మంజూరు చేస్తోందని హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ నాగమణి తెలిపారు. నాటి నిత్యావసర సరుకుల ధరలు నేటితో పోల్చితే దాదాపు రెట్టింపు అయ్యాయి.  కూరగాయలు రూ.30లు పై మాటే. దీంతో మెస్‌ఛార్జీలు పెంచాల్సిందిగా ఉన్నతాధికారులకు అనేకసార్లు విజ్ఞప్తి చేశాం.


సర్దుకోలేరా అని నోరు మూయిస్తున్నారు.. 


హాస్టల్లో ఆహారం బాగాలేదని, ఉడికీ ఉడకని కూరలు, రుచీ పచీలేని పచ్చళ్ళతో ఆహారం  తినలేకపోతున్నామని హాస్టల్‌ నిర్వాహకులకు, కుక్‌లకు తెలిపినా సర్దుకోలేరా? అంటూ మా నోరు మూయిస్తున్నారని హాస్టల్లోని విద్యార్థులు, విలేఖర్లకు తెలిపారు. ఉడికీ ఉడకని కూరలు, రోజూ కోడిగుడ్డు అందించవలసి ఉండగా, ఎప్పుడో ఒకసారి ఇస్తున్నారని, అదీ ఉడికీ ఉడకకుండా ఇస్తున్నారని తెలిపారు. దీంతో వీటిని గతిలేక తింటున్న తాము అస్వస్థతకు గురై తరగతి గదుల్లో కళ్ళుతిరిగి పడిపోతున్నామని అనేకమంది విద్యార్థినులు తెలిపారు. పాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని తెలిపారు. అనారోగ్యానికి గురైన విషయాన్ని మేడమ్‌లకు చెప్పినా తగ్గిపోతుందిలే అని సముదాయిస్తున్నారే తప్ప ఆసుపత్రికి తీసుకువెళ్ళలేదని, తాము కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మాత్రమే కళాశాల సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తున్నారని విద్యార్థినిలు వాపోయారు. కాగా  వసతి గృహంలో పారిశుధ్యం అధ్వానంగా ఉంటోందని, చుట్టూ గడ్డిపెరిగి దోమలు విజృంభిస్తున్నాయని, ఫలితంగా  జ్వరాల బారిన పడుతున్నారని విద్యార్థినిలు వాపోతున్నారు. కొన్ని సందర్భాల్లో  పాములు కూడా కళాశాలలోకి ప్రవేశిస్తున్నాయంటూ  భయాందోళనలు వ్యక్తం చేశారు. 



Updated Date - 2022-09-25T06:35:46+05:30 IST