ఆటా లేదు.. పాటా లేదు

Sep 26 2021 @ 12:21PM

పీఈటీలు లేక పిల్లలు ఆటలకు దూరం

ఏటా పెరుగుతున్న ఖాళీలు 

182 హైస్కూళ్లలో 123 మంది మాత్రమే..


హైదరాబాద్‌ సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆటపాటలు కరువయ్యాయి. పిల్లలకు విద్యతోపాటు శారీరక, మానసికోల్లాసానికి దోహదపడే క్రీడలు అవసరం. కానీ, జిల్లాలోని సర్కారు బడుల్లో కొంతకాలంగా పీఈటీల కొరత వెక్కిరిస్తోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పీఈటీలు లేకపోవడంతో క్రీడా మైదానాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో మొత్తం 682 ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్‌ పాఠశాలలు నడుస్తున్నాయి. ఇందులో 182 ఉన్నత పాఠశాలున్నాయి. 2021-22 లెక్కల ప్రకారం ఆయా బడుల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 99,530 మంది చదువుతున్నారు. 


350 మందికి ఒక పీఈటీ..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం 6 నుంచి 10వ తరగతి వరకు కొనసాగుతున్న జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ప్రతి 350 మంది విద్యార్థులకు ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు ఉండాలి. ఒక్కో తరగతికి రోజూ ఒక పీరియడ్‌ ఆటలు నేర్పించాల్సి ఉంటుంది. ఆయా క్రీడలపై విద్యార్థులకు ఉన్న ఆసక్తిని పీఈటీలు గమనించి, వారికి తగిన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో వారు క్రీడల్లో రాణించే అవకాశం ఉంది. చాలా పాఠశాలల్లో విద్యార్థులు ఆటలపై ఆసక్తి చూపుతున్నా... వారిని తీర్చిదిద్దే వారు లేక అసంతృప్తికి లోనవుతున్నారు. 


వెక్కిరిస్తోన్న ఖాళీలు..

జిల్లాలోని 182 హైస్కూళ్లలో ప్రస్తుతం 120 మంది ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌(పీఈటీ)లకు గాను 82 మంది, 64 మంది ఫిజికల్‌ డైరెక్టర్ల(పీడీ)లకు 41 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 2016, 2017 తర్వాత వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఖాళీల సంఖ్య పెరిగిపోతోంది. ఏటా జిల్లాలో నలుగురి నుంచి ఎనిమిది మంది వరకు ఉద్యోగ విరమణ చేయడంతో కొరత స్పష్టంగా కనిపిస్తోంది. 


నిధులూ కరువే.. 

పాఠశాలలకు క్రీడా నిధులూ మంజూరు కావ డం లేదు. గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సం దర్భంగా ఆటల పోటీలు నిర్వహిద్దామన్నా క్రీడా సామగ్రి కొనుగోలు చేయలేకపోతున్నామని అంబర్‌పేట నియోజకవర్గంలోని ఓ పీఈటీ తెలిపారు. 


ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు. అలాగే అర్హులకు ఫిజికల్‌ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని, ఏటా ప్రతి పాఠశాలకు రూ.50వేల స్పోర్ట్స్‌ బడ్జెట్‌ కేటాయించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

Follow Us on: