విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి

ABN , First Publish Date - 2022-05-21T05:43:56+05:30 IST

విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి

విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి
విద్యార్థులకు స్టడీ మెటిరియల్‌ అందజేస్తున్న జిల్లా కలెక్టర్‌ నిఖిల

  • వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నిఖిల

వికారాబాద్‌, మే 19 :  విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రణాళికబద్ధంగా చదివితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారని వికారాబాద్‌ కలెక్టర్‌ నిఖిల అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్‌ఏపీ కళాశాలలో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతీయువకులకు గ్రూప్‌ ఉద్యోగాల కొరకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని కలెక్టర్‌ సందర్శించి స్టడీ మెటీరియల్‌ అందజేశారు. శిక్షణలో భాగంగా ఐదు సబ్జెక్టులకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌తో పాటు సిలబస్‌ను అర్ధం చేసుకొని ప్రణాళిక బద్దంగా చదివి పరీక్షలు రాయాలని ఆమె విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ మందారిక, సాంఘిక సంక్షేమశాఖ అధికారి మల్లేశం, గిరిజన సంక్షేమశాఖ అధికారి కోటాజీ, సీనియర్‌ లెక్చరర్‌ సోమన్న, సహాయ సాంఘిక సంక్షేమశాఖ అధికారి ఉమాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

  • హరితహారం మొక్కలు తొలగిస్తే రూ.500 జరిమానా 

హరితహారంలో భాగంగా రోడ్లకిరువైపులా నాటిన మొక్కలను దుకాణదారులు పార్కింగ్‌ కోసం తొలగిస్తే రూ.500లు జరిమానా విధించాలని, తిరిగి అదే స్థానంలో వారితోనే మొక్కలు నాటించి సంరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ నిఖిల మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు కలెక్టర్‌ కార్యాలయంలో నర్సరీల నిర్వహణ, హరితహారం, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాలు, మునిసిపల్‌ ట్యాక్స్‌ కలెక్షన్లు తదితర అంశాలపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈసారి పట్టణ ప్రగతి కార్యక్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలని, మునిసిపల్‌ పరిధిలోని నర్సరీల నిర్వహణ కాంట్రాక్టర్లకు అప్పజెప్పాలని సూచించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు వెంటనే గుంతలు తవ్వే పనులను ప్రారంభించాలని సూచించారు. ఈసారి అధిక మొత్తంలో అవెన్యూ ప్లాంటేషన్‌ నిర్వహించాలన్నారు. తాండూరు పట్టణంలో పెద్దఎత్తున అవెన్యూ ప్లాంటేషన్‌ నిర్వహించి పచ్చదనం పెంచాలని సూచించారు. 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ను పూర్తిగా వినియోగించుకొని పట్టణాలు, పార్కులు పచ్చగా కనబడేలా చేయాలన్నారు. వికారాబాద్‌కు అవసరమైన పెద్ద సైజు మొక్కలు ఫారెస్ట్‌ శాఖ నుంచి సేకరించుకోవాలని, పరమపద వాహనాలు జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో వారం రోజుల్లో అందుబాటులో ఉంచాలనిసూచించారు. మునిసిపల్‌ పరిధిలో తదితర పనులను సెప్టెంబర్‌ మాసాంతం వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. టీయస్‌బీపాస్‌ ద్వారా వచ్చే దరఖాస్తులను ఒక్కరోజు కూడా పెండింగ్‌ ఉండకుండా లాగిన్‌లో ఉన్న ప్రతీ దరఖాస్తును వెంటనే క్లియర్‌ చేయాలన్నారు. పై అంశాలపై ప్రతి వారం సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మునిసిపల్‌ కమిషనర్లు, ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T05:43:56+05:30 IST