సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

ABN , First Publish Date - 2022-06-29T21:06:10+05:30 IST

ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రంలోని ఎస్సీ, బీసీ గురుకులాల విద్యార్థులు ముందంజలో నిలిచారు. సాంఘిక సంక్షేమ (ఎస్సీ) గురుకుల జూనియర్‌ కళాశాలలకు చెందిన 11,456 మంది విద్యార్థులు సెకండియర్‌ పరీక్షలు రాయగా.. 10,680 మంది ఉత్తీర్ణులయ్యారు

సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రంలోని ఎస్సీ, బీసీ గురుకులాల విద్యార్థులు ముందంజలో నిలిచారు. సాంఘిక సంక్షేమ (ఎస్సీ) గురుకుల జూనియర్‌ కళాశాలలకు చెందిన 11,456 మంది విద్యార్థులు సెకండియర్‌ పరీక్షలు రాయగా.. 10,680 మంది ఉత్తీర్ణులయ్యారు. 41  కళాశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎస్సీల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎస్సీ గురుకులాల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సెకండియర్‌లో 93.23 శాతం ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. అలాగే... మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు ఇంటర్‌లో మంచి ప్రతిభ కనబరిచారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు తెలిపారు. ఫస్టియర్‌లో 86.14 శాతం,  సెకండియర్‌లో 93.84 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అలాగే... గిరిజన గురుకులాలకు చెందిన విద్యార్థులు ఇంటర్‌ ఫలితాల్లో అద్భుత ప్రతిభను కనబరిచారని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను మంత్రి అభినందించారు. అదేవిధంగా ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ ఏడాది ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించారని మంత్రి చెప్పారు. 


ఎస్సార్‌ జయకేతనం

వరంగల్‌ సిటీ:: ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో హనుమకొండలోని ఎస్సార్‌ జయకేతనం ఎగరేసింది. మంగళవారం విడుదలైన ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించారని ఎస్సార్‌ విద్యాసంస్థల చైర్మన్‌ ఎ.వరదారెడ్డి తెలిపారు. సెకండ్‌ ఇయర్‌ బైపీసీ విభాగంలో ఎం.కిరుబా ఇంగ్రిడ్‌ 992 మార్కులు సాధించగా, జి.సాయిప్రియ 990, మలిహా ముస్కాన్‌ 990 మార్కులు సాధించారన్నారు. ఎంపీసీలో యు.రచితసాయి 991 మార్కులు సాధించగా.. ఎం.చంద్రిక, వి.భావన, జి.మురళి, జి.రుత్విక్‌, డి.పూజితరెడ్డి 991 మార్కులు సాధించారన్నారు. ఎంఈసీలో 983, సీఈసీలో 979 మార్కులు సాధించారని చెప్పారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 36 మందికి 467 మార్కులు, 156 మందికి పైగా 466 మార్కులు, 570 మందికి పైగా 465 మార్కులు సాధించారని తెలిపారు. బైపీసీలో 9 మందికి 437 మార్కులు, 76 మందికిపైగా 436 మార్కులు, 380 మందికిపైగా 435 మార్కులు సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డితో కలిసి ఆయన అభినందించారు.  



Updated Date - 2022-06-29T21:06:10+05:30 IST