ఆచార్యా..ఇదేమన్యాయం?

ABN , First Publish Date - 2022-06-17T06:12:25+05:30 IST

ఎస్వీయూలో ప్రత్యేక బ్యాచ్‌(బీటీహెచ్‌)లో ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు.. నాలుగేళ్ల కోర్సులో భాగంగా ఓ ఏడాది స్వీడన్‌ వర్సిటీలో చదివి..బీటెక్‌ డిగ్రీతో పాటు స్వీడన్‌ వర్సిటీ ఇచ్చే బీఎస్‌ డిగ్రీని కూడా పొందాలని కలలు కన్నారు.

ఆచార్యా..ఇదేమన్యాయం?

స్వీడన్‌లో చదవకపోయినా అంత డబ్బూ కట్టాల్సిందేనా!

మొదటి బ్యాచ్‌కు మినహాయింపు ఇచ్చి రెండవ బ్యాచ్‌కు ఇవ్వరా

ఎస్వీయూలో బీటీహెచ్‌ బ్యాచ్‌ విద్యార్థుల మనోవేదన


తిరుపతి(విద్య),జూన్‌ 16: ఎస్వీయూలో ప్రత్యేక బ్యాచ్‌(బీటీహెచ్‌)లో ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు.. నాలుగేళ్ల కోర్సులో భాగంగా ఓ ఏడాది స్వీడన్‌ వర్సిటీలో చదివి..బీటెక్‌ డిగ్రీతో పాటు స్వీడన్‌ వర్సిటీ ఇచ్చే బీఎస్‌ డిగ్రీని కూడా పొందాలని కలలు కన్నారు.చివరకు కరోనా కారణంగా స్వీడన్‌ వెళ్లలేకపోయారు.అయితే అక్కడకు వెళ్లి చదివితే ఎంత ఖర్చవుతుందో అంత నగదు చెల్లించాలని ఎస్వీయూ అధికారులు  సర్క్యులర్‌ జారీ చేయడంతో హతాశులవుతున్నారు. 

ఎస్వీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో 2017లో బీటీహెచ్‌(బ్లెకింగ్‌ టెక్నిస్కా హెగ్స్కోలా)బ్యాచ్‌ పేరుతో ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్‌ విభాగాల్లో 10మంది  చొప్పున విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. జేఈఈ, ఏపీ ఎంసెట్‌లో క్వాలిఫై కావడంతోపాటు ఇంటర్‌లో 70శాతం మార్కులు సాధించిన వారికి స్ర్కూట్నీ చేసి ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించారు.మూడు సంవత్సరాలు వర్సిటీలో.. చివరి సంవత్సరం స్వీడన్‌ వర్సిటీలో చదివేలా ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు ఎస్వీయూలో బీటెక్‌ డిగ్రీని, స్వీడన్‌లో ఏడాది చదివినందుకు ఆ వర్సిటీ బీఎస్‌ డిగ్రీని ఇచ్చేవిధంగా ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ బ్యాచ్‌లో చేరిన విద్యార్థులు ఎస్వీయూలో ఏడాదికి రూ.లక్షా 59వేల ఫీజును వర్సిటీకి చెల్లించాలి.అప్పటికే హైదరాబాద్‌ కేంద్రంగా ఉస్మానియా వర్సిటీలో ఈ కోర్సును ఆఫర్‌ చేస్తుండగా..తిరుపతిలోని ఎస్వీయూ, మహిళా వర్సిటీల్లో 2017లో ప్రవేశపెట్టారు. ఎస్వీయూలో మొదటి బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు చివరి ఏడాది 2020-2021లో స్వీడన్‌ వర్సిటీలో చదివి బీఎస్‌ డిగ్రీని పొందాల్సిఉంది. కాగా కొవిడ్‌ కారణంగా ఆ బ్యాచ్‌ విద్యార్థులకు స్వీడన్‌ వర్సిటీ అనుమతితో మినహాయింపు ఇచ్చి..ఎస్వీయూలోనే నాల్గవ సంవత్సరం పూర్తి చేసే అవకాశం కల్పించారు.ఈ క్రమంలోనే రెండో బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు 2021-2022లో స్వీడన్‌ వెళ్లాల్సివుంది. కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ కారణంగా ఇక్కడే చదువుకునే అవకాశం కల్పించాలని విద్యార్థులు వర్సిటీ అధికారులకు విన్నవించుకున్నారు. అయితే వర్సిటీ అధికారులు కుదరదనడంతో విద్యార్థులు హైకోర్టులో రిట్‌ వేశారు.విద్యార్థులను బలవంతం చేయొద్దని..వారికి ఆపన్లు ఇవ్వాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.దీంతో ఏడో సెమిస్టర్‌కు సజావుగా విద్యార్థులను అనుమతించిన అధికారులు..ఎనిమిదవ సెమిస్టర్‌లో మెలిక పెట్టారు. స్వీడన్‌కు వెళ్లి చదువుకుంటే ఎంత ఖర్చవుతుందో అంత మొత్తం వర్సిటీకి చెల్లించాలని నిర్ణయించారు.నాలుగురోజుల్లో సెమిస్టర్‌ పరీక్షలు ఉండగా బలవంతంగా.. రూ. 7లక్షలు చెల్లిస్తామని విద్యార్థుల నుంచి అండర్‌టేకింగ్‌ తీసుకుని హాల్‌టికెట్లను జారీ చేశారు.తమ పిల్లలను తీవ్రంగా వత్తిడి చేసి అండర్‌ టేకింగ్‌ తీసుకున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.స్వీడన్‌ వర్సిటీకి వెళ్లి చదువుకునే అవకాశం ఉండిఉంటే..అక్కడే పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసి ఫీజులు చెల్లించేవారని, నైపుణ్యాలు కూడా సాధించేవారని అంటున్నారు. అక్కడకు వెళ్లి చదవకపోయినా అంతఫీజు ఇక్కడ చెల్లించాలనడంలో న్యాయం లేదంటున్నారు. కొవిడ్‌ మొదటి దశలో విద్యార్థులకు అవకాశమిచ్చి.. తీవ్రంగా ఉన్న సెకండ్‌వేవ్‌లో విద్యార్థులకు ఆ అవకాశం ఇవ్వకపోవడం దారుణమని వాపోతున్నారు. స్వీడన్‌వర్సిటీ అధికారులు కూడా మీ వర్సిటీలోనే విద్యార్థులు డిగ్రీ పూర్తి చేస్తే అభ్యతరం లేదని లేఖ రాసిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. హైకోర్టు తీర్పును కూడా వర్సిటీ ఉన్నతాధికారులు పెడచెవిన పెట్టడం దారుణమంటున్నారు.ఈ విషయమై వర్సిటీ రెక్టార్‌  శ్రీకాంత్‌రెడ్డిని వివరణ కోరగా.. ఈ కోర్సుకు సంబంధించి ఓ సంవత్సరం స్వీడన్‌లో చదవాలని ముందుగానే ఒప్పందం ఉందన్నారు.కొందరు విద్యార్థులు స్వీడన్‌కు వెళ్లగా..మరికొందరు హైకోర్టును ఆశ్రయించడంతో కమిటీని నియమించి దాని సిఫారసు మేరకే ఈ ఫీజు నిర్ణయించామన్నారు.కోర్సుల్లో చేరేటప్పుడు ఒకలా..ఇప్పుడు మరోలా మాట్లాడడం మంచిది కాదన్నారు.

Updated Date - 2022-06-17T06:12:25+05:30 IST