ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులకు సీఎం స్వాగతం

ABN , First Publish Date - 2022-03-13T13:24:22+05:30 IST

ఉక్రెయిన్‌ నుంచి చివరివిడతగా చెన్నై చేరుకున్న తమిళ విద్యార్థులకు మీనాంబాక్కం జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఘనస్వాగతం పలికారు. తమకు పుష్పగుచ్ఛాలతో

ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులకు సీఎం స్వాగతం

                              - కేంద్రమంత్రికి ధన్యవాదాలు


చెన్నై: ఉక్రెయిన్‌ నుంచి చివరివిడతగా చెన్నై చేరుకున్న తమిళ విద్యార్థులకు మీనాంబాక్కం జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఘనస్వాగతం పలికారు. తమకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి స్టాలిన్‌ను చూసి విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అదే సమయంలో తమిళ విద్యార్థులను స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపట్ల స్టాలిన్‌ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌కు ఫోన్‌ చేసి ధన్యావాదాలు తెలిపారు. తన విజ్ఞప్తి మేరకు ప్రత్యేక విమానాల్లో తమిళ విద్యార్థులను తరలించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌లో యుద్ధవాతావరణంలో అన్నపానీయాలు లేకుండా అలమటించిన తమిళ విద్యార్థులను సకాలంలో స్వస్థలాలకు తరలించేందుకు డీఎంకే రాజ్యసభ ఎంపీ తిరుచ్చి శివ నాయకత్వంలో ఎంపీల పర్యవేక్షక కమిటీని సీఎం నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ సభ్యులు గత పదిరోజులుగా ఢిల్లీలో ఉంటూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాల్లో ఢిల్లీ తిరిగొచ్చే తమిళ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో విమానటికెట్లు కొనుగోలు చేసి చెన్నైకి పంపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఉక్రెయిన్‌ నుంచి పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. వీరిలో తొమ్మిదిమంది తమిళ విద్యార్థులు కూడా ఉన్నారు. వీరిని తిరుచ్చి శివ నాయకత్వంలోని ఎంపీల కమిటీ సభ్యులు విమానాశ్రయంలో కలుసుకుని తమిళనాడు హౌస్‌లో బస కల్పించారు. శనివారం వేకువజామున తొమ్మిదిమంది విద్యార్థులతోపాటు ఎంపీల పర్యవేక్షక కమిటీ సభ్యులు కూడా విమానంలో చెన్నైకి చేరుకున్నారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, మంత్రులు దామో అన్బరసన్‌, ఎం. సుబ్రమణ్యం, సెంజి మస్తాన్‌, విమానాశ్రయం చేరుకుని తమిళ విద్యార్థులకు స్వాగతం పలికారు. ఆ సందర్భంగా స్టాలిన్‌ విద్యార్థులను ఆప్యాయంగా పలుకరించి, ఉక్రెయిన్‌లో వారు పడ్డ శ్రమలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థినీ పలుకరించి, వారి స్వస్థలాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమిళవిద్యార్థులను స్వస్థలాలకు చేర్చే పనులను పూర్తి చేసుకుని తిరిగొచ్చిన ఎంపీల కమిటీ సభ్యులను, ప్రవాస తమిళుల సంక్షేమ సంస్థ కమిషనర్‌ జెసింతా లాజరసన్‌ను స్టాలిన్‌ శాలువలతో సత్కరించారు.

Updated Date - 2022-03-13T13:24:22+05:30 IST