సర్కార్‌ కళాశాల సూపర్‌హిట్‌

ABN , First Publish Date - 2021-07-23T04:21:43+05:30 IST

పట్టణంలోని చారిత్రక కోటలో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు విద్యార్థుల ఆదరణ అనూహ్యంగా పెరిగింది.

సర్కార్‌ కళాశాల సూపర్‌హిట్‌
గద్వాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

- రికార్డు స్థాయిలో చేరిన విద్యార్థులు 

- 700 దాటిన అడ్మిషన్లు, ఐదేళ్లలో ఇదే అత్యధికం

- షిఫ్ట్‌ పద్ధతిలో తరగతుల నిర్వహణ 

- అదనపు గదుల నిర్మాణానికి ఎదురుచూపులు

గద్వాల టౌన్‌, జూలై 22 : పట్టణంలోని చారిత్రక కోటలో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు విద్యార్థుల ఆదరణ అనూహ్యంగా పెరిగింది. 2021-22 విద్యా సంవత్సరం కోసం ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు జూలై 20వ తేదీ నాటికే 700లు దాటాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ఈ సారి వచ్చిన అడ్మిషన్లు అల్‌టైం రికార్డు అని చెప్పవచ్చు. బైపీసీ (ఆంగ్లం)లో 88 సీట్లకు గాను 110, ఎంపీసీ (ఆంగ్లం)లో 88సీట్లకు 105,  సీఈసీలో 88 సీట్లకు 130,  హెచ్‌ఈసీలో 88 సీట్లకు 129 మంది విద్యార్థులు చేరారు. ఈ విభాగాలతో పాటు వృత్తి విద్యా కోర్సులైన ఎంఎల్‌టీలో 88 సీట్లకు 101, ఎంపీహెచ్‌ డబ్ల్యూలో 88 సీట్లకు 100 మంది విద్యార్థులు అడ్మిషన్‌ తీసుకున్నారు. అన్ని విభాగాల్లో  704 సీట్లకు గాను ఇప్పటికే 700 సీట్లు భర్తీ అయ్యాయి. అన్ని కోర్సుల్లో పరిమితికి మించి అడ్మిషన్లు రాగా, ఎంపీసీ, బైపీసీ తెలుగు విభాగంలో మాత్రం కొన్ని సీట్లు మిగిలాయి. ఇంకా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందని ప్రిన్సిపాల్‌ వీరన్న తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోకెల్లా తమ వద్దనే అడ్మిషన్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఆయన చెప్పారు. 


కళాశాల నేపథ్యం

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే తొలి డిగ్రీ కళాశాలగా గద్వాలలో 1962లో ఏర్పడిన మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ (అప్పటి హెచ్‌ఎస్‌సీ, అనంతరం పీయూసీ) కోర్సులను ప్రారంభించారు. దాదాపు 34 సంవత్సరాల పాటు డిగ్రీ కళాశాలలో అంతర్‌ భాగంగానే కొనసాగిన జూనియర్‌ కళాశాలను 1996లో విభజించి ప్రత్యేక కళాశాలగా ఏర్పాటు చేశారు. తొలుత కో ఎడ్యుకేషన్‌గా ప్రారంభమైన ఈ కళాశాల భవనంలోనే  బాలికల కోసం ప్రత్యేక జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రెండు కళాశాలల్లో  షిఫ్ట్‌ పద్దతిలో తరగతులను నిర్వహిస్తున్నాయి. ఇటీవల గద్వాల సంస్థానాదీశుల వారసులు కళాశాల పక్కనే ఉన్న తొమ్మిది గుంటల స్థలాన్ని బాలికల జూనియర్‌ కళాశాల ఏర్పాటు కోసం రిజిస్ర్టేషన్‌ చేయించి ఇచ్చారు. నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం నిధుల మంజూరు చేసింది. టెంటర్లు కూడా ఖరారైనట్లు అధికారులు పేర్కొన్నారు. 


గదుల కొరతతో ఇబ్బందులు

కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ అందుకనుగుణంగా తరగతి గదులు లేకపోవడం సమస్యగా మారింది. రెండు కళాశాలలు షిఫ్ట్‌ పద్ధతిలోనే పని చేస్తున్నా గదుల కొరత తప్పడం లేదు. బాలికల జూనియర్‌ కళాశాలను వేరోచోటుకు తరలించినా, ఉన్న కళాశాలకు కూడా మరో నాలుగు గదులు అవసరం అవుతాయి. 


ఉత్తమ బోధన, ఉత్తమ ఫలితాలే కారణం

కళాశాలలో పనిచేస్తున్న రెగ్యులర్‌ లెక్చరర్లకు తోడు, పది మంది కాంట్రాక్టు, మరో ఆరుగురు అతిథి ఉపన్యాసకులు సమర్థవంతంగా బోధన సాగిస్తున్నారు. గడచిన ఐదేళ్లుగా ఉత్తమ ఫలితాలను సాధిస్తుండటం వల్లే అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. దీంతో పాటు ప్రైవేటు కళాశాలల్లో ఫీజులు భారంగా ఉండటం తరగతి గదులు, ల్యాబుల వంటి సౌకర్యాలు అరకొరగా ఉండటంతో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలపైపు మొగ్గు చూపుతున్నారు. 

- గంగిరెడ్డి వీరన్న, ప్రిన్సిపాల్‌


కొత్త భవనం ఏర్పాటుతో సమస్యకు పరిష్కారం

సంస్థాన వారసులు ఇచ్చిన స్థలంలో బాలికల జూనియర్‌ కళాశాల నూతన భవన నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్లు పూర్తి అయ్యాయి. శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి నిధుల నుంచి స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అదనంగా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరితగతిన భవన నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. నూతన భవనం అందుబాటులోకి వస్తే సమస్య పరిష్కారమవుతుంది. 

- హృదయరాజు, జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ అధికారి

Updated Date - 2021-07-23T04:21:43+05:30 IST