చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న వాయు కాలుష్యం.. అధ్యయనంలో షాకింగ్ నిజాలు!

ABN , First Publish Date - 2022-06-04T01:39:55+05:30 IST

భారత్‌లో విపరీతంగా పెరిగిపోతున్న వాయుకాలుష్యం చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు తాజా

చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న వాయు కాలుష్యం.. అధ్యయనంలో షాకింగ్ నిజాలు!

న్యూఢిల్లీ: భారత్‌లో విపరీతంగా పెరిగిపోతున్న వాయుకాలుష్యం చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. వాయు కాలుష్యం కారణంగా చిన్నారులు శ్వాస సంబంధిత సమస్యలతోపాటు ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారని తేలింది. అహ్మదాబాద్‌లో వాయు కాలుష్యం కారణంగా దాదాపు 21 శాతం మంది ఈ సమస్యలతో బాధపడుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. మొత్తంగా 12,635 మంది చిన్నారుల్లో 2,682 మంది చిన్నారులు వాయు కాలుష్యం కారణంగా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నట్టు వివరించింది.


 ముఖ్యంగా ఆరేళ్లలోపు చిన్నారుల్లో శాస్వ సంబంధిత సమస్యలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా గాలిలో ధూళి కణాల(పీఎం 2.5)కు గురైనప్పుడు పెద్దలకంటే శిశువులు, చిన్నారులే ఎక్కువగా రుగ్మతలకు గురవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు కారణం చిన్నారులు, పిల్లల్లో ఊపిరితిత్తులు బలహీనంగా ఉంటాయని, వాయు మార్గాలు చిన్నగా ఉంటాయని, అలాగే, చాతీ గోడలు బలహీనంగా ఉండడమేనని అధ్యయనకారులు చెబుతున్నారు. రోగ నిరోధకశక్తి కూడా వారిలో అంతంత మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సేకరించిన డేటాపై 18 నెలలపాటు నిర్వహించిన అధ్యయనం తర్వాత ఈ నివేదికను వెల్లడించారు.


ఏఎంసీ మెడికల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మెడికల్ కాలేజీ, ఎల్‌జీ హాస్పిటల్‌కి చెందిన డాక్టర్ ఖ్యాతి కక్కడ్ నేతృత్వంలో పూణెలోని జహంగీర్ హాస్పిటల్‌లో పీడియాట్రిక్ ఎండోక్రినాలజీలో క్లినికల్, రీసెర్చ్ ఫెలో అయిన డాక్టర్ చిరంతప్ ఓజాతో కలిసి 18 నెలలపాటు అధ్యయనం నిర్వహించిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. ఈ అధ్యయన ఫలితాలు ‘ఏరోసోల్ అండ్ ఎయిర్ క్వాలిటీ రీసెర్చ్ మ్యాగజైన్’లో ప్రచురితమయ్యాయి.  


Updated Date - 2022-06-04T01:39:55+05:30 IST