AUలో చదువు జీవితాన్ని మార్చేసింది

ABN , First Publish Date - 2022-08-13T20:14:55+05:30 IST

భారతదేశంతో తాము బలమైన దౌత్య సంబంధాలు కోరుకుంటున్నామని ఇథియోపియా ఫెడరల్‌ మినిస్టర్‌(Federal Minister of Ethiopia) (ఉమెన్‌ అండ్‌ సోషల్‌ ఎఫైర్స్‌) ఎర్గోగి టిస్‌ఫాయె పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం(Andhra University) పూర్వ

AUలో చదువు జీవితాన్ని మార్చేసింది

భారత్‌తో దౌత్య సంబంధాలు కోరుకుంటున్నాం

ఇథియోపియో ఫెడరల్‌ మినిస్టర్‌ టిస్‌ఫాయె


విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): భారతదేశంతో తాము బలమైన దౌత్య సంబంధాలు కోరుకుంటున్నామని ఇథియోపియా ఫెడరల్‌ మినిస్టర్‌(Federal Minister of Ethiopia) (ఉమెన్‌ అండ్‌ సోషల్‌ ఎఫైర్స్‌) ఎర్గోగి టిస్‌ఫాయె పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం(Andhra University) పూర్వ విద్యార్థి అయిన ఆమె ఈ నెల 8న ఢిల్లీలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ (ఐసీసీఆర్‌) అవార్డును స్వీకరించారు. శుక్రవారం ఆంధ్రా యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్సలర్‌ ప్రసాద్‌రెడ్డి(Vice Chancellor Prasad Reddy)తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఇథియోపియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారీ భారత్‌ తన సహకారాన్ని అందిస్తుంటుందన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవడం తన జీవితాన్ని మలుపు తిప్పిందన్నారు. భారత్‌ తనకు సొంత ఇంటితో సమానమని, ఏయూని అమితంగా ప్రేమిస్తానని చెప్పారు. గతంలో ఏయూలో చదువుకున్న విద్యార్థులు ఇథియోపియాలో మంత్రులుగా, విశ్వవిద్యాలయాల ఉపకులపతులుగా సేవలందించారన్నారు. విద్య, ఇంక్యుబేషన్‌ రంగాల్లో ఏయూ భాగస్వామ్యాన్ని తాము కోరుకుంటున్నట్టు ఆమె వెల్లడించారు. ఇథియోపియాలో ఏయూ పూర్వ విద్యార్థుల కోసం అలూమ్నీ ఏర్పాటు చేయాలన్నారు. ఏయూ వైస్‌ చాన్సలర్‌ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇథియోపియాలో భారతీయ పూర్వ విద్యార్థుల సంఘం శాఖను ప్రారంభిస్తామన్నారు. ఇంక్యుబేషన్‌, స్టార్టప్‌ రంగాల్లో వారికి తమ సహకారం అందిస్తామన్నారు. ఫుడ్‌, సైన్స్‌, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో డ్యూయల్‌ డిగ్రీలు అందించే దిశగా చర్చించినట్టు పేర్కొన్నారు. ఏయూ ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ డీన్‌ ధనుంజయరావు మాట్లాడుతూ.. ఏయూలో 53 దేశాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారని, ఇథియోపియా నుంచి ఏటా 40 మంది ప్రవేశాలు పొందుతున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో ఇథియోపియా డిఫెన్స్‌ యూనివర్సిటీ కమాండెంట్‌ హబ్తాము తిలేన్‌ పాల్గొన్నారు. ఇథియోపియా ఫెడరల్‌ మినిస్టర్‌ ఎర్గోగి టిస్‌ఫాయె, తిలేన్‌ దంపతులను ఏయూ తరఫున సత్కరించి జ్ఞాపికను అందించారు.

Updated Date - 2022-08-13T20:14:55+05:30 IST