సైకిల్‌ షెడ్‌ లేక విద్యార్థుల అవస్థలు

ABN , First Publish Date - 2021-03-03T06:34:12+05:30 IST

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సైకిల్‌ షెడ్‌లు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

సైకిల్‌ షెడ్‌ లేక విద్యార్థుల అవస్థలు
పామూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎండలో ఉంచిఉన్న సైకిళ్లు

పామూరు, మార్చి 2: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సైకిల్‌ షెడ్‌లు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ఆరుబయటే సైకిళ్లు పెట్టుకోవాల్సి రావడంతో అవి ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయి. ఖరీదైన సైకిళ్లు తుప్పు పట్టి మరమ్మతులకు గురౌతున్నాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పామూరు ఉన్నత పాఠశాలతో పాటు కంభాలదిన్నె, బొట్లగూడూరు, లక్ష్మినర్సాపురం, వీరభద్రాపురం, చిలంకూరు, మార్కొండాపురం, వగ్గంపల్లి గ్రామాల్లో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. పామూరు ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో మినహా మిగిలిన ఉన్నత పాఠశాలల్లో విశాలమైన క్రీడాప్రాంగణాలు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల నీడలో విద్యార్థులు తమ సైకిళ్లను పెట్టుకుంటున్నారు. అయితే 950 మంది విద్యార్థులున్నా.. పామూరు ఉన్నత పాఠశాలలో చెట్లు లేకపోవడం,  సరైన స్థలం కూడా లేకపోవడంతో ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న డ్రైనేజీ రోడ్లపైనే సైకిళ్లు పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పామూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు గోపాలపురం, చింతలపాలెం, మోట్రావులపాడు, నుచ్చుపొద, డీవీపాలెం, తూర్పుకోడిగుడ్లపాడు, దూబగుంట, బుక్కాపురం తదితర గ్రామాల నుండి విద్యార్థులు సైకిళ్లపై వస్తారు. చెట్లు లేకపోవడంతో ఆరుబయటే సైకిళ్లు పెట్టుకోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తోడ్పాటు ఎలా ఉన్నా దాతలైన స్పందించాల్సిన అవసరం ఉందని పలువురు వ్యాక్యానిస్తున్నారు.

Updated Date - 2021-03-03T06:34:12+05:30 IST