జిల్లాలోని 25 సబ్‌ సెంటర్ల నిర్మాణానికి రూ.5కోట్లు

ABN , First Publish Date - 2020-11-29T05:42:23+05:30 IST

గ్రామీణ ప్రజావైద్యంలో కీలకమైన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాల కల్పన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) సంకల్పించింది.

జిల్లాలోని 25  సబ్‌ సెంటర్ల నిర్మాణానికి రూ.5కోట్లు
అసంపూర్తిగా ఉన్న తంగెడుపల్లి పీహెచ్‌సీ

రూ.16లక్షల వ్యయంతో ఒక్కో సబ్‌ సెంటర్‌ నిర్మాణం

300 గజాల స్థలం కేటాయిస్తేనే పనులు ప్రారంభం

భువనగిరి టౌన్‌, నవంబరు 28: గ్రామీణ ప్రజావైద్యంలో కీలకమైన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాల కల్పన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) సంకల్పించింది. ఈమేరకు మొదటిదశగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆరోగ్య కేంద్రాలకు శాశ్వత భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 25ఆరోగ్య ఉపకేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు రూ.4 కోట్లు మంజూరుచేసింది. అలాగే అసంపూర్తిగా ఉన్న తంగెడుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన పనుల పూర్తికి రూ.40లక్షలు త్వరలో మంజూరుకానున్నాయి. పక్కా భవనాల నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందేఅవకాశాలు ఉన్నాయి. 


జిల్లాలో 137 ఆరోగ్య ఉపకేంద్రాలు 

జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), 137 ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు (సబ్‌ సెంటర్స్‌) ఉన్నాయి. పీహెచ్‌సీలన్నింటికీ పక్కా భవనాలు ఉండగా 45 సబ్‌సెంటర్లకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగతా 92 సబ్‌ సెంటర్లు అద్దె భవనాలు లేదా ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల, గ్రామ పంచాయతీ తదితర ప్రభుత్వ భవనాల్లో అరకొర  సౌకర్యాల నడుమ కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయిలో భవనం లేకపోవడంతో గ్రామీణ ప్రజలకు అవసరమయిన వైద్య సేవలు అందడంలేదు. ఈ నేపఽథ్యంలో సబ్‌ సెంటర్లన్నింటికీ పక్కా భవనాలను నిర్మించే లక్ష్యంతో మొదటి దశలో జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 92 సబ్‌ సెంటర్లకు ఒక్కొక్కటి రూ.16లక్షల వ్యయంతో 25సబ్‌ సెంటర్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించి స్థూలంగా రూ.4కోట్ల నిధులను  ప్రభుత్వం మంజూరుచేసింది. మిగతా సబ్‌ సెంటర్లకు తదుపరి దశలలో పక్కా భవనాలను నిర్మించనున్నారు. అలాగే అసంపూర్తిగా ఉన్న తంగెడుపల్లి పీహెచ్‌సీ భవన నిర్మాణానికి రూ.40లక్షలు మంజూరు కానుండగా, బీబీనగర్‌ పీహెచ్‌సీకి కూడా మంజూరు కానున్నట్లు తెలిసింది. 


300 గజాలు కేటాయిస్తేనే సబ్‌ సెంటర్‌ నిర్మాణం 

ఎన్‌హెచ్‌ఎం నిబంధనల మేరకు 300 గజాల విస్తీర్ణంలో సబ్‌సెంటర్‌ను నిర్మించాల్సి ఉంటుంది. ఈమేరకు జిల్లాకు మంజూరైన 25 సబ్‌ సెంటర్ల భవన నిర్మాణాలకోసం అద్దె భవనాల్లో కొనసాగుతున్న సబ్‌సెంటర్ల గ్రామాల్లో 300 గజాల స్థలాన్ని రెవెన్యూ శాఖ కేటాయించాల్సి ఉంది. ఇందుకోసం మొదట గ్రామ పంచాయతీలు 300గజాల స్థల కేటాయింపుకోసం తీర్మాణం చేసి జిల్లా రెవెన్యూ శాఖకు నివేదించాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ తీర్మాణం మేరకు జిల్లా రెవెన్యూ శాఖ 300గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిచాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్న సబ్‌ సెంటర్లకు బదులు పూర్తిస్థాయిలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న సబ్‌ సెంటర్ల భవనాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఎం ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. దీంతో ప్రైవేట్‌ భవనాల్లో కొనసాగుతున్న సబ్‌ సెంటర్లలో మొదటగా స్థల కేటాయింపు జరిపిన 25 గ్రామపంచాయతీల్లో శాశ్వత సబ్‌ సెంటర్ల భవనాలను నిర్మించనున్నారు. అయితే గ్రామ పంచాయతీలు స్థల కేటాయింపునకు తీర్మాణం చేసినప్పటికీ జిల్లా రెవెన్యూ యంత్రాంగం సకాలంలో భూమిని కేటాయించాల్సి ఉంటుంది. సకాలంలో భూ కేటాయింపు జరుగని పక్షంలో మంజూరైన నిధులు వెనక్కి మళ్లే అవకాశాలు ఉంటాయని ఎన్‌హెచ్‌ఎం అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

Updated Date - 2020-11-29T05:42:23+05:30 IST