అమలాపురం రెవెన్యూ డివిజన్‌కు సబ్‌కలెక్టర్‌ హోదా

ABN , First Publish Date - 2020-08-08T09:23:23+05:30 IST

కోనసీమ ప్రత్యేక జిల్లాగా ఆవిర్భవించ నున్న నేపథ్యంలో అమలాపురం రెవెన్యూ డివిజనల్‌ ..

అమలాపురం రెవెన్యూ డివిజన్‌కు సబ్‌కలెక్టర్‌ హోదా

యువ ఐఏఎస్‌ అధికారి హిమాన్షుకౌశిక్‌ నియామకం

జిల్లా ఆవిర్భావం నేపథ్యంలో చోటుచేసుకున్న మార్పు

హర్షం వ్యక్తంచేస్తున్న కోనసీమవాసులు


అమలాపురం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): కోనసీమ ప్రత్యేక జిల్లాగా ఆవిర్భవించ నున్న నేపథ్యంలో అమలాపురం రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయానికి ఐఏఎస్‌ అధికారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డివిజన్‌ ఆవిర్భావం తరువాత తొలిసారిగా ప్రభుత్వం యువ ఐఏఎస్‌ అధికారి అయిన హిమాన్షుకౌశిక్‌ను అమలాపురం సబ్‌కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో జిల్లాలో పునర్‌వ్యవస్థీకరణ చేపట్టనున్న దృష్ట్యా ప్రభుత్వం ముందస్తుగా రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయానికి ఐఏఎస్‌ అధికారిని సబ్‌కలెక్టర్‌గా నియమించడం పట్ల కోనసీమలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు గ్రూప్‌-1 అధికారులను ఆర్డీవోలుగా నియమించేవారు. ఇప్పుడు ఐఏఎస్‌ అధికారిని నియమించడంతో ఆర్డీవో కార్యాలయ హోదా కూడా సబ్‌ కలెక్టర్‌ స్థాయికి పెరిగే అవకాశం ఉంది. హిమాన్షుకౌశిక్‌ పశ్చిమగోదావరి జిల్లాలో ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పనిచేశారు.


వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన కలిగిన ఐఏఎస్‌ అధికారి తొలిసారిగా కోనసీమకు సబ్‌కలెక్టర్‌ హోదాలో నియమితులు కావడంతో ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో అమలాపురంలో కౌశిక్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. పాలనా పరమైన మార్పులతో కోనసీమకు ఐఏఎస్‌ ర్యాంకు అధికారి రావడంతో రెవెన్యూతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 

Updated Date - 2020-08-08T09:23:23+05:30 IST