సబ్‌ కలెక్టరేట్‌.. కొత్త జిల్లా పాలనా కేంద్రం!

ABN , First Publish Date - 2020-11-14T06:59:37+05:30 IST

నూతనంగా ఆవిర్భవించనున్న విజయవాడ జిల్లాకు పరిపాలనా కేంద్ర కార్యాలయంగా విజయవాడ సబ్‌ కలెక్టరేట్‌ కార్యాలయాన్ని వినియోగించుకునే ఆలోచనలో అధికారులున్నారు.

సబ్‌ కలెక్టరేట్‌..  కొత్త జిల్లా పాలనా కేంద్రం!
సబ్‌కలెక్టర్‌ కార్యాలయ భవనం

కలెక్టరేట్‌ వెనుక బహుళ అంతస్థుల భవన నిర్మాణం! 

ప్రభుత్వానికి ప్రతిపాదన పంపే యోచనలో యంత్రాంగం 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

నూతనంగా ఆవిర్భవించనున్న విజయవాడ జిల్లాకు పరిపాలనా కేంద్ర కార్యాలయంగా విజయవాడ సబ్‌ కలెక్టరేట్‌ కార్యాలయాన్ని వినియోగించుకునే ఆలోచనలో అధికారులున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లనునట్టు సమాచారం. సబ్‌ కలెక్టరేట్‌ కార్యాలయం వెనక బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మిస్తే, ఇక్కడే కలెక్టరేట్‌ను పూర్తి స్థాయిలో కొనసాగించవచ్చుననే ఆలోచనలో అధికారులున్నట్టు తెలుస్తోంది. మచిలీపట్నంలోని కలెక్టరేట్‌ తరహాలోనే, విజయవాడ సబ్‌ కలెక్టరేట్‌ భవనం కూడా బ్రిటీషు కాలంలోనే నిర్మితమయింది. కలెక్టరేట్‌తో పోల్చుకుంటే సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం చిన్నదే. కలెక్టర్‌ కార్యాలయానికి, కలెక్టర్‌ పేషీకి మినహా మిగిలిన విభాగాలకు, ఇతర శాఖలకు మాత్రం ఇది చాలదు. ఇది విజయవాడ నడిబొడ్డున మహాత్మాగాంధీ రోడ్డు వెంబడే ఉండటం వల్ల ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు ప్రస్తుత సబ్‌ కలెక్టరేట్‌ చాలా సౌకర్యంగా ఉంటుంది. సబ్‌ కలెక్టరేట్‌ భవనం ఒక్కటే కలెక్టరేట్‌ అవసరాలను తీర్చదు కాబట్టి, భవనం వెనక ఉన్న స్థలంలో మ్యూజియం రోడ్డు సరిహద్దు నుంచి ఇన్‌కంట్యాక్స్‌ ఆఫీసు సరిహద్దు వరకు బహుళఅంతస్థుల భవనాన్ని నిర్మిస్తే మరో చోట అద్దె భవనాలు చూసుకోవాల్సిన అవసరం ఉండదని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వెనుక దాదాపు ఖాళీగా ఉంది. వెనుక భాగంలో ఓ చిన్న భవనంలో ఎన్‌ఐసీ విభాగం ఉంది. దీనికి అభిముఖంగా ఉన్న భవనంలో ప్రీ లిటిగేషన్‌ ఫోరం, జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయం ఉంది. వీటిని తొలగించి, జీప్లస్‌ 5, లేదా జీప్లస్‌ 6 భవనం నిర్మిస్తే కలెక్టరేట్‌ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చునని ఆలోచిస్తున్నారు. ఈ కార్యాలయ ఆవరణలోనే ఎన్నికల సంఘానికి చెందిన ఈవీఎం, బ్యాలెట్‌ బాక్సుల గోడౌన్‌ ఉంది. పాత గోడౌన్‌ శిథిలావస్థకు చేరింది. ఈవీఎంలను మాత్రం కొత్త గదిలోకి మార్చారు. ఈ గోడౌన్‌ను కూడా తొలగించి, కొత్తది నిర్మించాల్సి ఉంటుంది. బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మిస్తే, దానిలోని ఒక బ్లాక్‌ను కేటాయించాలన్న ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 

ప్రస్తుత సబ్‌ కలెక్టర్‌ చాంబర్‌ చిన్నదిగా ఉంది. దీని వెనుక సబ్‌ డివిజినల్‌ మేజిస్ర్టేటు హాల్‌ ఉంది. దీనిని కూడా సబ్‌ కలెక్టర్‌ చాంబర్‌తో కలిపివేస్తే విశాలమైన కలెక్టర్‌ చాంబర్‌ ఏర్పడుతుంది. చారిత్రక సబ్‌కలెక్టరేట్‌ భవనం రూపు మార్చకుండానే అంతర్గత అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుత సబ్‌ కలెక్టరేట్‌ ఉద్యోగుల చాంబర్‌ను కలెక్టర్‌ పేషీగా ఉపయోగించుకోవచ్చు. ఇదీ సరిపోలేదనుకుంటే లోపల ఉన్న ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌ విభాగానికి కేటాయించిన చాంబర్‌ను, డివిజనల్‌ సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయానికి, స్టాటిస్టికల్‌ విభాగానికి కేటాయించిన చాంబర్లను కూడా కలెక్టర్‌ పేషీ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. కలెక్టర్‌ శాఖా పరంగా నిర్వహించే సమావేశాల కోసం ఎలాగూ అధునాతన సదుపాయాలతో ఏసీ కాన్ఫరెన్స్‌ హాల్‌ ఉండనే ఉంది. వీడియో కాన్ఫరెన్స్‌, ఇతర అవసరాలకు తగినట్టు ఈ కాన్ఫరెన్స్‌ హాల్‌ను మార్చుకోవచ్చు. కలెక్టరేట్‌ సెక్షన్లు, విభాగాల అవసరాలను బహుళ అంతస్థుల భవనం తీర్చుతుంది. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలను పంపించాలని జిల్లా యంత్రాంగం భావిస్తున్నట్టు సమాచారం. అద్దె భవనాలకు బదులు శాశ్వత ప్రాతిపదికన అన్నీ ఒకచోటే ఉంటాయని అధికార యంత్రాంగం భావిస్తోంది. జిల్లాల ప్రక్రియ పూర్తి స్థాయిలో కొలిక్కి రావటానికి మార్చి వరకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. ఈ లోపు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి, భవన నిర్మాణం చేపట్టడం ద్వారా విజయవాడ జిల్లా కలెక్టరేట్‌ అవసరాలను తీర్చటానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

Updated Date - 2020-11-14T06:59:37+05:30 IST