వ్యవసాయంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగాలి-Niranjan reddy

ABN , First Publish Date - 2022-05-05T23:39:58+05:30 IST

వ్యవసాయంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

వ్యవసాయంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగాలి-Niranjan reddy

హైదరాబాద్: వ్యవసాయంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.వ్యవసాయ యాంత్రీకరణలో ఊబర్, ఓలా తరహా సేవలు అందస్తే అది విప్లవాత్మక మార్పుకు నాందీ అవుతుందన్నారు.వ్యవసాయ రంగంలో ఈ తరహా సేవలు అందుబాటులోకి రావాలన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా ములుగు ఆచార్య కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన విధానాలపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ 2వ సమావేశం జరిగింది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖా మంత్రి తారక రామారావు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ , వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వ్యావసాయంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వల్ల కోట్లాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అందుకే వ్యవసాయ యాంత్రీకరణపై దృష్టి సారించాలన్నారు.రైతువేదికలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని, ఐటీ శాఖ సహకారంతో రైతులకు వ్యవసాయంలో మెళకువలు తెలుసుకునేందుకు సాయం అందించాలని పేర్కొన్నారు. వ్యవసాయంలో తెలంగాణ నేడు దేశానికి ఆదర్శంగా వుందని మంత్రి తెలిపారు. తెలంగాణలో పప్పు, నూనెగింజల పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు.రైతుబంధు అందుకుంటున్న వారిలో 92.5 శాతం మంది ఐదెకరాల లోపు వారేనని,5 నుండి 10 ఎకరాలు ఉన్నవారు ఆరుశాతం ఉన్నారన్నారు. 


ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారుల ఆలోచనా విధానం మారాలన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అన్నది ఒక్క చైనాలోనే సాధ్యం అయింది .. నాకున్న సమాచారం ప్రకారం అది మరెక్కడా సాధ్యం కాలేదు.2022 వరకు మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని విఫలమయ్యారని విమర్శించారు.దేశంలో దాదాపు 60 - 65 శాతం జనాభా వ్యవసాయం , దాని అనుబంధ రంగాల మీద ఆధారపడిందని, కానీ దేశ జీడీపీలో దాని వాటా 15 శాతం దాటడం లేదన్నారు. వ్యవసాయంలో  రైతుకు ఆదాయం ఎలా వస్తుందో ఆలోచన చేయాలి.చైనా, ఇజ్రాయిల్ లలో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.1987 లో చైనా-ఇండియా జీడీపీ సమానంగా వుందన్నారు.35 ఏళ్లలో చైనా 16 ట్రిలియన్ డాలర్లకు చేరింది. 



కానీ ఇండియా 3 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉందన్నారు.తెలంగాణలో వరి మళ్లలో చేపలు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.ఈ దిశగా ప్రయత్నించాలని సూచించారు.వ్యవసాయానికి ఆధునికతను జోడిస్తే యువత ఈ దిశగా మళ్లే అవకాశం ఉందన్నారు. మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయం చేసే రైతుకు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయరంగం ఆర్థికంగా బలపడేందుకు చేయూతనివ్వాలన్నారు.ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహించేందుకు క్షేత్రస్థాయి సందర్శనకు పంపిస్తున్నామని చెప్పారు.మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పంటల వైవిధ్యీకరణపై పెద్ద ఎత్తున దృష్టి సారించాలన్నారు. ఆ మేరకు రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.

Read more