ఎస్‌..ఐయ్యా..బాబూ!

ABN , First Publish Date - 2022-05-16T06:40:05+05:30 IST

న్యాయం.. అన్యాయం. పోలీస్‌ శాఖలో నిత్యం వినబడే మాటలివి.. అయితే సొంత శాఖలోనే అన్యాయం జరుగుతుంటే సరిదిద్దే వారే కానరావడం లేదు..

ఎస్‌..ఐయ్యా..బాబూ!

ఎస్‌ఐలుగా చేరి పన్నేండళ్లయినా పదోన్నతులు నిల్‌ 

2009 బ్యాచ్‌లో 150 మంది చేరిక

45 శాతం మందికే పదోన్నతులు

ఎస్‌ఐలుగానే 55 శాతం మంది 

సీనియార్టీ ఉన్నా పదోన్నతికి దూరం 

ఒత్తిడిలో పలువురు ఎస్‌ఐలు

హోం మంత్రి దృష్టి పెట్టాలని డిమాండ్‌


న్యాయం.. అన్యాయం. పోలీస్‌ శాఖలో నిత్యం వినబడే మాటలివి.. అయితే సొంత శాఖలోనే అన్యాయం జరుగుతుంటే సరిదిద్దే వారే కానరావడం లేదు.. ఉన్నత స్థాయి అధికారులు సైతం పట్టించుకోవడం లేదు.. సర్వీసు ఉన్నా పదోన్నతుల్లేక పదుల సంఖ్యలో ఎస్‌ఐలు నేటికి ఎదురుచూపులు చూస్తున్నారు. తమ బ్యాచ్‌కు చెందిన కొంత మంది సీఐలుగా పదోన్నతులు పొందితే..  తమలో ఏమి లోపమో కానరాక తలలు పట్టుకుంటున్నారు. రాజమహేంద్రవరం పక్కన కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న హోం మంత్రి వనిత అయినా తమ సమస్యను పట్టించుకుని.. పదోన్నతులు కల్పించాలని వేడుకుంటున్నారు. 


రాజమహేంద్రవరం సిటీ, మే 15 : పోలీస్‌ శాఖలో ఎస్‌ఐ ఉద్యోగం సాధించడమంటే మాటలా.. ఆ ఉద్యోగ సాధనకు ఎంతో తపన.. పట్టుదల ఉంటాయి.. ఎందుకంటే మిగిలిన ఉద్యోగాలు వేరు.. పోలీస్‌ ఉద్యోగం వేరు.. ఆ తపనతో ఉద్యోగంలో జాయిన్‌ అయిన వారు ఉన్నతాధికారులు చేష్టలతో ఒత్తిడికి గురై ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. తాము అనుకున్న లక్ష్యాలను చేరలేక సతమతమవుతున్నారు. శాఖ పరమైన అవాంతరాలను అధిగమించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత స్థాయిలో విధులు నిర్వహిస్తే సేవలు మరింత విస్తృతం చేసేందుకు వీలుగా ఉంటుందని భావించిన వారికి చుక్కెదురవుతోంది. గత 12 ఏళ్ళుగా ఎస్‌ఐలుగా వివిధ ప్రాంతాల్లో సేవలందించిన ఎస్‌ఐలే దీనికి ఉదాహరణ.. కీలకమైన కేసుల్లో చాకచక్యంగా సేవలందించి నేటికీ పదోన్నతులకు ఆశగా ఎదురుచూస్తున్నారు.


ఎస్‌ఐలపై చిన్నచూపెందుకో..


 సీఐల నుంచి మొదలుకుని డీఎస్పీల వరకు అన్ని పదోన్నతులు పక్కాగా జరుగుతున్నాయి. కాని ఎస్‌ఐల పదోన్నతులు మాత్రం ఎందుకో ఆలస్యమవుతున్నాయి. దీంతో బాధిత ఎస్‌ఐలు పదోన్నతులకు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏలూరు రేంజ్‌లో  2009 బ్యాచ్‌కు చెం దిన 150 మంది ఎస్‌ఐలలో 70 మందికి మాత్రమే పదోన్నతులు లభించాయి. 2021 వరకు ఈ పదోన్నతులు ఇచ్చారు.  మిగిలిన 80 మందికి ఇప్పటి వరకూ పదోన్నతుల్లేవు. ఒకే బ్యాచ్‌కు చెందిన వారిలో కొంత మంది సీఐలు కావడం 55 శాతం మంది నేటికి పదోన్నతులు లేకపోవడంతో ఎస్‌ఐలుగానే ఉండిపోయారు. తమ సహచరులుగా పనిచేసివారు ఉన్నత కేడర్‌కు వెళ్లడం తాము ఇంకా ఎస్‌ఐలు గానే మిగిలిపోవడంతో పలువురు ఒత్తిడికి గురవుతున్నారు. ఒక బ్యాచ్‌కు చెం దిన వారందరికి పదోన్నతులు కల్పించడంలో పోలీస్‌ శాఖ మీనమేసాలు లెక్కించడంతో ఎస్‌ఐలుగా పనిచేస్తున్నవారు విసుగుచెందుతున్నారు. 


ఇంక్రిమెంట్లు వద్దు.. పదోన్నతులు ఇవ్వండిచాలు..


ఎస్‌ఐల పదోన్నతుల విషయంలో పలు విమర్శలు హల్‌చల్‌ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇప్పటికే డబ్బులు లేని పరిస్థితి.. జీతాలకు కటకటలాడిపోతున్నారు.ఈ నేపథ్యంలో ఉద్యోగులకు         పదోన్నతులు కల్పిస్తే వారికి ఇంక్రి మెంట్లు, ఇతర సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ప్రస్తతం అంత బడ్జెట్‌ ప్రభుత్వం వద్ద లేకపోవడంతో పదోన్నతుల విషయంలో ఎటూ పాలుపోని పరిస్థితి ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయం పోలీస్‌ శాఖ లో గుప్పుమంటుంది. అయితే ఇంక్రిమెంట్లు అవసరంలేదని తమకు పదోన్నతులు కల్పిస్తే అటుపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కబడ్డాక చూడవచ్చనే వాదన పోలీస్‌ల నుంచి వ్యక్తమౌతుంది. 2009 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఎస్‌ఐలు వివిధ కారణాలతో మరణించిన సంగతి వెలుగులోకి వచ్చింది. పని ఒత్తిడి, మానసిక సంఘర్షణతో ఇద్దరు ఎస్‌ఐలు గుండెపోటుకు గురై మరణించగా , మరొక ఇద్దరు కరోనా సమయంలో విధినిర్వహణలో ఆశువులు బాశారు. మరొక ఇద్దరు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. ఇలా వివిధ కారణాలతో మరణించిన వారికి మొత్తం బ్యాచ్‌ అంతా బాసటగా నిలిచింది.  


జూనియర్లుగా పని చేయలేక..


2009 బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఐలు నూతన జిల్లా విభజన తర్వాత కొత్త ప్రాంతాల్లో జూనియర్లుగా సేవలందించాల్సిన పరిస్థితులు రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో తమకు పదోన్నతులు కల్పించి ఉంటే బాగుండనని ఎస్‌ఐలు భావిస్తున్నట్టు తెలిసింది. పన్నేండేళ్ల సర్వీసు ఉన్న ఎస్‌ఐలు వేరొక చోట మళ్లీ జూనియర్లుగా సేవలందించడం అంటే కొంత కష్టతరమే.ఈ నేపథ్యంలో ఇంటా బయటా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. సర్వీసు ఉండి ఇదేంటిరా బాబూ అంటూ వాపోతున్నారు. అయితే నూతన డీజీపీ అయినా సమస్యను అర్ధం చేసుకుని పదోన్నతులు కల్పిస్తారని ఎస్‌ఐలు భావిస్తున్నారు. హోం మంత్రి కూడా తమ పదోన్నతుల విషయమై ఉన్నతాధికారులతో చర్చించాలని పలువురు ఎస్‌ఐలు డిమాండ్‌ చేస్తున్నారు. 


Updated Date - 2022-05-16T06:40:05+05:30 IST