సుబ్బరాజుకు కన్నీటి వీడ్కోలు

ABN , First Publish Date - 2021-04-18T05:56:47+05:30 IST

మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు అంత్యక్రియలు ముత్యాలంపాడులోని స్వర్గపురిలో శనివారం జరిగాయి.

సుబ్బరాజుకు కన్నీటి వీడ్కోలు

 అజిత్‌సింగ్‌నగర్‌, ఏప్రిల్‌ 17: మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు అంత్యక్రియలు ముత్యాలంపాడులోని స్వర్గపురిలో శనివారం జరిగాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, రాష్ట్ర, జిల్లా నేతలతోపాటు పలు పార్టీల నాయకులు, నగర ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. గురువారం అర్ధరాత్రి గుండెపోటుకు గురై మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు భౌతికకాయాన్ని అభిమానుల సందర్శన కోసం హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌ వద్ద ఉంచారు. సుబ్బరాజు భౌతికకాయం వద్ద సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి  రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో నారాయణ మాట్లాడుతూ కమ్యూనిస్టుగానే రాజకీయ జీవితం ప్రారంభించి కమ్యూనిస్టుగానే మరణించిన సుబ్బరాజు ధన్యజీవి అని కొనియాడారు. సుబ్బరాజు మరణం కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటని, ఆయన మృతి పట్ల సీపీఐ కేంద్ర కమిటీ తరపున సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నామన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమంలో సుబ్బరాజు, తాను కలిసి పని చేశామని గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రి వడ్డే శోభానాద్రీశ్వరరావు, సీపీఐ సీనియర్‌ నేత ఈడ్పుగంటి నాగేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు చలసాని వెంకటరామారావు, అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌లతోపాటు పలువురు కార్మిక, ఇతర ప్రజాసంఘాల నేతలు నివాళులర్పించారు. అనంతరం దాసరి భవన్‌ నుంచి లోటస్‌పాండ్‌ మార్క్‌కు భౌతికకాయం తీసుకువెళ్లి, అక్కడి నుంచి అంతిమయాత్ర ముత్యాలంపాడు స్వర్గపురి వరకు కొనసాగింది.  



Updated Date - 2021-04-18T05:56:47+05:30 IST