సీట్లు లేవు

ABN , First Publish Date - 2022-06-29T06:27:49+05:30 IST

తాడేపల్లి గూడెం సుబ్బారావుపేట మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో చదువుకునేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు.

సీట్లు లేవు
తాడేపల్లిగూడెంలో సుబ్బారావుపేట పాఠశాల

సుబ్బారావుపేట స్కూల్‌లో హౌస్‌ఫుల్‌

వసతులు అరకొరే కానీ అక్కడ సీటుకు డిమాండ్‌

పెద్ద నాయకులతో సిఫారసు.. అయినా నో చాన్స్‌

తాడేపల్లిగూడెం రూరల్‌, జూన్‌ 28 : తాడేపల్లి గూడెం సుబ్బారావుపేట మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో చదువుకునేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఈ కారణంగా అక్కడ సీటు దొరకవడం కష్టంగా మారింది. ఇక్కడ  600 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంది. అంతకు మించి చేర్పించాలంటే అక్కడ కూర్చునేందుకు అవకాశం లేదు. దీంతో అక్కడ చేర్పించేందుకు పెద్ద పెద్ద నాయకులతో సిఫారసు చేస్తుంటారు. పదేళ్లుగా ఇదే పరిస్థితి. మొదటి నుంచి  ఇంగ్లీష్‌ మీడియం బోధన చేస్తుండడంతో పట్టణం నుంచే కాదు సమీప గ్రామాల నుంచి విద్యార్థులు ఈ పాఠశాలలో చేరతారు. వీరు చదువులో మెరుగైన ఫలితాలు సాధించడం వల్లే పాఠశాలలో సీటుకు మహా డిమాండ్‌ ఏర్పడింది. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 


వసతుల లేమి.. టీచర్ల కొరత

పాఠశాల వసతుల విషయంలో ప్రభుత్వం చిన్నచూపే చూస్తోంది. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు ఐదు క్లాసుల్లో రెండు సెక్షన్‌ల కింద పది క్లాస్‌ రూంలు ఉన్నాయి. అవన్నీ నిండిపోయాయి. పాఠశాలలో నాడు–నేడు పథకం కింద రూ.3 లక్షల నిధులు విడుదలైన స్థలం లేని కారణంగా ఆ నిధులు మురిగిపోయాయి. ఇక విద్యార్థుల రోస్టర్‌ ప్రకారం 21 మంది ఉపాధ్యాయులకు గాను పాఠశాలలో రెగ్యులర్‌ టీచర్‌లు 11 మందే ఉన్నారు. నలుగురు డిప్యూటేషన్‌ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వీరిని మినహాయించినా మరో ఆరుగురు టీచర్లను భర్తీ చేయాలి.  


విద్యా ప్రమాణాలతో బోధన  

మా పాఠశాలలో విద్యా ప్రమాణాలతో పాటు క్రమశిక్షణ బాగుంటుంది.  విద్యార్థుల నైపుణ్యా న్ని పరీక్షించి బోధన చెబుతాం. దీనివల్లే ఫలితాలు బాగున్నాయి.  మౌలిక వసతులు అందిస్తే మరింత మెరుగ్గా పాఠశాలను ముందుకు తీసుకెళ్తాం.

         – కె.వనజ, హెచ్‌ఎం  


సీట్లు చాలా తక్కువ 

పాఠశాలలో సీట్లు చాలా తక్కువ గా ఉంటాయి. ఉన్న వసతులకు అనుగుణంగా 600 మంది విద్యార్థులనే పాఠశాలలో చేర్చుకునే వీలుంది. దీంతో సీట్లు లభించక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తగినన్ని గదులు ఏర్పాటుచేస్తే మరింత మందిని చేర్చుకునే అవకాశం ఉంటుంది. 

    – బీవీ నారాయణ, టీచర్‌


పాఠశాలకు సీట్ల కోసం రావద్దు 

పెదతాడేపల్లి అంబేడ్కర్‌ న్యూ పాఠశాలలో బోర్డు 

పెదతాడేపల్లి బీఆర్‌ అంబేడ్కర్‌ న్యూ గురుకుల పాఠశాలలో సీట్లు లేవని.. ఎవరూ సీట్ల కోసం రావద్దంటూ ఉపాధ్యాయులు బ్యానర్‌ ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో విద్యార్థులు ఇటు విద్యలోనూ, అటు కల్చరల్‌ కార్యక్రమాల్లోనూ ప్రతిభ కనబరుస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు. దీంతో ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. పాఠశాలలో 530 మంది విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఉన్నా ఐదో తరగతి అడ్మిషన్‌.. పరీక్ష పద్ధతిలో జరుగుతుంది. పదో తరగతి ప్రవేశానికి అవకాశం లేదు. ఎవరైనా మధ్యలో స్కూల్‌ మానేస్తేనే ఆ సీటు వేరేవారికి ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. పిల్లలను చేర్చుకునే అవకాశం లేకపోవడంతో చేసేదేమి లేక ఇలా బోర్డు  ఏర్పాటు చేశామని ప్రిన్సిపాల్‌ బి.రాజారావు తెలిపారు. 


Updated Date - 2022-06-29T06:27:49+05:30 IST